
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఇవాల నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో నవీన్ వైపే సీఎం రేవంత్‌రెడ్డి మొగ్గు చూపింనట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి రేస్‌లో నుంచి తప్పుకున్నట్లు బొంతు రామ్మోహన్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయిస్తుందని.. ఉప ఎన్నికలో పార్టీ గెలుపు కోసం పనిచేస్తానంటూ బొంతు రామ్మోహన్ తెలిపారు.
అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. హైదరాబాద్‌లో పార్టీ బలహీనపడిందనే అంచనాల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికను గెలుచుకున్న ఆ పార్టీ.. జూబ్లీహిల్స్‌లోనూ గెలుపే మంత్రంగా ముందుకెళ్లనుంది. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌లు దీనిపై ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
మంత్రులు గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌లతో పాటు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నేతలు రంగంలోకి దిగి పని మొదలు పెట్టారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచనతో పార్టీ నేతలు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, పేర్లను పరిశీలించారు.. అయితే సీఎం రేవంత్ నవీన్ వైపే ఆసక్తి చూపించినట్లు తెలిసింది.