Kommineni Srinivasa Rao: ఢిల్లీలో లోకేష్‌ పరిస్థితేంటి.. ఎంపీల మధ్య ఎందుకు దాక్కున్నాడు?

KSR Comments Over Chandrababu Case And AP Assembly Sessions - Sakshi

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు వారికే అర్ధం అవడం లేదు. తమకు అనుకూలమైన వాదన లేదు కనుక ఏదో రకంగా పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇన్ని రోజులు శాసనసభ వెలుపల టీడీపీ కానీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి మీడియా కానీ.. అసలు స్కామే లేదని ప్రచారం చేశాయి. తీరా శాసనసభ సమావేశాలు ఆరంభమైతే అలా తమ వాదన వినిపించడానికి బదులు రచ్చ రచ్చ చేస్తున్న తీరు వారు సెల్ప్ గోల్ వేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఆత్మరక్షణలో పడినవారు ఎలా ఇబ్బంది పడతారో తెలుగుదేశం నేతల పరిస్థితి కూడా అలాగే ఉంది. 

శాసనసభ సమావేశాల తొలి రోజున టీడీపీ ఎమ్మెల్యేలు సభలో రచ్చ చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యత చర్చకు ఇవ్వలేదు. వారు వాయిదా తీర్మానం పేరుతో గందరగోళం సృష్టించడానికి, అరుపులు, నినాదాలు, కేకలు పెట్టడానికే యత్నించారు. నటుడు, హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమాలలో మాదిరి మీసాలు మెలివేయడం, తొడలు గొట్టడం వంటివి చేసి విమర్శలకు గురయ్యారు. మంత్రి అంబటి రాంబాబుతో గొడవపడి రా చూసుకుందాం అని అనిపించుకునే వరకు వెళ్లారు. తన తండ్రి ఎన్‌టీ రామారావును  పదవి నుంచి దించేసినప్పుడు, ఆయనపై చెప్పులు వేసినప్పుడు ఈ మీసాలు తిప్పడం ఏమైందని బాలకృష్ణను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ సభ్యులు రెచ్చగొట్టినప్పుడు కొందరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కూడా స్పందించారు. అయితే, వారెవరూ స్పీకర్ పట్ల అనుచితంగా వ్యవహరించలేదు. 

స్పీకర్ పోడియం వద్దకు వెళ్లడం నిబంధనల ప్రకారం తప్పు. అయినా ఏదో నిరసన చెప్పడానికి వెళ్లినా కొద్దిసేపు ఉండి వెనక్కి వచ్చేస్తే పద్దతిగా ఉంటుంది. కానీ, టీడీపీ సభ్యులు స్పీకర్‌తో దారుణంగా ప్రవర్తించారు. కొంతసేపు ఓపిక పట్టిన ఆయన ఆగ్రహంతో యూజ్‌లెస్‌ ఫెలోస్ అని కూడా అన్నారంటే పరిస్థితి ఏ విధంగా తయారైందో అర్ధం చేసుకోవచ్చు. ఆయన టేబుల్‌పై ఉన్న కాగితాలు చింపడం, మానిటర్‌ను పాడు చేయడానికి యత్నించడం, గ్లాసులోని నీళ్లు కింద పోసి పేపర్లను తడపడం వంటి అల్లర్లకు టీడీపీ ఎమ్మెల్యేలు తెగబడ్డారు. అబద్దానికి గొంతు ఎక్కువ అన్నట్లు, వీరు ప్రవర్తించారే తప్ప, స్కిల్ స్కాంపై చర్చ సిద్దమన్నట్టుగా ప్రవర్తించలేదు. ఈ స్కాంలో చంద్రబాబుకు ఎలాంటి పాత్ర లేదని చెప్పగలిగే వాదన ఉన్నట్లయితే చర్చకు సిద్దపడేవారు. అందులోనూ సీనియర్ నేత, బాగా మాట్లాడతారని భావించే ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా నిబంధనలకు విరుద్దంగా వీడియో తీయడం, అల్లర్లలో పాల్గొనడం చూస్తే అదంతా కావాలని చేసినట్లనిపిస్తుంది. 

సభలో ఉంటే  ఆ చర్చలో పాల్గొని స్కామ్‌ను సమర్దించలేక యాతన పడాల్సి ఉంటుంది కనుక కేశవ్  తెలివిగా సభాకాలం మొత్తం సస్పెండ్ అయ్యారా అనిపిస్తుంది. కాకపోతే కేశవ్ బాగా మాట్లాడతారని అందువల్లే  ఆయనను సభ నుంచి బయటకు పంపించారని టీడీపీ అనవచ్చు. సాధారణంగా సభలో సీనియర్ ఎమ్మెల్యేలు, చర్చలో వాదించగలిగినవారు సస్పెండ్ అవకుండా జాగ్రత్తపడతారు. అలా చేయలేదంటే ఈ చర్చ జరగడం వారికి ఇష్టం లేదనిపిస్తుంది. ప్రభుత్వం, అందులోనూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాక్ష్యాధారాలతో సహా కుంభకోణంలో చంద్రబాబు పాత్రను వివరిస్తుంటే అది వినాలంటే వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్లే అల్లరి రూట్ ఎంపిక చేసుకున్నట్లుగా ఉంది. ఈ గొడవలో వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా పాల్గొని సస్పెండ్ అయ్యారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా  అంతే చేస్తుంటారు. ఇప్పుడు టీడీపీ వైపునకు వెళ్లి అదే పనిచేశారు. ఆయనతో పాటు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా అనుచిత ప్రవర్తనకు గాను సభాకాలం అంతటికి సస్పెండ్ అయ్యారు. 

అయితే, ఈ మొత్తం వ్యవహారాన్ని ఈనాడు దినపత్రిక ఢీ అంటే ఢీ అనో, దద్దరిల్లిన సభ అనో హెడ్డింగ్‌ పెట్టి సరిపుచ్చుకుంది. టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన అల్లరి, అరాచకాన్ని మాత్రం కనిపించకుండా కవర్ చేసే యత్నం చేసింది. గతంలో టీడీపీ హయాంలో కోడెల శివప్రసాదరావు స్పీకర్‌గా ఉన్నప్పుడు ఆయనను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఒక చిన్న మాట అన్నా, మొదటి పేజీలో ప్రముఖంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆగ్రహం అంటూ కథనాలు ఇచ్చేది. అలాంటిది ఇప్పుడు స్పీకర్ సీతారాంపైకి టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లి నానా రభస చేసినా దాని డైవర్ట్ చేస్తూ రాసింది. అలాగే, సీతారాం.. టీడీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డా దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీని తానే మోస్తున్నానని భావిస్తున్న ఈనాడు మీడియా, దాని అధిపతి రామోజీరావు ఈ రకంగా విలువల వలువలు వదిలేయడం పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదు.

మరోవైపు లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తమ అధినేత చంద్రబాబు అరెస్టు అవడాన్ని చంద్రయాన్ చర్చలో లేవనెత్తడం విడ్డూరంగా ఉంది. ప్రయోగం సక్సెస్ అయిన రోజున టీడీపీ నేతలు  చంద్రయాన్ సఫలం కనుక ఏపీలో చంద్రబాబు గెలుపు ఖాయమని పిచ్చి ప్రచారం చేశారు. గెలుపు సంగతేమో కానీ, చంద్రబాబు స్కామ్‌ల్లో చిక్కి జైలుపాలయ్యారు. ఇక, రామ్మోహన్ నాయుడు శాస్త్రవేత్త నంబియార్ అరెస్టుకు, చంద్రబాబు అరెస్టుకు పోలిక పెట్టారు. చంద్రబాబు మచ్చలేని నిజాయితీపరుడని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. వాస్తవం ఏమిటో రామ్మోహన్ నాయుడు ఆత్మకు తెలియదా! దీనికి ప్రతిగా వైఎస్సార్‌సీపీ ఎంపీ  మార్గాని భరత్ మాట్లాడుతూ చంద్రబాబు చేసిన స్కామ్ ను గట్టిగా వివరించారు.

నిజంగానే చంద్రబాబు స్కాంకు పాల్పడలేదని టీడీపీ ఎంపీలు నమ్మితే ఆయన పీఏ పెండ్యాల శ్రీనివాస్‌ను అమెరికా ఎందుకు పంపించివేశారో చెప్పగలరా?. అంత వరకు ఎందుకు మాజీ మంత్రి, చంద్రబాబు కుమారుడు లోకేష్‌ను ఢిల్లీలో తమ మధ్య పెట్టుకుని ఎందుకు కాపలా కాస్తున్నారో చెప్పగలరా?. ఆయన కూడా అరెస్టు అవుతారన్న భయంతోనా? కాదా?. అలాగే  బీజేపీ పెద్దలనో, లేక ఇతర పార్టీల నేతలనో కలిసి కేసులో సాయం చేయాలని ఎందుకు అడుగుతున్నట్లు?. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నేతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా మారి దిక్కుతోచక అల్లాడుతున్నారని  చెప్పాలి.


కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top