వీళ్లు పెద్ద ముదుర్లు..! సీఎం రమేష్‌, చంద్రబాబు ఒకరికొకరు | Sakshi
Sakshi News home page

వీళ్లు పెద్ద ముదుర్లు..! సీఎం రమేష్‌, చంద్రబాబు ఒకరికొకరు

Published Sun, Apr 7 2024 3:17 PM

Ksr Comments On Cm Ramesh Political Journey With Chandrababu - Sakshi

భారతీయ జనతా పార్టీ దేశంలో పాటిస్తున్న  ద్వంద్వ ప్రమాణాలకు అనకాపల్లి అభ్యర్ధి సీఎం రమేష్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ కావచ్చు. రమేష్ తనకు ఉన్న అర్ధ,హంగు బలంతో అనకాపల్లి వద్ద పోలీసులపై తిరగబడ్డ తీరు ఆశ్చర్యం ఏమీ కాదు. ఆయన గత చరిత్ర ఒకసారి చూస్తే అనేక విషయాలు తెలుస్తాయి.  ఒక చిన్న సారాయి వ్యాపారిగా ఉన్న సీఎం రమేష్ ఈ రోజు కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి. రాజకీయ సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఒక నేతగా చలామణి అవుతున్నారు.

తనపై ఎన్ని ఆరోపణలు ఉన్నా దేశ ప్రధానమంత్రి ఎదుట కూర్చోగలుగుతున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వారి సరసన నిలబడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జూబ్లీహిల్స్ లో ఒక ఇల్లు ఉంది. అందులోనే ఆయన నివసిస్తారు. ఆయన సీఎం పదవి చేపట్టాక తన ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటిని తన రాజకీయ అవసరాల కోసం తీసుకున్నారు. అందులో సర్వే కార్యకలాపాలు నిర్వహించేవారికి, పార్టీ పనులు ,ఇతరత్రా వినియోగించేవారు. విశేషం ఏమిటంటే ఆ తర్వాత కాలంలో సీఎం రమేష్ ఆ ఇంటిని కొనుగోలు చేసి ఒక భారీ భవంతి ని నిర్మించారు.

చంద్రబాబు పాత ఇల్లుకన్నా సీఎం రమేష్‌ ఇల్లే సూపర్‌గా కనిపించేది. ఆ తర్వాతకాలంలో చంద్రబాబు కుటుంబం కూడా మళ్లీ తమ ఇంటిని పునర్మించుకున్నారు.  అంతేకాదు.చంద్రబాబు వాస్తు నమ్మకాల కోసం రమేష్ కొన్న ఇంటి స్థలం నుంచి 400 గజాలు తీసుకున్నారు. ఒక మాట ఎవరైనా అంగీకరించాలి. సీఎం రమేష్ ఎదుగుదలలో చంద్రబాబుకు  పెద్ద పాత్రే ఉంది. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో  నిత్యం ఆయన కార్యాలయం చుట్టూనే రమేష్  తిరుగుతుండేవారు. ఒక మీడియా ప్రముఖుడితో కలిసి పైరవీలు,ఇతర లావాదేవీలు సాగించేవారని చెబుతారు.

ఈ మీడియా ప్రముఖుడికి, రమేష్‌కు  జిగినీ దోస్తి ఏర్పడింది.  ఒకసారి సుజనా చౌదరికి రాజ్యసభ సీటు ఇవ్వాలని చంద్రబాబు ప్రతిపాదించినప్పుడు ఆ మీడియా ప్రముఖుడికి కోపం వచ్చింది. తన సన్నిహితుడు సీఎమ్‌ రమేష్‌కు  రాజ్యసభ సీటు ఇవ్వకుండా సుజనాకు  ఇస్తారా అని ఆగ్రహించి, సుజనాపై ఒక పెద్ద వ్యతిరేక స్టోరీని బ్యానర్‌గా ఇచ్చారు.అందులో సుజనాకుఉన్న బోగస్ కంపెనీలు ఇతరత్రా అనేక విషయాలను ప్రచురించారు. దాంతో చంద్రబాబు రాజీ చేసుకుని, సీఎమ్‌ రమేష్‌కు తదుపరి టర్మ్‌లో పదవి ఇవ్వవలసి వచ్చిందని టీడీపీ వర్గాలు చెబుతుంటాయి.

రమేష్ తండ్రి కుప్పంలో సారా వ్యాపారం చేస్తుండేవారు.అప్పటికి ఇంకా చిన్నవాడు అయిన రమేష్ కుప్పంలో చదివేవాడట. తదుపరి అతను రైల్వే  కోడూరులో ఇంటర్ వరకు చదివారట. ఆ తర్వాత పదేళ్లకు ఈయన యువకుడు అయి వ్యాపారంలోకి వచ్చారు. ఆ క్రమంలో రాయదుర్గం నుంచి సారా సాచెట్లు  తెప్పించి వాటిలో సారా నింపి తమిళనాడుకు అక్రమ రవాణా చేస్తుండగా, తండ్రితో సహా రమేష్‌ను పోలీసులు అరెస్టు చేశారని ఆయన గురించి తెలిసినవారు గుర్తు చేస్తున్నారు.

మరో కేసులో సీఎం రమేష్ తండ్రిని పి.డి చట్టం కింద కూడా అరెస్టు చేసి చంచల్ గూడ జైలులో ఉంచారట. ఈ దశలో రాజకీయ రంగంలో ముఖ్యులను ఆశ్రయించితే కేసుల నుంచి బయటపడవచ్చని తెలుసుకున్న రమేష్ అప్పట్లో కడప జిల్లాలో మంత్రిగా ఉన్న ఒక కాంగ్రెస్ నేతతో సంబంధాలు పెట్టుకున్నారు. ఆయన కూడా సాయం చేసి వీరిని కేసుల నుంచి బయటపడేశారు. అప్పటికి చంద్రబాబుతో రమేష్‌కు పెద్దగా సంబంధాలు లేవు. ఆ రోజుల్లో అసెంబ్లీలో కూడా రమేష్ ,ఆయన తండ్రిపై వచ్చిన ఆరోపణలను,వారిని రక్షించిన కాంగ్రెస్ మంత్రికి, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడుకు మద్య  అసెంబ్లీలో వాగ్వాదం జరిగింది.

చంద్రబాబు అప్పట్లో రమేష్ సన్నిహితులతో మంత్రికి ఉన్న  సంబంధం పై ఆరోపణలు గుప్పించగా,  చంద్రబాబుపైనే మంత్రి ప్రత్యారోపణలు చేశారు. చంద్రబాబును కూడా రమేష్ ఆకట్టుకోవడానికి ప్లాన్ చేసి సఫలం అయ్యారు. చంద్రబాబు తిరుపతి వస్తుంటే ,అక్కడ పత్రికలలో స్వాగత ప్రచార ప్రకటనలు ప్రచురించారట. దాంతో చంద్రబాబుకు ఈయనపై ఆసక్తి కలిగి  టచ్‌లో పెట్టుకున్నారు. అప్పటి నుంచి వీరి మధ్య ఆర్ధిక సంబంధం ఏర్పడింది. తదుపరి అది రాజకీయ సంబంధంగా కూడా మారింది.

ఇంతలో చంద్రబాబు తన మామ ఎన్.టి.రామారావును కూలదోసి ముఖ్యమంత్రి కావడంతో రమేష్ తన పట్టు బిగించడం ఆరంభించారు.పైరవీల స్థాయి నుంచి కాంట్రాక్టర్ అవతారం ఎత్తగలిగారు. కుప్పంలో ఎన్నికలు జరిగినప్పుడు పోట్లదుర్తి నుంచి ఒక వందమందిని తీసుకుని వెళ్లి చంద్రబాబు కోసం పనిచేసేవారట. దొంగ ఓట్లు మొదలు వివిధ కార్యకలాపాలను ఈ బృందం నిర్వహించేదట. ఆ రకంగా చంద్రబాబుతో బంధం పెనవేసుకుని పోయింది. చంద్రబాబు కూడా ఈయనకు ఇరిగేషన్ తదితర కాంట్రాక్టులు వచ్చేందుకు సహకరించారన్న  ప్రచారం ఉంది.

ఆ రకంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ఆర్ధిక సామాజ్రాన్ని ఏర్పరచుకోగలిగారు.వందల ఎకరాల భూములు సంపాదించారు. హైదరాబాద్‌లో స్థిరాస్తులు సమకూర్చుకున్నారు. ఒక విమానం కొనుగోలు చేసే  దశకు వెళ్లగలిగారు. ఈ మధ్యనే ప్రముఖ నటుడు వేణు ఈయనపై ఒక ఫిర్యాదు చేస్తూ 450 కోట్ల మేర ఫోర్జరీ చేసి మోసం చేశారని ఆరోపించారు.  బ్యాంకుల నుంచి రుణాలు పొందడం, వాటిలో కొంతమేర ఎగవేయడం తదితర ఆరోపణలు కూడా వచ్చాయి. 2019 ఎన్నికల సమయంలో తన ఇంటికి వచ్చిన ఆదాయపన్ను  శాఖ అధికారులపై కూడా దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు.  

అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు  సైతం సీఎం రమేష్, సుజనా చౌదరి వంటివారిపై కేంద్రం అక్రమ కేసులు పెడుతోందని, ఐటీ, సీబీఐ అక్రమ దాడులు చేస్తోందని ఆరోపించేవారు. ఆ ఎన్నికలలో టీడీపీ ఓటమి చెందడంతో సీఎమ్‌ రమేష్ ,సుజనా చౌదరి , టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు వెంటనే బీజేపీలో చేరిపోయారు. అప్పటివరకు బీజేపీని తిట్టిన రమేష్, సుజనాలు తమపై ఉన్న ఆర్దిక నేరారోపణల నేపథ్యంలో జాగ్రత్తపడ్డారని అంతా భావించారు.

బీజేపీలో చేరిన వెంటనే వీరంతా ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట కూర్చుని తెలుగు ప్రజలను ఆశ్చర్యపరిచారు. బీజేపీలోలో చేరితే ఎన్ని ఆరోపణలు ఉన్నా పునీతులు అయిపోతారా అన్న  ప్రశ్న ఆ రోజే వచ్చింది.అక్కడ నుంచి మెల్లగా బీజేపీ పెద్దలను మంచి చేసుకుంటూ రమేష్ కాని, సుజనా చౌదరి కాని చంద్రబాబు  తరపున పనిచేస్తుంటారన్నది సర్వత్రా ఉన్న  అభిప్రాయం. దానికి తగ్గట్లుగానే బీజేపీ ఏపీ అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజును తప్పించి దగ్గుబాటి పురందేశ్వరికి ఆ పదవి వచ్చేలా చేసుకోగలిగారు.

ఆ తర్వాత బీజేపీపై మరింత పట్టు బిగించారు. ఇదే టైమ్ లో ముఖ్యమంత్రి జగన్‌ను వ్యతిరేకించిన ఆయన చెల్లెలు షర్మిలకు కూడా తన  విమానం సమకూర్చి ఢిల్లీకి పంపించి కాంగ్రెస్‌లో చేర్పించడానిక సహకరించారని అంటారు. ఈ రకంగా అంచెలంచెలుగా ఎదిగిన రమేష్‌ను చంద్రబాబు రెండుసార్లు రాజ్యసభకు పంపించారు. ఆ పదవి ద్వారా ఢిల్లీ స్థాయిలో కేంద్రంలో ఉన్న ప్రముఖులతో సంబంధబాంధవ్యాలు  పెట్టుకోవడంలో నేర్పరిగా రమేష్ పేరుపొందారు. ఈ క్రమంలో ఏపీ బీజేపీపై కూడా పట్టు సాధించి అనకాపల్లి  నుంచి ఆ పార్టీ పక్షాన పోటీచేయడానికి సిద్దం అయ్యారు.

2014 లో జగన్ మాతృమూర్తి విజయమ్మ విశాఖ నుంచి లోక్ సభకు  పోటీచేశారు.  అప్పట్లో తెలుగుదేశం ఒక ప్రణాళిక ప్రకారం ఒక తప్పుడు ప్రచారం చేసింది. ఆయా హోటళ్ల వద్ద, కూడళ్లలో  ,నలుగురు కూర్చున్న చోటకు ప్రత్యేకంగా నియమితులైన  టీడీపీ కార్యకర్తలతో,నారాయణ సంస్థల సిబ్బందితో కడప నుంచి వచ్చిన వారిని ఎన్నుకుంటే విశాఖలో భూములు ఆక్రమిస్తారు..గొడవలు చేస్తారు..అంటూ ప్రచారం చేయించింది. దాని ప్రభావం కూడా అప్పట్లో కొంత పడింది. ఫలితంగా విజయమ్మ ఓటమి పాలయ్యారు. విశేషం ఏమిటంటే అదే కడప జిల్లాకు చెందిన సీఎమ్‌ రమేష్ అనకాపల్లి నుంచి పోటీచేస్తున్నారు.

తన  స్వస్థలం పోట్లదుర్తి నుంచి సుమారు ఏభై మందిని అక్కడకు తరలించి ప్రచార,ఇతర కార్యాకలాపాలలో పెట్టుకున్నారట. అలాగే టీడీపీకి చెందిన నేతలకు తగు  ఆర్ధిక వనరులు సమకూర్చి టీడీపీలో ఉన్న అసమ్మతిని తగ్గించుకునేందుకు కృషి చేశారట.ఈ క్రమంలో తనకు ఎదురు  లేదని భావించిన సీఎం రమేష్ అక్కడ పోలీసు అధికారులను  భయపెట్టేలా వ్యవహరించారు. చోడవరం వద్ద జీఎస్టీ ఎగవేతకు సంబందించి తనిఖీలకు అధికారులు వెళ్లగా, ఆ సంస్థ యజమాని సీఎమ్‌ రమేష్‌కు ఫోన్‌ చేసి రప్పించారు.

ఆయన రావడంతో సీన్ సృష్టించి అధికారులు  వెళ్లిపోయేలా చేశారు. విజయమ్మ ఆ ప్రాంతంలో పోటీచేసినప్పుడు ఎలాంటి గొడవలు, దౌర్జన్యాలు జరగలేదు.  అయినా టీడీపీ, బీజేపీ అలా అసత్య ప్రచారం చేశాయి. ఇప్పుడు టీడీపీ నుంచి బీజేపీలో చేరి అనకాపల్లిలో పోటీచేస్తున్న సీఎం రమేష్ మాత్రం తన స్వరూపాన్ని బహిర్గతం చేశారు. దీనిని అనకాపల్లి ప్రాంత ప్రజలు  సహిస్తారా?  అన్నది అనుమానం. అసలే స్తానికుడు కాదన్న భావన ఉంటే,దానికి తోడు రమేష్ ,ఆయన మనుషులు దౌర్జన్యాలు  చేస్తారేమో అన్న  భయం ఏర్పడితే అది ఆయనకు మరింత నష్టం కలిగించవచ్చు.

సీఎం రమేష్ టీడీపీ రాజకీయాలలో  ఒక కీలకమైన వ్యక్తిగా,చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ఇప్పటికీ కొనసాగగలుగుతున్నారు. నిజాయితీగా వ్యాపారం నిర్వహించుకుని  పైకి వస్తే  ఎవరికి అభ్యంతరం ఉండవలసిన  అవసరం లేదు. కాని అడ్డదారుల ద్వారా వేగంగా ఎదిగినప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు.  తమ వద్ద ఉన్న ఆర్ధిక వనరులను ఉపయోగించి వీలైనంతమందిని వీరు ఆకట్టుకోగలుగుతారు. ఒక చిన్న  సారా వ్యాపారి ,ఇంత  పెద్ద ఆర్దిక సామ్రాజ్యాన్నిసృష్టించుకోవడం సమాజ వైఫల్యమా?  రాజకీయ వ్యవస్థ వైఫల్యమా అంటే ఏమి చెబుదాం?


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement

తప్పక చదవండి

Advertisement