
ప్రతిపక్షంలో ఉండగా రాజకీయ పార్టీలకు సంక్షోభాలు సహజం. తెలంగాణలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లోనూ ప్రస్తుతం ఒక సంక్షోభం నెలకొని ఉంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత లేఖ రాయడం సహజంగానే కలకలం సృష్టించింది. తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో.. ఏడాదిన్నర కాలంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు ఇది చికాకు కలిగించేదే. కేడర్‌ను గందరగోళంలో పడేసేదే.
కవిత లేఖ ఒక ఎత్తు.. అమెరికా నుంచి తిరిగి వస్తూనే విమానాశ్రయంలోనే చేసిన వ్యాఖ్యలు ఇంకో ఎత్తు. ఒకపక్క కేసీఆర్ దేవుడంటూనే.. ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని చెప్పి కవిత బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టారు. తన లేఖను బయటపెట్టిన కోవర్టులెవరన్న ప్రశ్న కూడా సంధించి దాంతో తనకు సంబంధం లేదని చెప్పారన్నమాట. పార్టీలో కేసీఆర్ తరువాత అత్యంత ప్రముఖులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌లు మరి కొంతమంది మాత్రమే. కవిత తన లేఖను ఎవరి ద్వారా కేసీఆర్‌కు పంపారో తెలియదు కానీ.. పార్టీ ప్రముఖుల్లోనే ఎవరో ఒకరు దాన్ని బయటపెట్టారన్నది ఆమె భావన కావచ్చు.
అయితే, ఈ లేఖ లీక్ కావాలని, ప్రజల్లోకి వెళ్లాలని కవిత కూడా కోరుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా నుంచి రాగానే విమానాశ్రయంలోనే లేఖ విషయాలను హడావుడిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. తండ్రి, సోదరుడితో సంప్రదింపుల తరువాత కూడా వ్యాఖ్యానించి ఉండవచ్చు. అలా కాకుండా పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసినా దేవుడు, దెయ్యం వంటి డైలాగులు వాడారంటే ఆమె ఆంతర్యంపై పలు రకాల విశ్లేషణలు వస్తాయి. ఈ విషయం కవితకూ తెలుసు. పైగా ఆమె మద్దతుదారులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు సీఎం, సీఎం అని నినాదాలు ఇవ్వడం, ప్లకార్డులు, బ్యానర్లలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ల ఫోటోలు లేకపోవడం చూస్తే ప్రణాళిక ప్రకారమే కవిత విమానాశ్రయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టమవుతుంది.
అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇప్పుడిప్పుడే పార్టీ పుంజుకుంటున్న తరుణంలో ఈ దుమారం చెలరేగడం కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోందన్న అనుమానాలు పార్టీ కేడర్‌లో రేకెత్తిస్తాయి. కవిత ఇకపై ఏం చేస్తుందన్న ఆందోళన కూడా ఏర్పడుతుంది. కేసీఆర్ స్పందన కోసం అంతా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతానికైతే కేసీఆర్ స్వయంగా స్పందించకపోగా.. ఇతరులు కూడా రియాక్ట్ కావద్దని సూచించారు. కేటీఆర్ ఆయనను కలిసిన తర్వాత కూడా కొత్త పరిణామాలేవీ లేకపోవడం ద్వారా పార్టీ వేచి ఉండే ధోరణిని పాటిస్తోందని అనుకోవాలి. అదే సమయంలో ఎల్లో మీడియా గతంలో వైఎస్ షర్మిలను రెచ్చగొట్టినట్లు తెలంగాణలో కవితను కూడా రెచ్చగొడుతున్నారన్న అనుమానం ఉంది. దానికి తగినట్లే ఆమె పార్టీ పెడతారని, సోషల్ మీడియాలో ఆమెకు అనుకూలంగా కామెంట్లు వస్తున్నాయని టీడీపీకి మద్దతిచ్చే ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. కవిత కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, ఆ పార్టీనే వెనుకాడుతోందని కూడా ఈ ఎల్లో మీడియా కథనాన్ని ఇచ్చింది. జాగృతి కార్యకర్తలు దీన్ని ఖండించవచ్చు కానీ జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.
షర్మిలను రాజకీయంగా వాడుకుని ఆ తర్వాత ఆమెను విఫల ప్రయోగం అని ఎల్లో మీడియా వారే తేల్చేశారు. కవిత పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఉంటుందా అన్న చర్చ ఉంది. కవిత లేఖ ఆధారంగా కాంగ్రెస్, బీజేపీలు రకరకాల వ్యాఖ్యలు చేసి బీఆర్ఎస్‌ను ఆత్మరక్షణలో పడేయడానికి ప్రయత్నించాయి. కుటుంబ పంచాయతీ అని, డ్రామా అని, ఆస్తుల తగాదా అని ఈ పార్టీలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వంటి వారు ఆమె సొంత పార్టీ పెడతారని అనే వరకు వెళ్తున్నారు. అంతదాకా వెళతారా అన్నది అప్పుడే చెప్పలేం కానీ పార్టీలో తన ప్రాముఖ్యత పెంచుకోవడానికి యత్నించవచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేత పొన్నం ప్రభాకర్ ఇదంతా బీజేపీ-బీఆర్‌ఎస్ డ్రామా అంటున్నారు. కేంద్ర మంత్రి బీజేపీకి చెందిన బండి సంజయ్ కవితను కాంగ్రెస్ వదలిన బాణంగా విమర్శిస్తున్నారు. ఇంకో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదంతా డాడీ, డాటర్ డ్రామా అని వ్యాఖ్యానించారు.
కుమార్తె తన తండ్రికి లేఖ రాస్తే తప్పేమిటని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ ప్రశ్నిస్తున్నా.. లేఖలోని విషయాలు, ఒక రాజకీయ పార్టీ అధినేతకు వేసిన ప్రశ్నలు కచ్చితంగా చర్చనీయాంశాలే. ఫీడ్ బ్యాక్ పేరుతో కవిత పార్టీ రజతోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశం తాలూకూ లోటుపాట్లను ఒక జర్నలిస్టులా, విశ్లేషకురాలిగా తన లేఖలో ఎత్తి చూపింది. ఒక వ్యాసంలా సాగిన ఈ లేఖలో కొన్ని పాజిటివ్ పాయింట్లు ఉన్నా.. నెగిటివ్ పాయింట్లే ఎక్కువ. కేసీఆర్ నాయకత్వ పటిమపై కవితకు సందేహం కలిగినట్టుగా ఈ లేఖలోని వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. అలాగే.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో సోదరుడు కేటీఆర్.. పార్టీని నడుపుతున్న నేపథ్యంలో కవితలో ఏదో అసంతృప్తి కూడా ఏర్పడినట్లు స్పష్టమవుతోంది.

వరంగల్ సభలో వేదికపై కేసీఆర్‌తో పాటు కేటీఆర్ ఫోటో మాత్రమే ఉండటం కూడా ఆమె అసంతృప్తికి కారణమై ఉండవచ్చు. ఏప్రిల్ 27న జరిగిన పార్టీ రజతోత్సవ సభ విజయవంతం అయిందని.. కేసీఆర్ ప్రసంగాన్ని శ్రద్దగా విన్నారని, కాంగ్రెస్ ఫెయిల్ అని సభికులతో చెప్పించడం, ముఖ్యమంత్రి రేవంత్ పేరును కేసీఆర్ తీయకపోవడం వంటివి కవితకు నచ్చాయట. అయితే, అదే సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, తెలంగాణ గీతం గురించి మాట్లాడకపోవడాన్ని ఆమె ఆక్షేపించారు. కేసీఆర్ ప్రసంగంలో మరింత పంచ్‌ని ప్రజలు ఆశించారని ఆమె చెబుతున్నారు. అయినా ఈ సభతో కార్యకర్తలు, నాయకులు సంతృప్తిగానే ఉన్నారని అంటున్నారు. వారంతా సంతృప్తిగా ఉంటే పనికట్టుకుని కవిత ఈ లేఖ రాసి నెగిటివ్ పాయింట్లపై ఫోకస్ పెట్టవలసిన అవసరం ఏమిటో తెలియదు.
నెగిటివ్ పాయింట్ల గురించి చెబుతూ, ఉర్దూలో మాట్లాడకపోవడం, ఎస్సీ వర్గీకరణ, వక్ఫ్ బిల్లు ప్రస్తావన లేకపోవడం, సభ నిర్వహణ ఎవరో పాత ఇంఛార్జీలకు అప్పగించడం నచ్చలేదని అంటున్నారు. సభలో ఇతర నేతలు మాట్లాడే అవకాశం లేకపోవడాన్ని ఆమె తప్పు పట్టారు. సాధారణంగా ఎక్కువ మంది నేతలు ఇలాంటి సభలలో మాట్లాడుతుండే వారు. కానీ, ఈసారి కేసీఆర్ మాత్రమే మాట్లాడారు. ఇది కొంత ఆశ్చర్యంగానే ఉంది. కార్యకర్తల ధూంధాం విఫలమైందని కవిత అభిప్రాయపడ్డారు. బీజేపీపై రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడతారా అని కేసీఆర్‌ను ఆమె నిలదీశారు. భవిష్యత్తులో పొత్తు ఉంటుందేమోనని ఊహాగానాలకు ఆస్కారం కలిగిందని ఆమె విశ్లేషించారు. బీజేపీతో తాను వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డ విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
అయితే, ఎన్నికల ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు రావడం వల్ల బీఆర్‌ఎస్‌కు కూడా ఇబ్బంది అయిన విషయాన్ని కూడా మర్చిపోరాదు. కాంగ్రెస్ పై క్షేత్ర స్థాయిలో నమ్మకం పోయినా, బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందేమోనన్న ఆలోచన పార్టీ శ్రేణులలో ఉందని కవిత అనడం సంచలనమే. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, మళ్లీ పార్టీని పట్టాలెక్కించేందుకు తంటాలు పడుతున్న తరుణంలో కవిత ఈ మాటలు అనడం నష్టమే. కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ, దిశానిర్దేశం చేయలేకపోయారని కూడా ఆమె తప్పుపట్టారు. ఒకటి, రెండు రోజులు ప్లీనరీ నిర్వహించి పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తీసుకుని ఉండాల్సిందని ఆమె అన్నారు. బహిరంగ సమావేశాలలో అభిప్రాయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. కవిత లేఖ సారాంశం.. పార్టీ ఆశించినంత బాగా నడవడం లేదు అన్నది అనిపిస్తుంది. కేటీఆర్‌తో సంబంధాలేమైనా దెబ్బతిన్నాయా అన్న అనుమానం కలుగుతుంది.
కొద్ది రోజుల క్రితం హరీశ్‌రావు ఇంటికి వెళ్లి కేటీఆర్ రెండుగంటలు భేటీ అయి.. అంతా బాగుందన్న భావన కలిగించడానికి యత్నిస్తే, సోదరి రూపంలో ఈ కొత్త సమస్య వచ్చింది. అయితే, కవిత మరీ అధికంగా స్పందిస్తే ఆమెకే నష్టం. దేవుడి చుట్టూ దెయ్యాలు ఉన్నాయని అనడం ద్వారా తండ్రిని ఆమె గౌరవించినట్లా? లేక అవమానించినట్లా అన్న చర్చ జరుగుతోంది. పురాణాలలో దెయ్యాల మధ్యలో దేవుడు ఎక్కడైనా కనిపించారా?. తండ్రికి తన లేఖలో‘సారీ’ చెబుతూ ముగించినా, ఆమె ఎయిర్ పోర్టులో చేసిన ఘాటైన వ్యాఖ్యలతో ఆ ‘సారీ’కి అర్థం లేకుండా పోయింది. ‘అనుబంధం, ఆత్మీయత అంతా ఒక నాటకం.. ఆత్మ తృప్తికై ఆడుకునే వింత నాటకం’ అని ఒక కవి అంటాడు. ఇటువంటి రాజకీయాలు చూస్తే ఆ మాట నిజం అనిపిస్తుంది కదా!.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.