సాక్షి, కాకినాడ జిల్లా: కూటమి సర్కార్ పోకడలు చూస్తే.. ఇది ప్రజాస్వామ్యమా? అనిపిస్తుందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. మనం బాగుండాలనే స్వలాభమే కనిపిస్తుంది తప్ప.. ప్రజల బాగు కోసం ఆలోచించడం లేదు’ అని చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘గత చంద్రబాబు పాలనలో లిక్కర్ స్కామ్ అవినీతి జరిగిందని 2023లో సీఐడీ కేసు పెట్టింది. ఇప్పుడు అదే సీఐడీ అధికారులు ఈ కేసుకు, మాకు సంబంధం లేదని వాంగూల్మం ఇచ్చారు. చంద్రబాబు తన మీద కేసును తానే విచారించుకుని.. తానే తీర్పు ఇచ్చేస్తున్నాడు. క్యాబినెట్ తీర్మానం.. ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా మద్యం విషయంలో అప్పట్లో నిర్ణయాలు జరిగాయి. తన మీద కేసును ఆయనే కొట్టేసుకుంటున్నారు.
..నిజంగా చంద్రబాబు నిరాపరాధి అయితే.. ఈ కేసును ఎందుకు కోర్టు ద్వారా విచారించుకోవడం లేదు. ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను బెదిరిస్తున్నారు. చంద్రబాబు పోరాటం.. ఆరాటం ఎందుకు జరుగుతుంది?. ప్రభుత్వ సొమ్ముతో సిద్దార్ధ లూథ్రా అనే న్యాయవాధికి ఫీజులు ఇచ్చి కేసులు వాదించుకుంటున్నాడు. చంద్రబాబు హయం లో స్కిల్ స్కామ్, ఇన్నర్ రోడ్డు వంటి పలు కేసులు ఉన్నాయి.
..చంద్రబాబుది ఎప్పుడు డబుల్ యాక్షనే. ఎన్నికలకు ముందు ఒక యాక్షన్.. ఎన్నికలు అయ్యాక మరో యాక్షన్. అప్పులు.. గొప్పలు.. అబద్ధాలు తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు. చంద్రబాబు చేసే ఒక్క రోజు అప్పుతో ఒక మెడికల్ కళాశాల పూర్తవుతుంది. ఒక అరటిపండు అర్ధ రూపాయికి అమ్ముకునే పరిస్థితి రైతులకు దాపురించింది. వైఎస్ జగన్ హయంలో టన్ను అరటి రూ.25 వేలకు అమ్ముడు పోయింది. చంద్రబాబు రియల్ ఇంటిలెన్స్ ఏమైపోయింది?. చౌకగా వైజాగ్‌లో భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నాడు. గత 18 నెలల కాలంలో కొత్తగా ఎన్ని పెన్షన్లు ఇచ్చారో చెప్పాలి’’ అంటూ కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు.


