 
													జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీకే వెన్నుపోటు పొడిచేలా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరు తెన్నులపై తీవ్ర విమర్శలు కురిపించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో సరెండర్ అవడానికి సిద్దపడుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. చంద్రబాబు ఏమి చెబితే దానికి కట్టుబడి పనిచేయడానికి పవన్ రెడీ అవుతున్న తీరు రాష్ట్ర రాజకీయాలలోనే కాదు.. దేశ రాజకీయాలలో కూడా ఆశ్చర్యకరమైన అధ్యాయంగా కనిపిస్తుంది.
దేశంలో ఏ పార్టీ కూడా తనకంటూ ఒక లక్ష్యం లేకుండా పనిచేయదు. తనతో ఉన్నవారిని కాదని, వేరే పార్టీవారిని అందలం ఎక్కించే ప్రయత్నం చేయదు. తనతో పాటు మిగిలిన సొంత పార్టీవారంతా లొంగిపోవాలన్నట్లుగా వ్యవహరించదు. వీటన్నింటికి విరుద్ధంగా పవన్ తీరు కనిపిస్తోంది. ఈ శాసనసభ ఎన్నికలలో జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారన్న అంశాన్ని పట్టించుకోవద్దని పవన్ కళ్యాణ్ అంటున్నారు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడో వంతు పదవులు తీసుకుందామని నమ్మబలుకుతున్నారు. దీనిని జనసైనికులు నమ్ముతారా? మహా అయితే ఆయన నటుడు కాబట్టి సినిమా పరంగా వచ్చే కొంతమంది అభిమానులు.. దేనికైనా ఊ కొట్టవచ్చేమోకాని, కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు ఎవరూ దీనిని నమ్మరు.
అసలు ఆత్మాభిమానం ఉన్న జనసైనికులు ఎవరూ ఇలాంటి ప్రతిపాదనలను ఒప్పుకోరు. ఎన్నికలలో పోటీచేయడానికి అడిగిన సీట్లే ఇవ్వని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.. ఒకవేళ అధికారంలోకి వస్తే మూడో వంతు పదవులను జనసేనకు ఇస్తారా? ఒకవేళ ఇస్తానని ఇప్పుడు చెప్పినంత మాత్రానా.. ఆయన వెన్నుపోటు ట్రాక్ రికార్డును పరిశీలిస్తే అది జరిగే పని కాదని అర్ధం అవుతుంది.

జనసేనకు 60 అసెంబ్లీ సీట్లు అయినా ఇవ్వాలని కాపు సంక్షేమ సేన నేత చేగొండి హరిరామజోగయ్య డిమాండ్ చేశారు. జనసేనకు ఇవ్వదగిన సీట్లను కూడా ఆయన సూచించారు. అక్కడ పోటీచేయదగిన జనసేన అభ్యర్దుల పేర్లను కూడా వెల్లడించారు. అంటే ఏమిటి దాని అర్ధం? జనసేనకు కనీసం 60 సీట్లలో పోటీచేసే సామర్ద్యం సత్తా ఉందనే కదా! దానిపై పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టుబట్టలేదు? ఇంతవరకు ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఉండాలని పవన్ ఎందుకు చెప్పడం లేదు? పైగా చంద్రబాబు కుమారుడు లోకేష్ తన పరువు తీసేలా అనుభవలేమి, అసమర్ధత గురించి ప్రస్తావించినా పవన్ ఎందుకు భరించారు? అంటే దీనంతటిలో ఏదో మతలబు ఉన్నట్లు అనిపించడం లేదా?
ముఖ్యమంత్రి పదవికి తాను అనర్హుడనని పవన్ కళ్యాణ్ నేరుగానే ఒప్పుకున్నట్లేనా? తద్వారా తనను సీఎంగా చూడాలనుకుంటున్నవారిని మరింత అవమానించినట్లు కాలేదా! ఇక్కడ ఒక సంగతి చెప్పాలి... కొన్ని రాష్ట్రాలలో చిన్న చిన్న పార్టీల నేతలు కూడా ఇలా ఇతర పార్టీలకు ఎలాంటి కండిషన్‌లు లేకుండా లొంగిపోలేదు. పైగా తమ డిమాండ్లు సాధించుకుని ముఖ్యమంత్రులయ్యారు. ఇతరత్రా పలు పదవులు సాధించుకున్నారు.

రాజకీయాలలో అదొక ప్రక్రియ. ఎవరికైనా ప్రజాసేవ కాంక్ష ఉంటే వారు అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అంతే తప్ప వేరేవారి పల్లకి మోయడానికి సిద్దపడరు. పదవికన్నా మించిన ప్రయోజనం ఉంటే తప్ప! కొన్ని ఉదాహరణలు చూద్దాం. జార్ఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, జేఎంఎం పార్టీల కూటములకు ఒకసారి కూడా మెజార్టీ రాలేదు. ఇండిపెండెంట్ గా ఎన్నికైన మధు కోడా మద్దతు ఉంటేనే ప్రభుత్వం ఏర్పరచే పరిస్థితి నెలకొంది. దానిని సదవకాశంగా తీసుకుని మధు కోడా ఏకంగా ముఖ్యమంత్రి పదవినే డిమాండ్ చేయడం, JMM కూటమి అంగీకరించడం జరిగింది. ఎందుకంటే వారు అధికారంలోకి రావాలంటే మధు కోడా మద్దతు అవసరం అయింది కనుక ఆయన షరతులకు ఒప్పుకోక తప్పలేదు. కర్నాటకలో 2013 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీలలో ఎవరికి సంపూర్ణ మెజార్టీ రాలేదు. అప్పుడు JDS కీలకం అయింది. ఆ పార్టీ నేత కుమారస్వామి తనకు సీఎం పదవి ఇస్తేనే జతకడతానని స్పష్టం చేశారు. దాంతో కాంగ్రెస్ ఆయనకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. ఆయన్ను ముఖ్యమంత్రి చేయాల్సి వచ్చింది. అంతకుముందు మరోసారి బీజేపీ కూడా ఆయన సీఎం అభ్యర్ధిత్వాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది.

చిన్న పార్టీ అయినా రాజకీయ వ్యూహం పన్ని తమ లక్ష్యాన్ని చేరుకోవాలని ఎవరైనా చూస్తారు. కాని పవన్ కళ్యాణ్ మాత్రం తన పార్టీని, క్యాడర్‌ను వేరే పార్టీ ప్రయోజనం కోసం జనసేనను తనఖా పెట్టేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు పదో, పరకో సీట్లను టీడీపీ ఇచ్చినా తీసుకోవాలని, త్యాగాలకు సిద్దం అవ్వాలని పవన్ కళ్యాణ్ తరచుగా తన పార్టీవారికి సముదాయిస్తున్నారు. టీడీపీతో సంప్రదింపులు జరపకుండానే, బేషరతుగా రాజమండ్రి జైలు వద్ద పొత్తు ప్రకటన చేసి, తన పార్టీని అలాగే సైకిల్ పార్టీ వారిని విస్తుపరిచారు. అదే లైన్‌లో రాజకీయం చేస్తూ, ఇప్పుడు పోటీ చేయడానికి సీట్లు లేకపోయినా టీడీపీని మోయాలని సూచిస్తున్నారు. ఈ ప్రకటన చూసిన జనసేన కార్యకర్తలకు ఒక్కసారే గుండె ఆగినంత పనై ఉంటుంది. ఈయనేదో కాసిన్ని ఎక్కువ సీట్లు తీసుకుని తమందరికి అవకాశాలు ఇస్తారని అనుకుంటే పూర్తిగా చేతులెత్తేశారని, ఇప్పుడే ఇలా చేస్తే, భవిష్యత్తులో అధికారంలోకి ఒకవేళ వచ్చినా చంద్రబాబు ఎందుకు పట్టించుకుంటారన్న డౌట్‌ను వ్యక్తం చేస్తున్నారు.
2014లో టీడీపీకి జనసేన పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చింది. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఒక్క సీటుకు కూడా పోటీచేయకుండా, పవన్ కల్యాణ్ పక్క పార్టీకి ప్రచారం చేశారు. మరి అప్పుడు జనసేనకు ఎన్ని పదవులు ఇచ్చారు? అసలు ఆ దిశగా చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఏదో పవన్ కళ్యాణ్ తన సన్నిహితుడు ఒకరికి టీటీడీ పదవి.. అది కూడా సభ్యుడి పదవి ఇప్పించుకోవడం మినహాయించి. అప్పుడు ఎందుకు జనసేనకు మూడో వంతు పదవులు కోరలేదు? కేవలం చంద్రబాబు పంపించే ప్రత్యేక విమానాలలో హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లి.. సన్మానాలు చేయించుకున్నారే తప్ప కార్యకర్తలు, నేతల గురించి పవన్ పట్టించుకున్నారా! నిజానికి 2014లో పవన్ కళ్యాణ్ గ్లామర్ కొంత పనిచేసింది. ఆ తర్వాత ఈయన తీరును గమనించిన ప్రజలు, జనసేన కార్యకర్తలు రియలైజ్ అయి పార్టీకి దూరం అయ్యారు. 2019లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలో కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. అదేమిటంటే జనసేన కార్యకర్తలను బలిచేసి, తాను ఒక్కడినైనా గెలవాలన్నది ఆయన ఉద్దేశం. ఆ మాట పైకి చెప్పకుండా ఎన్నికల తర్వాత మూడో వంతు పదవులు అంటూ కొత్త ఆశలు కల్పించాలని యత్నిస్తున్నారు.

టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చే పరిస్తితి లేదు. ఒకవేళ పొరపాటున వచ్చినా, జనసేనపై ఆదారపడే పరిస్తితి లేకపోతే టీడీపీ వీరికి ఎందుకు పదవులు ఇస్తుంది. ఏదో ముష్టి వేసినట్లు ఒకటి, అరా తప్ప పదవులు రావు. ఎందుకంటే ఐదేళ్లుగా టీడీపీ నేతలే పదవులు లేకుండా ఆవురావురు మంటున్నారు. వాళ్లకు పదవులు ఇవ్వకుండా జనసేనకు మూడో వంతు పదవులు కట్టబెడితే టీడీపీ పని గోవింద అవుతుంది. ఆ సంగతి చంద్రబాబుకు బాగా తెలుసు. నిజంగానే చంద్రబాబుకు అంత త్యాగబుద్ది ఉంటే ఇప్పుడే జనసేనకు అరవై సీట్లు ఇవ్వవచ్చు కదా! లేదూ కనీసం నలభై నుంచి ఏభై సీట్లు ఇవ్వవచ్చు కదా! రెండు పార్టీలకు భలం ఉందనుకుంటే జనసేన పోటీచేసే చోట్ల టీడీపీ సంపూర్ణంగా మద్దతు ఇవ్వవచ్చు కదా! జనసేన సపోర్టు కావాలి? జనసేనకు మాత్రం బలం లేని చోట్ల టీడీపీ మద్దతు ఇచ్చి గెలిపించలేదన్నమాట. దీనిని బట్టే ఏమి అర్ధం అవుతుంది.
త్యాగాలు జనసైనికులవి. గెలిస్తే పదవులు, భోగాలు టీడీపీ వారివి అన్నమాట. ఈ సంగతి పైకి చెప్పకుండా పవన్ కళ్యాణ్ కొత్త డ్రామాకు తెరదీశారన్నమాట. పైగా పదేళ్లపాటు పొత్తు ఉంటుందని ఇప్పటికే చెప్పారు. అంటే దీని ప్రకారం జనసైనికులు ఎప్పటికీ టీడీపీ సేవకులుగానే మిగిలి ఉండాలన్నమాట. ఈ రకంగా జనసేన భవిష్యత్తుకు పార్టీ అధినేతే సీల్ వేసేశారన్నమాట. ఈ మొత్తం ప్రక్రియను జాగ్రత్తగా పరిశీలిస్తే జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడవడానికి సిద్దపడ్డారని అనుకోవచ్చు.
కాగా టీడీపీ వారితో పొత్తు బీజేపీకి ఇష్టం లేదని, తనుఒత్తిడి చేసి పొత్తు కుదుర్చుతున్నానని పవన్ అన్నారట. అంటే ఆయన రాజకీయ దళారిగా మద్యవర్తిత్వం చేస్తున్నారని అనుకోవాలి. ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకుని, వారితో కాపురం చేయకుండా టీడీపీ వద్దకు వెళ్లి రాజకీయ సంసారం చేస్తూ, రాజకీయాలలో కూడా అక్రమ సంబంధాలు నెరపవచ్చని పవన్ కళ్యాణ్ కొత్త సూత్రం తయారు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సాగుతున్న ఈ అక్రమ, అనైతిక రాజకీయ సంబంధాలు దేశంలో మరెక్కడ చూడబోం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తీరుతెన్నులు తన పార్టీవారిని అవమానపరచేవిగా ఉన్నాయని చెప్పడానికి ఇవన్ని ఉదాహరణలే!

-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
