
పొంతన లేని మాటలతో జనాల్ని తికమకపెట్టడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది తిరుగులేని రికార్డు. తాజాగా కొద్ది రోజుల క్రితం జ్యోతీరావు ఫూలే జయంతి ఉత్సవాల్లో ఇది మరోసారి నిరూపితమైంది. ఎల్లోమీడియా ‘బీసీల సంక్షేమానికి రూ.48 కోట్లు’ అంటూ బాబుగారి ప్రసంగాన్ని భాజాభజంత్రీలతో కథనంగా వండి వార్చినప్పటికీ వివరాలు చూస్తే ప్రజలు ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఎందుకంటే.. బాబు గారు తన ప్రసంగంలో సంక్షేమ వసతి గృహాలకు రూ.405 కోట్లు, గ్రూప్ పరీక్షల అభ్యర్థులకు శిక్షణ శిబిరాలు, బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు, అమరావతిలో 500 మంది బ్యాచ్‌తో ఉచిత శిక్షణ, ఆదరణ పథకం కింద ఏటా రూ.వెయ్యికోట్లు ఖర్చు వంటివి మాత్రమే ప్రస్తావించారు.
.. ఇవేవీ కొత్తవి కాకపోవడం ఒక వింతైతే.. వీటికయ్యే ఖర్చు ఏటా రెండు వేల కోట్లకు మించకపోవడం ఇంకోటి. మరి.. రూ.48 వేల కోట్లు ఎక్కడ? ఎప్పుడు? ఎలా వ్యయం చేస్తారు? ఎల్లో కథనం చదివిన వారి ఊహకే వదిలేయాలి దీన్ని. పోనీ మొత్తం ఐదేళ్లకు ఇంత మొత్తం అనుకుంటే.. ఒక ఏడాది గడచిపోయింది కాబట్టి.. మిగిలిన నాలుగేళ్లలో ఏటా రూ.12 వేల చొప్పున ఖర్చు పెట్టాలి. దీనిపై కూడా స్పష్టత లేదు. అయినా చంద్రబాబు(Chandrababu) బీసీ సంక్షేమానికి 48 వేల కోట్లు అని ఒక అంకె చెప్పడం, అదేదో మొత్తం ఇచ్చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చేసి బ్యానర్ కథనాలు రాసేసి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయడం ఎల్లో మీడియా మార్కు జర్నలిజమై పోయింది.
👉బాబు గారు ఇంకొన్ని మాటలూ ఆడారు. ఆర్థిక అసమానతలను రూపుమాపే బ్రహ్మాస్త్రం పీ-4 అని, దీని ద్వారా లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని చెప్పనైతే చెప్పారు కానీ.. ఎలా అన్నది మాత్రం చెప్పడం మరిచారు!. సాధారణంగా ఏ నేత అయినా వేల కోట్ల మొత్తాలను ప్రకటించినప్పుడు దేనికెంత ఖర్చు చేస్తారు? బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి? వంటి వివరాలు ఇవ్వడం జర్నలిజమ్ ప్రాథమిక లక్షణం. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఇలాంటి భారీ కేటాయింపులు జరిగినప్పుడు దానికి కట్టుబడి ఉన్నట్టు సమాచారం ఉండేది. అప్పటి విపక్షం టీడీపీ కూడా తప్పు పట్టే పరిస్థితి ఉండేది కాదు. పోనీలే... ఏదో ఒక రీతిన బీసీల సంక్షేమానికి రూ.48 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని సంతోషిస్తూండగానే చంద్రబాబు అన్నమాటతో నిరాశ కమ్మేసింది.
👉అప్పు చేసి సంక్షేమం అమలు చేస్తే రాష్ట్రం కష్టాలలో కూరుకుపోతుందని, సంపద సృష్టించి సంక్షేమానికి ఖర్చు చేస్తామని చంద్రబాబు ప్రకటించారని ఎల్లో మీడియా(Yellow Media)నే తెలిపింది. చంద్రబాబు అక్కడితో ఆగలేదు. కాని టీడీపీకి నష్టం అని భావించి ఎల్లో మీడియా ఆ భాగం రాయకుండా వదలి వేసింది. మిగిలిన మీడియాలో ఆ వివరాలు ఉన్నాయి. చెప్పినవన్నీ చేయాలని ఉన్నా గల్లా పెట్టే ఖాళీగా కనిపిస్తోందని, అప్పు చేద్దామన్నా ఇచ్చేందుకు ఎవరు ముందుకు రావడం లేదని అన్నారు. పరపతి లేకపోతే అప్పు ఎలా పుడుతుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు దాటిపోయింది. ఈ కాలంలో సంపద సృష్టించ లేకపోయానని ఆయన చెబుతున్నట్లే కదా? పైగా అప్పు పుట్టని పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబే కదా దానికి బాధ్యుడు అవుతారు. పోనీ అదే నిజమనుకున్నా, ఇప్పటికే రూ.లక్ష కోట్ల అప్పు ఎలా చేశారు? దానిని ఎందుకోసం ఖర్చు పెట్టారు అన్నది ఎప్పుడైనా చెప్పారా అంటే లేదు.
ఒక్క అమరావతి(Amaravati) నిర్మాణాలకే ఏభైవేల కోట్ల అప్పు ఎలా తీసుకు వస్తున్నారు? ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ, ఎన్నికల ప్రణాళిక అంటూ తెగ వాగ్దానాలు ఇచ్చేశారు కదా? బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్ ఇస్తానన్నారు కదా? ఇప్పుడు ప్రతి దానికి గల్లా పెట్టె ఖాళీగా ఉందని చెప్పడం ప్రజలను చీట్ చేయడమే కాదా? ఈ లెక్కన ఇప్పుడు బీసీల సంక్షేమానికి ప్రకటించిన రూ.48 వేల కోట్లు ఉత్తుత్తి ప్రకటనగానే తీసుకోవాలా? లేక దాని అమలుకు వేరే మార్గం ఏమైనా ఉందని చెబుతారా?. తల్లికి వందనం కింద త్వరలో డబ్బులు ఇస్తామని అంటారు. ఒక ఏడాది ఇప్పటికే ఎగవేసిన విషయాన్ని మాత్రం ప్రస్తావించరు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చే రూ.ఆరు వేలు పోను మిగిలిన రూ.14 వేలు ఇస్తామని చెప్పారు. మరి ఈ ఏడాది ఎందుకు ఎగవేశారో వివరించాలి కదా? కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా రైతులకు సాయం చేస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చుతున్నారు. ఇవైనా ఏ మేరకు అమలు చేస్తారో తెలియదు. చంద్రబాబు మాత్రం వాటిని నివృత్తి చేయరు. తాను చెప్పదలచుకున్నది ఏదో అది ప్రజలు నమ్ముతారా? లేదా ?అనేదానితో నిమిత్తం లేకుండా ప్రచారం చేసి వెళుతుంటారు. బీసీల రక్షణ కోసం చట్టం తీసుకు వస్తామని, వారికి 34 శాతం రిజర్వేషన్లు తెస్తామని, నామినేటెడ్ పోస్టులలో 33 శాతం బీసీలకు కేటాయిస్తామని, కల్లు గీత కార్మికులకు మద్యం షాపులు కేటాయించామని.. ఇలా ఆయా విషయాలను చెప్పారు.
విశేషం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం సత్యసాయి జిల్లాలో బీసీ వర్గానికి చెందిన ఒక వైసీపీ నేత లింగమయ్యను టీడీపీ వారు హత్య చేస్తే వీరు కనీసం ఖండించలేదు. ఆ కేసులో ఇరవైమంది నిందితులు ఉన్నారని చెబుతున్నా ఇద్దరిపైనే కేసు నమోదు చేశారని బాధితులు ఆరోపిస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం బీసీ రక్షణ చట్టం గురించి ఉపన్యాసం ఇస్తున్నారు.
ఏపీలో సోషల్ మీడియా(AP Social Media) నేరస్తులకు అడ్డాగా మారిందని, వ్యక్తిత్వ హననం చేస్తే అది వారికి అదే చివరి రోజు అవుతుందని చంద్రబాబు అంటున్నారు. నిజానికి సోషల్ మీడియాను దుర్వినియోగం ఎక్కువగా చేసింది టీడీపీ వారే అనే సంగతి ఆయనకూ తెలుసు. వారిని ప్రోత్సహించింది తాను, తన కుమారుడు అన్న విషయం అందరికి విదితమే.
ఈ మధ్య తప్పని స్థితిలో ఒక టీడీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. అతనిని విచారించి ,అతను వాగిన పిచ్చివాగుడు వెనుక ఎవరు ఉన్నారో పోలీసులు తేల్చుతారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు. సీమ రాజా అని, ఇంకేవేవో పేర్లతో వైఎస్సార్సీపీ మహిళా నేతలపై దారుణమైన నీచమైన వ్యాఖ్యలు చేసినవారంతా రాష్ట్రంలో సేఫ్‌గా తిరుగుతున్నారు. మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి అసహ్యకరమైన ఆరోపణ చేసిన ఒక టీడీపీ నేతకు టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసిన చరిత్ర కూడా సార్‌దే కదా! ఏదైనా చిత్తశుద్దితో చెబితే పర్వాలేదు. కాని సుద్దులు పైకి చెప్పి, టిడిపి సోషల్ మీడియా అరాచక శక్తులకు అండగా నిలబడుతున్నారన్న అపకీర్తి మూట కట్టుకుంటే ఏమి చేస్తాం. అందువల్ల నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో చంద్రబాబు మాటల్లో వాస్తవం అంత ఉంటుందని ఆయన ప్రత్యర్ధులు వ్యాఖ్యానిస్తుంటారు.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.