చంద్రబాబు, పవన్, లోకేష్.. మరీ ఇంతలా? | Kommineni Srinivasa Rao On Political Comments Bhogapuram Airport Meeting | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, పవన్, లోకేష్.. మరీ ఇంతలా?

Aug 4 2026 11:40 AM | Updated on Aug 6 2026 7:42 AM

Kommineni Srinivasa Rao On Political Comments Bhogapuram Airport Meeting

ఏమైంది.. అలనాటి తెలుగు ఆత్మగౌరవం.. ఏమైంది.. తెలుగు పౌరుషం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కీలక మంత్రి లోకేష్ లు వీటిని పక్కనబెట్టరా అన్న సందేహం ప్రజలలో ఎందుకు వస్తోంది?ఒకప్పుడు మోడీ దేశానికే పనికిరారని తీవ్రంగా పరుష వ్యాఖ్యలు చేశారే.. పర్వతం ఎవరికి తలవంచదన్నారే.. మేం భయపడతామా అని హూంకరించారే..  మరి ఇప్పుడు ఏమైంది. మరీ ఇంతగా లొంగిపోయినట్లు వీరు మాట్లాడడం ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారన్న విమర్శను ఎందుకు ఎదుర్కోవలసి వస్తోంది?మోడీ కన్నా తానే సీనియర్‌ని అని, ఆయనకన్నా టీడీపీ కార్యకర్త కూడా బెటరే అని  అప్పట్లో ఘాటుగా మాట్లాడిన చంద్రబాబే ఇప్పుడు మోడీకి తాను జై కొట్టడమే కాకుండా, సభికులతో కూడా జేజేలు కొట్టించడమేమిటి అని అంతా విస్తుపోతున్నారు. 

భోగాపురం  విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఇలాంటి సన్నివేశాలు రాష్ట్ర ప్రజలందరికి కనిపించాయి. మోడీని ప్రశంసించడం తప్పుకాదు. కాని మరీ అతిగా భజన చేసిన తీరులో మోడీని ఈ ముగ్గురు నేతలు తమను తాము తగ్గించుకోవడమే కాకుండా తెలుగువారి ప్రతిష్టను కూడా తగ్గించారే అన్నదే చర్చగా ఉంది. దీనికి తోడు మా జీసీఎం జగన్ పై అసత్యాలు యధాప్రకారం వీరు సాగించారు. కొబ్బరికాయ మేమే కొట్టాం, గుమ్మడి కాయ మేమే కొట్టాం అని చంద్రబాబు అంటుంటే..అవును.. అది నిజమే.. మధ్యలో పనులన్నీ జగన్ నేతృత్వంలోనే జరిగాయని వైఎస్సార్‌సీపీ నేతలు బదులు చెబుతున్నారు. 

2019 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  మొక్కుబడిగా శంకుస్థాపన చేసి వదలివేస్తే, జగన్ ప్రభుత్వం కదా మొత్తం అనుమతులు తెచ్చి,భూ సేకరణ పూర్తి చేసి, శంకుస్థాపన చేసి  దానిని ముందుకు   తీసుకువెళ్లింది! ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు నిర్మాణం చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంధి మల్లిఖార్జున రావు 2023లో జరిగిన సభలో బహిరంగంగానే చెప్పారు కదా! అందువల్లే ఈ ప్రారంభోత్సవ సభలో జీఎంఆర్‌కు మాట్లాడే  అవకాశం ఇవ్వకుండా చేశారా అని మాజీ మంత్రి  అమరనాధ్ ప్రశ్నించారు. అది ఉత్తరాంధ్రకు అవమానం కాదా అని అంటున్నారు. జగన్ హయాంలో 80 శాతం నిర్మాణం జరిగిన భోగాపురం ఎయిర్ పోర్టు తన ఘనత అని చెప్పుకుంటున్న చంద్రబాబు, కుప్పం లో విమానాశ్రయం కట్టి అంతర్జాతీయ నగరాలకు అనుసంధానం చేస్తానన్నారుగా..అది ఎక్కడదాకా వచ్చిందని పలువురు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.

ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. భోగాపురం  ఎయిర్ పోర్టుతోనే ఉత్తరాంధ్ర పరిస్తితి మారిపోతుందని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. ప్రస్తుతం నగరంలో ఉన్న ఎయిర్ పోర్టు బదులు కొత్తది నిర్మించారు.అంతవరకు ఓకె. కాని దానితోనే అంతా అయిపోతుందా?ప్రస్తుతం విశాఖ నగరం నుంచి సాగుతున్న విమానయానం ఇకపై భోగాపురం నుంచి జరుగుతుంది. ట్రాఫిక్ పెరిగితే మరికొన్ని విమానాలు రావచ్చు. కాని ఇప్పటికిప్పుడు హైదరాబాద్ తదితర పెద్ద నగరాలతో పోల్చుకునే పరిస్థితి ఉండకపోవచ్చు.ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగిపోవడమే కాదు..రివర్స్ వలసలు జరుగుతాయని చంద్రబాబు వంటి సీనియర్ నేత చెబుతుంటే వినేవారి  చెవిలో పూలు పెడుతున్నారన్న భావన కలగదా?అదే నిజమైతే ఆయనే కదా సుదీర్ఘకాలం ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నది. మరి ఇంతకాలం  వలసలు జరుగుతున్నా ఆయన పట్టించుకోలేకపోయారా అని ఎవరైనా అడిగితే జవాబు దొరకదు.ప్రధాని మోడీని ప్రశంసించడాన్ని ఎవరూ ఆక్షేపించరు.కాని అది మరీ అతిగా ఉందని టీడీపీ మద్దతుదారులే వ్యాఖ్యానిస్తున్నారు. 

ఒకప్పుడు మోడీని తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు ఎందుకు ఇంతలా మారిపోయారు?మోడీకంటే తానే సీనియర్ ని అని ఒకప్పుడు  చంద్రబాబు ధైర్యంగా చెప్పుకున్నారు.అంతేకాదు..మోడీ పాలన  ఘోరంగా సాగుతోందని అంటూ   ఏడేళ్ల క్రితం చీల్చి చెండాడినట్లు ప్రసంగాలు చేసేవారు.అప్పుడేమో ఏపీకి ఏమీ చేయడం లేదన్నారు. అసలు దేశానికే నష్టం జరుగుతోంందని ..ఇంకా చాలాచాలా ఆరోపించారు.  అదే చంద్రబాబు ప్రస్తుతం మోడీని అధ్బుతం, అమోఘం, అన్న చందంగా స్పీచ్ ఇవ్వడం విన్నవారంతా మరీ అతిగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా మాట్లాడడంలో ఆయన ఆంతర్యం ఏమిటి? గత అనుభవాల రీత్యా తన విధేయతను కనబరుచుకోవడానికి మాట్లాడారా? లేక ఇంకేదైనా ఇబ్బంది ఉందా అన్నది తెలియదు.  ఇక పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి మోడీని ఎవరో దూషించారట.

 దానికి ఆయన గుండె కదలిపోయిందట.కన్నీళ్లు వచ్చాయట. ఇదంతా సినిమాటిక్ అనిపించడం లేదూ!మోడీపై అంత ప్రేమ ,విశ్వాసం ఉంటే 2019 ఎన్నికల సమయంలో ఎందుకు మోడీని వదలి కమ్యూనిస్టులతో కలిసి ప్రయాణం చేశారు. మోడీ కన్నా బిఎస్పి అధినేత్రి మాయావతి గొప్పవారన్నట్లుగా వ్యవహరించారే! అవన్ని ఎందుకు చంద్రబాబు అప్పట్లో మోడీని  అనరాని మాటలు అంటున్నప్పుడు ఒక్కసారైనా అది తప్పు అని చెప్పలేదే!కొందరు మరో సంగతిని ప్రస్తావిస్తున్నారు. తన తల్లిని దూషించారు అంటూ  ఎవరిపై పవన్ ఆరోపించారో, క్షమించబోనని హెచ్చరించారో, వారితోనే చెట్టపట్టాలు వేసుకు తిరుగుతున్నారే అని కొందరు  వ్యాఖ్యానిస్తున్నారు. ఒకే ..మోడీకి మద్దతు ఇవ్వవచ్చు.కాని కన్నీళ్లు పెట్టుకున్నానంతగా చెబితే వినే జనానికి  ఎబ్బెట్టు అనిపించింది. ఇక లోకేష్ ఒక వ్యాఖ్య చేశారు.  గుజరాత్ లో బిజెపినే గత పాతికేళ్లుగా అధికారంలో ఉంది కనుక అభివృద్ది జరుగుతోందట. అందువల్ల ఏపీలో కూడా ఎన్డీఏనే గెలిపించాలని ఆయన అంటున్నారు.

ఇదే సూత్రం ఏ పార్టీకైనా వర్తిస్తుంది కదా!గత టరమ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ మళ్లీ  అదికారంలోకి వచ్చి ఉంటే జగన్ ప్రారంభించిన ఓడరేవుల నిర్మాణం పూర్తి అయ్యేది కదా! పదిహేడు మెడికల్ కాలేజీలు  ప్రభుత్వరంగంలోనే ఉండేవి కదా!పరిశ్రమల పేరుతో రూపాయికే ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు ,తమ అనుంగులకు టీడీపీ పెద్దలు  ఇచ్చే పరిస్థితి ఉండేదికాదు కదా!అన్నిటికి మించి రెడ్ బుక్ పేరుతో అరాచాకాలకు అవకాశం ఉండేది కాదు కదా! మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు జరిగేవి కాదు కదా!మహిళను వివస్త్రను చేసిన ఘటనకు అవకాశం ఉండేది కాదు కదా!ఇలా అనుకోవచ్చు కదా అని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఇది ప్రజాస్వామ్యం అన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు గుజరాత్ కు అన్నీ తీసుకువెళతారా అని ప్రశ్నించారు .ఆంధ్ర అభివృద్ది చెందుంటే మోడీ అసూయ పడుతున్నారని ధ్వజమెత్తేవారు. ఇప్పుడేమో మోడీనే ఏపీకి  అంతా చేస్తున్నారని అంటున్నారు.దేనిని నమ్మాలి. 

ఏది ఏమైనా అతి సర్వత్రా వర్జయేత్ అని అంటారు. ఈ నేపధ్యంలోనే సిబిఐ మాజీ డైరెక్టర్ ఎమ్. నాగేశ్వరరావు ఒక వ్యాఖ్య చేస్తూ చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకుని మోడీని పొగుడుతున్నారని,ఈ రకంగా పతనం మంచిది కాదని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని  చంద్రబాబు దిగజార్చుతారా అని కామెంట్ చేశారు.సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ సూటిగానే చంద్రబాబు ప్రభృతులు మోడీని  పొగిడిన తీరు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లు ఉందని విమర్శించారు.  భోగాపురం ఎయిర్ పోర్టు మంచిదే.ఎయిర్ బస్సు బాగానే ఉంటుంది.కాని ఎర్రబస్సు ఎక్కేవారు కూడా ఎయిర్ బస్ ఎక్కేలా చేయగలిగితే  అభివృద్ది అవుతుంది తప్ప,కేవలం బడాబాబుల కోసమే ఎయిర్ పోర్టు కాకూడదన్నది నిష్టుర సత్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement