కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి జరిగింది. సహోద్యోగి అయిన ఓ మహిళ తన కుటుంబ సభ్యులు, అనుచరులతో కలసి ఈ దాడికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. కాకినాడ జీజీహెచ్‌లో కాటూరి రాజు పదహారేళ్లుగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురువారం అక్కడే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న పోతుల దుర్గాదేవితో మాట్లాడుతూ, ఆర్‌ఎంసీలో పనిచేస్తున్న నీ భర్త తన సహోద్యోగి అయిన మరో మహిళతో చనువుగా ఉంటున్నాడన్న ప్రచారం జరుగుతోందని, జాగ్రత్త అని సూచించాడు. ఈ విషయాన్ని దుర్గాదేవి కాకినాడ జీజీహెచ్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సేరు దుర్గకు చెప్పింది. మీ చెల్లి నా భర్తపై రాజు అసభ్యంగా మాట్లాడుతున్నాడని అంది. దీంతో సేరు దుర్గ తన కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు, అనుచరులు మొత్తం 40 మందితో కలిసి శుక్రవారం మెడికల్ వార్డు ఎదుట విధుల్లో ఉన్న రాజుపై దాడి చేయించింది. రాజును తీవ్రంగా కొడుతుండగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్న రామలక్ష్మి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. వారంతా రామలక్ష్మిపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో ఆమెకు శ్వాస ఆడక కుప్పకూలిపోగా, రాజు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇరువురినీ ఆసుపత్రి సిబ్బంది సాయంతో అత్యవసర విభాగంలో చేర్చారు. ఆసుపత్రి అధికారులు దాడికి కారణాలపై ఆరా తీశారు. సేరు దుర్గ ఆమె కుమారులు, అనుచరులపై కాకినాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.


