జగన్‌ పాలన చూసి రోజూ ఏడుపేనా? | Kommineni Srinivasa Rao On Eenadu Banner On Karnataka Accident - Sakshi
Sakshi News home page

బాబు హయాంలో భిక్షాటన గుర్తుందా?.. ఇప్పుడు జగన్‌ని చూసి రోజూ ఏడుపే!

Published Sat, Oct 28 2023 9:15 AM

Kommineni Comment On Eenadu Banner On Karnataka Accident  - Sakshi

ఈనాడు మీడియాకు పిచ్చి రోజు రోజుకి ముదురుతోంది. అది పరాకాష్టకు చేరుతోంది. కర్నాటకలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. అందులో శ్రీసత్యనాయి జిల్లాకు చెందిన పదిమంది మరణించారు. అది దురదృష్టకరమైన ఘటన. అందుకు ఎవరమైనా బాధపడతాం. కానీ ఈనాడు మీడియా మాత్రం అలాంటి ప్రమాదాలు జరుగుతున్నందుకు రాక్షసానందం పొందుతున్నట్లుగా ఉంది. ఎందుకంటే ఆ యాక్సిడెంట్‌లను తన దిక్కుమాలిన రాజకీయాలకు, తను జాకీ లేసి లేపుతున్న తెలుగుదేశం పార్టీకి ఎంతోకొంత ఉపయోగపడేలా చేయవచ్చన్నది వారి ఆలోచన. అక్టోబర్‌ 27వ తేదీన ఇక్కడ ఉపాధి ఉంటే ఈ ఘోరం జరిగేదా! అనే కథనాన్ని ఈనాడు పత్రిక బానర్గా వండి వార్చింది. తద్వారా ఏపీ జనాలు పొద్దున లేవగానే  ఇలాంటి చెత్త వార్తలు చూడవలసి వస్తోంది.

రోడ్డు ప్రమాదం జరిగింది డ్రైవర్ పొరపాటువల్ల. నిద్ర మత్తులో ఉండడం వల్ల. ఇందులో ఏపీకి సంబంధించినవారితో పాటు కర్నాటక వాసులు కూడా ఉన్నారు. ఉపాధి లేక వలస వెళుతూ ఏపీవాళ్లు ప్రమాదంలో మరణిస్తే మరి కర్నాటక వారు ఎందుకు మృతి చెందినట్లు? అర్థం,పర్థం లేని వార్తలు రాసి ఏపీ  ప్రజలను మోసం చేయాలన్నదే వారి ఉద్దేశం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పలు ప్రాంతాలు కరువుకు గురయ్యేవే. కాదనం. కాని వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతానికి కొంత మేర నీరు ఇచ్చిన సంగతి మర్చిపోకూడదు. అయినా అది సరిపోకపోయి ఉండవచ్చు. గత నాలుగేళ్లుగా వర్షాలు బాగానే పడ్డాయి. పంటలు పండాయి. అప్పుడు ఎవరూ వలస వెళ్లలేదని ఈనాడు ఎప్పుడైనా రాసిందా? మరి చంద్రబాబు టైమ్ లో దాదాపు ఐదేళ్లు కరువు తాండవించిందే. అప్పుడు ఎందుకు ఇలా రాయలేదు?. హిందుపూర్ తదితర ప్రాంతాల నుంచి ఏదో లెక్కగట్టినట్లు ఇన్నివేల మంది నిత్యం బెంగుళూరు,తదితర ప్రాంతాలకు వెళతారని రాసింది. అంటే ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన విషయమా? ఎప్పటి నుంచో ఉన్నదే కదా!కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ టైమ్ లోనే ఇలా  జరుగుతుందని రాయడం ఎంత దుర్మార్గం.

✍️చంద్రబాబు టైమ్ లో కరువు ప్రాంతాల నుంచి వందలాది మంది కేరళలో  భిక్షాటనకు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. మరి అప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని బాధ్యుడ్ని చేస్తూ ఎందుకు వార్తలు రాయలేదు. పైగా అప్పట్లో కరువు వల్ల స్వస్థలాలు వీడినవారిని చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి రప్పించిందని పచ్చి అబద్దం రాయడం. అసలు వారంతా ఎందుకు అప్పుడు వెళ్లవలసి వచ్చింది?. ప్రజలు ఎవరైనా ఎక్కడికైనా వెళ్లి పనులు చేసుకోవచ్చు. ఆ మాటకు వస్తే చంద్రబాబు నియోజకవర్గం అయిన కుప్పం నుంచి నిత్యం వేలాది మంది బెంగుళూరు  వెళ్తుంటారు. మరి కుప్పంలో ఎందుకు ఉపాధి కల్పించలేకోయారు? చంద్రబాబు వైఫల్యం చెందినట్లు ఎందుకు రాయలేదు. సమస్యను రాయడం వేరు. ఆ ప్రాంతంలో మార్పులు, అభివృద్ది కోరుకోవడం వేరు. కాని ప్రస్తుత ప్రభుత్వంపై దుర్మార్గంగా విషం చిమ్మి, ప్రజల మెదళ్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలని నీచ యత్నాలు చేయడం వేరు. ఈనాడు మీడియా ఆ నీచమైన పని ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చేస్తోంది కాబట్టి ఈ విషయాలను రాయవలసి వచ్చింది.

చంద్రబాబు టైమ్ లో విజయనగరం, శ్రీకాకుళం లకు చెందిన కొందరు భవన నిర్మాణ కార్మికులు తమిళనాడులో స్లాబ్ కూలి మరణించారు. అప్పుడు ఈనాడు మీడియా ఇలాగే ప్రభుత్వాన్ని తప్పు పడుతూ వార్తలు ఇవ్వలేదే!. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలనే ఏపీలో ఉంది కదా! అప్పుడు ఎందుకు ఆయన పుట్టపర్తి, గోరంట్ల ప్రాంతాలలో పరిశ్రమలు పెట్టించలేకపోయారు. ఉపాధి అవకాశాలు పెంచలేకపోయారు? అలా చేసి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు కదా! నిజంగానే ఆ విషయాన్ని ఈనాడు రామోజీరావు చిత్తశుద్దితో నమ్మితే ఏపీలో వివిధ ప్రభుత్వాల కాలంలో ఏమి జరిగిందో, ఇప్పుడు ఏమి జరుగుతోందో విశ్లేషణ ఇస్తే తప్పు కాదు. కాని అందుకు విరుద్దంగా జగన్‌పై పడి ఈనాడు నిత్యం ఏడవడమే బాగోలేదు.

✍️ఈనాడు చెప్పేదాని ప్రకారం.. ఎవరూ వేరే చోటకు వెళ్లకూడదు. మరి అమెరికా వెళ్లిన తెలుగువారంతా చంద్రబాబువల్లేనని ఎందుకు ప్రచారం చేశారు?.  ఏపీలో ఎందుకు వారందరికి ఉపాధి కల్పించలేకపోయారు. అక్కడ ఒక్కోసారి రోడ్డు ప్రమాదాలలో తెలుగువారు చనిపోయారే! ఆ మధ్య పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఒక తెలుగు యువకుడిని దుండగులు కాల్చి చంపారు. ఆ యువకుడికి ఇక్కడే ఎందుకు ఉపాధి కల్పించలేకపోయారని ఈ పత్రిక రాసిందా?. నీటి పారుదల ప్రాజెక్టులు కట్టివేస్తేనే  వలసలు ఆగిపోతాయా? పోనీ అదే కరెక్టు అనుకున్నా రాయలసీమ నీటి ప్రాజెక్టులకు అడ్డు తగులుతున్నది తెలుగుదేశం, ఈనాడు మీడియానే కదా!. ఏ ప్రాజెక్టును ముందుకు పోనివ్వకుండా రకరకాల పుల్లలు వేస్తోంది వీరే కదా!.  కోనసీమ జిల్లా అమలాపురం ప్రాంతం నీటికళతో సస్యశ్యామలంగా ఉంటుంది. అయినా ఆ ప్రాంతం నుంచి వేలాది మంది గల్ఫ్ ప్రాంతానికి ఉద్యోగాల రీత్యా వలస వెళ్లారు.

✍️తెలంగాణలో బొగ్గు గనులు ఉన్న కరీంనగర్ ,ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల ప్రాంతాల నుంచి కూడా అనేకమంది చిన్న,చిన్న పనులకోసం విదేశాలకు వలస వెళ్లారు.నూరు శాతం అక్షరాస్యత ఉన్న కేరళ నుంచి లక్షల మంది గల్ఫ్ దేశాలకు వెళ్లారు.వారిలో పలువురు అష్టకష్టాలు పడుతున్నట్లు వార్తలు వస్తుంటాయి. మరి వారంతా వెళ్లడం తప్పా?ప్రభుత్వాల వైఫల్యమా? ఇలాంటి ప్రమాద ఘటనలు జరిగినప్పుడు కేసీఆర్‌ ప్రభుత్వంపై ఎందుకు వ్యతిరేక స్టోరీలు ఇవ్వలేదు! బీహారు, యూపీ, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి వేలాది మంది తెలుగు రాష్ట్రాలలో పనులకు వస్తుంటారు. వారిని ఏమంటారు?ప్రభుత్వాలు తమ రాష్ట్రాలలో ప్రాధమిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు పెంచే చర్యలు చేపట్టాలని రాయడం తప్ప కాదు .అవి లేనందునే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని, దానికి కారణం ప్రభుత్వాలేనని వార్త ఇవ్వడం కేవలం ఏపీ ప్రభుత్వంపై అక్కసు, ద్వేషం తప్ప మరొకటి కాదు. వచ్చే ఎన్నికల వరకు ఈనాడు మీడియా ఇలాంటి చెత్త కథనాలు ఇస్తూనే ఉంటుంది. తద్వారా  ఆ మీడియా తన విశ్వసనీయత కోల్పోతున్నప్పటికీ, ఆ కథనాలకు కౌంటర్ ఇవ్వాల్సిందే!.


:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Advertisement
 
Advertisement