పెదపూడి: చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై ఎస్.తులసిరామ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. 2016లో రామేశ్వరంలో ఒక మూగ వ్యక్తి అనారోగ్యం, ఆకలితో ఉన్నప్పుడు అదే గ్రామానికి చెందిన కె.రామలింగేశ్వరరావు చేరదీశారు. అప్పటి నుంచి రామలింగేశ్వరరావు ఇంటి వద్ద ఆ వ్యక్తి ఉంటున్నాడు. మృతునికి వివరాలు అవసరమని రామలింగేశ్వరరావు ఇంటి వద్ద పని చేస్తున్న గుండు కామరాజు ఇంటి పేరుపై గుండు శివుడు (30)గా ఆధార్‌కార్డు తయారు చేయించారు. శివుడికి అప్పుడప్పుడు పిట్స్ వస్తుంటాయి. ఈ నేపథ్యంలో గత నెల 19న శివుడు దుస్తులు ఉతికి మేడపై ఆరబెట్టడానికి వెళుతున్నప్పుడు పిట్స్ వచ్చి పడిపోయాడు. ఆ విషయం రామలింగేశ్వరరావు, కామరాజు తదితరులు కొంత సమయం వరకూ చూడలేదు. అనంతరం చూసిన వారు శివుడ్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.


