
సాక్షి, సిద్ధిపేట: ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్ వెళ్లారు. తన తండ్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కవిత లేఖపై చర్చ జరిగినట్లు సమాచారం. కవిత లేఖ నేపథ్యంలో ఇద్దరి భేటీపై ఆసక్తి నెలకొంది. సుమారు గంటన్నర సాగిన ఈ సమావేశంలో కాళేశ్వరం నోటీసులతో పాటు తాజా పరిస్థితులపై చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన అంశాలను బహిరంగపరిచి క్యాడర్‌ను గందరగోళానికి గురి చేశారని కేసీఆర్‌కు కేటీఆర్ వివరించినట్టు సమాచారం.
కాగా, కవిత లేఖ బీఆర్‌ఎస్ పార్టీలో కలకలం రేపుతోంది. ‘కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు’ఉన్నాయంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘అంతర్గత విషయాలను ప్రస్తావించేందుకు పార్టీ వేదికలు ఉంటాయి. అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉంటుంది. ఆఫీసు బేరర్స్‌ను కలిసి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుటుందంటూ నిన్న(శనివారం) జరిగిన సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యానించారు.
‘‘ఈ సూత్రం వాళ్లకు వీళ్లకు కాదు.. పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ వర్తిస్తుంది. ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన బీఆర్‌ఎస్‌లో అధ్యక్షుడు కేసీఆర్‌కు లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగా సూచనలిస్తూ ఎవరైనా లేఖలు రాయొచ్చు. అయితే పార్టీలో ఏ హోదాలో ఉన్న వారైనా కొన్ని అంతర్గత విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది’అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
