
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం లోకేశ్ ఇంట్లో గొడవ చేస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో తండ్రిని మించిన అవినీతిలో లోకేశ్ మునిగి పోయారని విమర్శలు చేశారు. భయంకరమైన కుట్రలకు చంద్రబాబు ఆద్యుడు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మోసాలను సింగపూర్ ప్రభుత్వం గ్రహించింది అంటూ కామెంట్స్ చేశారు.
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి తాజాగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవి కోసం లోకేశ్ ఇంట్లో గొడవలు పెడుతున్నాడు. కుటుంబ కలహాలు పెరిగాయి. లోకేశ్‌ను అందుకే చంద్రబాబు పొగుడుతున్నారు. సరిగ్గా చదువుకోని లోకేశ్‌ను మంత్రిని చేశారు. చంద్రబాబును మించిన అవినీతిపరుడు లోకేశ్. చంద్రబాబు ప్రతీ విషయంలోనూ డ్రామాలు ఆడుతున్నారు. భయంకరమైన కుట్రలకు చంద్రబాబు ఆద్యుడు. ఢిల్లీలో పనిచేసే ఇతర దేశాల విలేకర్లకు నెలవారీ జీతాలు ఇస్తున్నారు. పాకిస్తాన్ జర్నలిస్టులకు కూడా చంద్రబాబు డబ్బులు పంపుతున్నారు. పదే పదే 90 దేశాలు అంటూ చంద్రబాబు మాట్లాడే మాటల వెనుక చాలా కథ ఉంది.
అందుకే రామోజీకి భూమి..
చంద్రబాబు మోసాలను సింగపూర్ ప్రభుత్వం గ్రహించిందిఅందుకే ఆయన్ను సింగపూర్ ప్రభుత్వం దూరం పెట్టింది. కుట్రలు పన్నటంలో చంద్రబాబును లోకేశ్ మించి పోయాడు. ఇప్పుడు లోకేశ్ భజన చేయటంలో ఎల్లో మీడియా పోటీ పడుతోంది. పత్రికలను అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్ మనుషులను పార్టీకి దూరం చేశారు. తనకు ఇష్టమైన వారిని దగ్గర చేర్చుకుని, ఎన్టీఆర్ టీమ్‌ని వెళ్లగొట్టారు. తాను అడిగిన వందలాది ఎకరాల భూమిని రామోజీరావుకు ఎన్టీఆర్ ఇవ్వలేదు. ఆ కోపంతో ఉన్న రామోజీరావుని చంద్రబాబు దగ్గరకు చేర్చుకున్నారు. ఆ తర్వాత నుండి చంద్రబాబు తన కుట్రలకు మరింత పదును పెట్టారు.

అన్నింటా బాబు మనుషులే..
ఎన్టీఆర్ గెలుపు వెనుక నేను ఉన్నానని నాపై కుట్రలు పన్నారు. నన్ను రాజ్యాంగేతర శక్తి అంటూ నాపై ఆరోపణలు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బిల్‌గేట్స్‌ని మించిన ధనవంతుడ్ని కావాలని చంద్రబాబుకు కోరిక ఉండేది. అందుకే విపరీతమైన అవినీతి, అక్రమాలు, కుట్రలు చేస్తూ వస్తున్నారు. పరిపాలన చేతగాని చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ బతుకుతున్నారు. తండ్రిని మించిన అవినీతిలో లోకేశ్ మునిగి పోయారు. ఇసుక, మద్యంలో తండ్రీ కొడుకుల అవినీతి తారాస్థాయికి చేరింది. ఇక్కడ సంపాదించిన డబ్బంతా సింగపూర్‌లో పెట్టుబడి పెడుతున్నారు. సీబీఐ, ఈడీ సహా అనేక న్యాయ వ్యవస్థల్లో చంద్రబాబు మనుషులు ఉన్నారు. తాము దోచుకున్న డబ్బుతో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. ఈ అవినీతి ప్రభుత్వం ఎంతోకాలం నిలవదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.