
అమరావతి రాజధానైతే జగన్‌కు వచ్చే నష్టమేమటి?.. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వేసిన ప్రశ్న ఇది. అయితే తనకు నష్టమని జగన్ ఏనాడూ చెప్పలేదు. భారీ స్కాములతో.. వేల కోట్ల రూపాయల అప్పులతో నిర్మాణాలు చేపడితే ఆ నష్టాన్ని భరించాల్సింది ఏపీ ప్రజలు మాత్రమేనని అన్నారాయన. నాగార్జున యూనివర్శిటీ సమీపంలోనో ఇంకో చోటో.. 500 ఎకరాలలో నిర్మిస్తే సరిపోయే దానికి లక్ష ఎకరాల భూమి, లక్షల కోట్ల రూపాయలంటూ ప్రజల నెత్తిన పెద్ద అప్పుల కొండ పెట్టడం ఎందుకు? అని జగన్ అడిగారు. దీంతోపాటు రాజధాని నిర్మాణానికి సంబంధించిన వివరాలన్నీ ఇచ్చి కొన్ని ప్రశ్నలు నేరుగానే అడిగారు. కానీ..
చంద్రబాబు వీటికి నేరుగా సమాధానం ఇవ్వలేక దబాయింపులకు దిగినట్లు స్పష్టమవుతుంది ఆయన స్పందన చూస్తే. పైగా ఆయన తప్పు చేస్తూ దానిని కవర్ చేసుకోవడానికి తంటాలు పడుతున్నారని తెలిసిపోతుంది. అమరావతి(Amaravati) పేరుతో చేపడుతున్న నిర్మాణాల వ్యయం గురించి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) నిలదీస్తే, దానికి జవాబు ఇవ్వకుండా, అసూయ అని, ఇంకొకటని చెబితే ప్రజలకు ఏమి ప్రయోజనం? చదరపు అడుగుకు రూ.పదివేల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి అమరావతిలో నిర్మాణాలు చేస్తున్న మాట నిజమే కదా?. దేశంలో ఎక్కడ కూడా నిర్మాణ వ్యవయం ఎంత ఎక్కువ లేదు. ఢిల్లీ, ముంబై వంటి నగరాలు కాదు.. అమెరికాలోనూ ఉండవు. పైగా అమరావతిలో భూమి ఖర్చు లేనే లేదు.
👉గతంతో.. పోలిస్తే సిమెంటు, ఉక్కు ధరలు తగ్గాయి. ఇసుకేమో ఉచితం! అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు 2018 నాటి ధరల కంటే ఎక్కువ ఎందుకు చెల్లించేందుకు సిద్ధపడుతోందని జగన్ అడిగితే.. రైతులు భూములు రాజధానికి ఇస్తే మీకెందుకు అసూయ? అనడం అసలు విషయాన్ని దాచివేయడం కాదా! మంత్రులు,హైకోర్టు జడ్జీల బంగ్లాలకు నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10418, ఐఎఎస్ అధికారుల బంగ్లాలకు రూ.9771, ఐదు టవర్ల నిర్మాణానికి రూ.8981 వ్యయం చేయడం నిధుల దుర్వినియోగమా కాదా? హైదరాబాద్ వంటి నగరంలోనే చదరపు అడుగుకు మహా అయితే రూ.నాలుగు వేలు అవుతుంది. భూమి, ఇసుక ఉచితంగా వస్తున్నా, అంతకు రెట్టింపు కంటే ఎక్కువ రేట్లు ఇస్తున్నారంటే, అందులో అవినీతి ఏ స్థాయిదో అని చర్చ జరుగుతోంది.
ఇప్పటికే రూ.31 వేల కోట్ల రుణం చేసిన అంశాన్ని, ఆర్థిక సంఘానికి రూ.77 వేల కోట్లు అవసరం అని చంద్రబాబు స్వయంగా చెప్పిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. లక్ష కోట్లు పెట్టి ఏమి చేస్తావు? అంటే అలా అడగకూడదని జగన్ కు చెప్పే హక్కు చంద్రబాబుకు ఉంటుందా? అమరావతి ఏమైనా చంద్రబాబు సొంత సామ్రాజ్యమా? లేక చంద్రబాబేమైనా ఏపీకి నియంత? చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌పై ఎన్ని అబద్ధపు ఆరోపణలు చేశారు? జగన్ ఇప్పుడు ఆధార సహితంగా ప్రశ్నలు వేస్తే జవాబులు చెప్పలేక ఎదురుదాడి చేస్తే సరిపోతుందా! నిజానికి అమరావతి కోసం ఇప్పటికే రూ.52 వేల కోట్ల అప్పు సమీకరించారట.
👉గతంలో తీసుకున్న 33 వేల ఎకరాలు, ప్రభుత్వ భూమి మరో ఇరవై వేల ఎకరాలలోనే ఇంతవరకు అభివృద్ది జరగకపోతే, ఇంకో 44 వేల ఎకరాలు తీసుకుని ఏమి చేస్తారు? ఆ భూముల యజమానులు అక్కడ పంటలు పండించుకోకుండా ఉండడం, వారికి ప్రభుత్వం కౌలుగా రూ.వందల కోట్లు చెల్లించడం.. చివరికి ఏమి అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడడం. ఇదంతా ఏపీకి అవసరమా అన్న ప్రశ్న వస్తుంది. గతంలో అమరావతికి అసలు ఒక్క రూపాయి ప్రభుత్వ ధనం వ్యయం చేయనవసరం లేదని చంద్రబాబే అన్నారు. ప్రభుత్వానికి మిగిలే ఎనిమిదివేల ఎకరాలు అమ్మితే లక్ష కోట్ల రూపాయలు వస్తాయని నమ్మబలికారు. ఆ డబ్బు ఎలా వస్తుందో తెలియదు. కాని, ముందుగా రూ.లక్ష కోట్ల అప్పయితే పడబోతోంది. అసలు, వడ్డీ కలిసి తడిసి మోపెడు అయితే దాన్ని రాష్ట్రంలోని ప్రజలంతా చెల్లిస్తారా? లేక కేవలం అమరావతిలోని భూములు కలిగిన వారే చెల్లిస్తారా? దీనిని అసలు రియల్ ఎస్టేట్ వెంచర్ మోడల్ గా చేయడం ప్రభుత్వానికి తగునా!.
👉అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరులేమీ సమకూర్చడం లేదని చంద్రబాబు(Chandrababu) ఢిల్లీలో చెప్పిన దానిని ఎవరైనా నమ్ముతారా?. బడ్జెట్‌లోనే రూ.6,000 వేల కోట్లు కేటాయించారు కదా? అందులో నుంచి సుమారు రూ.2,800 కోట్లు సీఆర్‌డీఏకి విడుదల చేసింది అసత్యమా?. ప్రపంచ బ్యాంక్, జర్మని సంస్థ, హడ్కోల నుంచి తీసుకుంటున్న అప్పు రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్రం చెల్లిస్తుందా?.. లేదు కదా!. హైదరాబాద్ వంటి రాజధాని ఏపీకి అవసరం లేదా? అని చంద్రబాబు అంటున్నారు. నిజంగా చిత్తశుద్దితో అలాంటి భావన ఉండి ఉంటే పది పల్లెటూళ్ల మధ్య లక్షల కోట్లు వ్యయం చేయవలసిన అవసరం ఏమి ఉంది? ఇప్పటికే పెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది కదా? అప్పుడీ భారమే ఉండదు కదా! ఈ పల్లెల్లో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు తమ ప్రాంతానికి కూడా అంత పెద్ద మొత్తం చొప్పున ఖర్చు చేయండని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు డిమాండ్ చేస్తే అంగీకరిస్తారా?.
👉బెంగుళూరును మించిన విమానాశ్రయం ఏపీకి కావాలట. అందుకోసం మరొకటి కడతారట. విజయవాడకు సమీపంలోని గన్నవరం వద్ద ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విస్తరిస్తున్నప్పుడు ఏమి చెప్పారు? ఇప్పుడేమి చేస్తున్నారు. అంటే ఇంతకాలం గన్నవరం వద్ద సమీకరించిన భూములు, అక్కడి బడాబాబులు కొందరికి అమరావతిలో ప్లాట్లు కేటాయించడం, వేల కోట్ల రూపాయలతో ఎయిర్ పోర్టులో నిర్మాణాలు చేయడం..అదంతా వృథాయేనా?. శంషాబాద్ విమానాశ్రయం వచ్చాక బేగంపేట ఎయిర్ పోర్టు మూసివేసినట్లు గన్నవరం ఎయిర్ పోర్టును నిలిపివేయక తప్పదు కదా! పోనీ ఇప్పుడు ప్రతిపాదించిన ఎయిర్ పోర్టు విజయవాడ, గుంటూరులకు కూడా నలభై, ఏభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి రోడ్డు సదుపాయం కూడా కల్పించవలసి ఉంటుంది. దీనిని కట్టడానికి ముందుకు వచ్చే పెట్టుబడిదారుడు ఎన్ని షరతులు పెడతారో? ప్రపంచంలో అతి రద్దీ ఉన్న విమానాశ్రయలు ఏవీ కూడా ఇంత విస్తీర్ణంలో లేవట. భారత్ లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ప్రారంభించిన పలు ఎయిర్ పోర్టులు రద్దీ లేక కార్యకలాపాలు నిర్వహించలేక పోయాయని చెబుతున్నారు. విశాఖపట్నం-విజయవాడ మధ్యే విమానాలు నడపలేమని ప్రైవేటు సంస్థలు చేతులెత్తేశాయే!. వీటన్నిటిని కప్పిపుచ్చి ప్రజలను మభ్య పెట్టడం అవసరమా?. నిజంగానే గన్నవరం వద్ద అంత భారీగా రద్దీ పెరిగితే కొత్త ఎయిర్ పోర్టు కట్టినా ఫర్వాలేదు.అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఈ కబుర్లు అన్నీ దేనికి!
👉కేవలం సూపర్ సిక్స్(Super Six Promises) తదితర హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం కోసం వారిని మభ్యపెట్టే రీతిలో డైలాగులు చంద్రబాబు చెప్పడం,వాటిని గొప్ప సంగతులుగా ఎల్లో మీడియా ప్రచారం చేయడం..ఇదే ఏపీలో జరుగుతున్న తంతు.ఇప్పటికే సెక్రటేరియట్, అసెంబ్లీల కోసం కట్టిన భవనాలను ఏమి చేస్తారు.అవి వృథాయేనా? ఒక్కొక్కటి నలభై, ఏభై అంతస్తుల టవర్లు కడితే అసలు ఇన్ని వేల ఎకరాల భూమి ఎందుకు అవసరం? రియల్ ఎస్టేట్ వెంచర్ మాదిరి, ఎవరి భూములో తీసుకుని ప్రభుత్వం వేల కోట్లతో అభివృద్ది చేయవలసిన అవసరం ఏమిటి? వీటికి జవాబు లేక జగన్ ను నిందిస్తే కధ నడిచిపోతుందని చంద్రబాబు అనుకుంటున్నారు. ఏపీ ప్రజలు వీటిని అర్థం చేసుకోలేరన్నది ఆయన నమ్మకం కావచ్చు.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.