అమిత్‌షాతో లోకేష్‌ భేటీ.. ఫిర్యాదు చేస్తే నమ్మేస్తారా! | Kommineni Analysis On Lokesh Meets Amit Shah, Purandeswari | Sakshi
Sakshi News home page

అమిత్‌షాతో లోకేష్‌ భేటీ.. ఫిర్యాదు చేస్తే నమ్మేస్తారా! కేంద్రం జోక్యం చేసుకుంటుందా?

Oct 13 2023 11:55 AM | Updated on Oct 13 2023 12:48 PM

Kommineni Analysis On Lokesh Meets Amit Shah With Purandeswari - Sakshi

తెలుగుదేశం నేత, మాజీమంత్రి నారా లోకేష్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన ఘట్టం ఆసక్తికరంగానే ఉంది. ఇరవై ఐదు రోజులకుపైగా డిల్లీలోనే ఉండి అమిత్ షా అపాయింట్‌మెంట్‌ పొందలేకపోయిన లోకేష్ ఎట్టకేలకు ఆయనను కలవగలిగారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డే పోన్ చేసి షా వద్దకు తీసుకువెళ్లారని ఆయన చెప్పారు. అదే వాస్తవమైతే  ఆ సమావేశంలో  తన పెద్దమ్మ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎలా ఉన్నారు?

పెద్దమ్మగా వెళ్లాను అని చెబితే తప్పులేదు. కానీ!
ఒక సమాచారం ప్రకారం గతంలో కేంద్రంలో ఉన్నత  స్థానంలో ఉన్న మరో ప్రముఖుడు ఈ విషయంలో చొరవ తీసుకున్నారన్న టాక్ కూడా ఉంది. పురందేశ్వరి పెద్దమ్మ హోదాలో అక్కడకు వెళ్లారా? లేక లేక బీజేపీనేతగా తన పలుకుబడి ఉపయోగించారా అన్నది పరిశీలించాలి. పెద్దమ్మగా వెళ్లాను అని చెబితే తప్పులేదు. గతంలో పరస్పరం ఎన్ని అవమానాలు చేసుకున్నా, ఇప్పుడు సర్దుకుపోయారని అనుకోవచ్చు. కానీ ఆమె రాజకీయ వ్యాఖ్య చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందని అంటున్నవారు ఇప్పుడు చెప్పాలట. వారు చేస్తున్నది నిజమైతే అమిత్ షా ఎందుకు లోకేష్‌కు అపాయింట్‌మెంట్‌ ఇస్తారని ఆమె ప్రశ్నించారు.

అబ్బో..చాలా తెలివిగానే మాట్లాడానని అనుకుని ఉండవచ్చు. బీజేపీకికి చంద్రబాబు అరెస్టుతో సంబంధం లేదని చెప్పవలసిన అవసరం ఏముంది? లోకేషే కేంద్రానికి ఈ అరెస్టులతో సంబంధం లేదని ప్రకటించారు. ఎవరైనా కొందరు టీడీపీ నేతలు బీజేపీ నేతలను విమర్శించి ఉండవచ్చు. వారి కోసం లోకేష్‌ను ఆమె మంత్రి వద్దకు తీసుకువెళ్లారా? ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటంటే అమిత్ షా తమకు అనుకూలంగానే మాట్లాడారని పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు కానీ, అసలు ఆయన ఈ భేటీపై ఎలాంటి స్పందనను అధికారంగా ఇవ్వకపోవడం గమనార్హం.
చదవండి: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

అమిత్‌షాకు తెలియకుండా ఉంటుందా?
ఆయన తరపున కేంద్ర బీజేపీ ఎందుకు ప్రకటన చేయలేదు. చంద్రబాబు అరెస్టును కేంద్ర బీజేపీ ఎందుకు ఖండించలేదు? నిజంగానే ఇంతకాలం చంద్రబాబు అరెస్టు అయి జైలులో ఉన్న విషయం కేంద్ర హోం మంత్రికి తెలియకుండా ఉంటుందా? కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను అమిత్‌షాను కలిసినప్పుడు ఈ ప్రస్తావన రాకుండా ఉంటుందా? అయినా ఎవరి సంతృప్తి వారిది. ఏపీలో గమ్మత్తు అయిన రాజకీయం ఏమిటంటే బీజేపీలో కొందరు నేతలు టీడీపీ, జనసేన కూటమితో కలిసి ఎన్నికలలో పోటీచేయాలని కోరుతున్నారు. మరికొందరు నేతలు మాత్రం వద్దే, వద్దు అని వాదిస్తున్నారు.

బీజేపీ పెద్దలు ఫీల్ కావడం లేదు
టీడీపీతో జరిగిన అవమానాలు, చేదు అనుభవాలు ఇక చాలు అని ఒరిజినల్ బీజేపీ నేతల అభిప్రాయంగా ఉంది. కానీ టీడీపీ నుంచి బీజేపీలో చేరి కోవర్టులుగా మారిన నేతలు మాత్రం వీటన్నిటిని పక్కనబెట్టి ఎలాగొలా పొత్తు పెట్టుకుంటే ,తాము ఒకరిద్దరమైనా గెలవవచ్చన్నది వారి ఆశ. బహుశా పురందేశ్వరి కూడా ఆ కోవలో ఉండవచ్చు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ బీజేపీతో పొత్తులో ఉన్నా, కనీసం ఆ పార్టీ వారికి చెప్పకుండా టీడీపీతో పొత్తు ప్రకటన చేసినా పురందేశ్వరి బాదపడినట్లు అనిపించలేదు. నిజానికి పవన్ చేసింది బీజేపీని అవమానించడం.అయినా రాష్ట్ర బీజేపీ పెద్దలు ఫీల్ కావడం లేదు.

కేంద్ర పార్టీ పెద్దలు వేచి చూసే ధోరణిలో ఉన్నట్లుగా ఉంది.మరో వైపు టీడీపీ, జనసేన, సీపీఐ కలిసి విశాఖలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వారితో బీజేపీ కలుస్తుందా? బీజేపీవారేమో పవన్ వెంట, పవనేమో టీడీపీవెంట, టీడీపీ వారేమో బీజేపీ దయకోసం, సీపీఐ వారు టీడీపీ ప్రాపకం కోసం తంటాలు పడుతున్నారు. ఒకప్పుడు ఇదే చంద్రబాబు, ఇదే లోకేష్, ఇదే బాలకృష్ణలు ప్రధాని మోదీని, అమిత్ షా లను ఎంత ఘోరంగా దూషించింది అందరికి తెలుసు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న తర్వాత మోదీకి కేసీఆర్‌, జగన్‌లు దత్తపుత్రులని చంద్రబాబు విమర్శలు చేశారు.

కేంద్రం జోక్యం చేసుకుంటుందా?
ఎప్పుడు ప్రధాని, హోం మంత్రులను వైఎస్‌ జగన్ అధికారికంగా కలిసినా, ఇంకేముంది! కేసులలో ప్రయోజనం పొందడానికే అని ప్రచారం చేసిన వీరు ఇప్పుడు తమ కేసుల గురించి ఎందుకు హోం మంత్రికి చెప్పినట్లు? రాష్ట్రానికి సంబంధించిన కేసులలో, కోర్టులలో ఉన్న పరిస్థితిలో  కేంద్రం జోక్యం చేసుకుంటుందా? అసలు కేంద్రమే తొలుత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంటిలో సోదాలు జరిపి రెండు వేల కోట్ల రూపాయల అక్రమాలు కనుగొన్నట్లు ప్రకటించింది కదా! ఆ తర్వాత ఆదాయపన్ను శాఖ చంద్రబాబు వద్ద అక్రమ ధనం రూ. 118 కోట్లకు లెక్కలు అడిగింది కదా?

అమిత్ షా సర్టిఫికెట్ ఇచ్చేశారా
ప్రధాని స్వయంగా ఏపీకి వచ్చి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం అయిందని అన్నారే! వాటన్నిటిని మర్చిపోయి అమిత్ షా వీరికి సర్టిఫికెట్ ఇచ్చేశారా? లోకేష్ తన తండ్రిపై ,తనపై కక్షతో  కేసులు పెడుతున్నారని ఫిర్యాదు చేస్తే అమిత్ షా నమ్మేస్తారా? డెబ్బై మూడేళ్ల వయసులో చంద్రబాబును ఇబ్బంది పెట్టడంపై అమిత్ షా సానుభూతి చూపించారని టీడీపీ మీడియా ప్రచారం చేసుకుంది. ఏదైనా మాట వరసకు ఆ మాట అన్నారో, లేక అసలు ఆ మాట రాకుండా వీరే ప్రచారం చేసుకున్నారో తెలియదు కాని, వయసుకు, కేసులకు సంబంధం ఉంటుందా?

ఢిల్లీలో ఎందుకు గడుపుతున్నాడు
ప్రముఖ కవి వరవర రావును ఎనభై ఏళ్ల వయసులో జైలులో పెట్టారు కదా? అసలు కదలలేని సాయిబాబా అనేఫ్రొఫెసర్‌ను ఏళ్ల తరబడి జైలులోనే ఉంచారు కదా? ఎనభై ఏడేళ్ల వయసులో ఓం ప్రకాష్ సింగ్ చౌతాలా జైలు జీవితం గడుపుతున్నారు. చంద్రబాబు కన్నా వయసులో పెద్దవాడైన లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లలేదా? ఇలా ఎన్నైనా చెప్పవచ్చు. నిజానికి చంద్రబాబు, లోకేషల్‌లపై పెట్టింది అక్రమ కేసులు అని వారు నమ్ముతుంటే, దానికి సంబందించిన ఆధారాలను చూపించాలి? తమ పార్టీకి వచ్చిన 27 కోట్ల రూపాయల నిధులు చట్టబద్దమైనవని చెప్పగలగాలి. ఆ పని మానేసి ఢిల్లీలో ఆయా వ్యవస్థలను మేనేజ్ చేయడం కోసం ఎందుకు గడుపుతున్నారు.

హోం మంత్రి వద్దకు వెళ్ళినప్పుడు అయినా ఇవి ఏ రకంగా కక్ష కేసులో వివరించినట్లు ఎక్కడా వార్తలు రాలేదు. దీనిని బట్టే టీడీపీ నేతలు ఆత్మరక్షణలో ఉన్నట్లు అర్ధం అవుతుంది. ఎలాగొలా షా ను కలవగలిగామని, పరిస్థితి మారుతుందని టీడీపీ క్యాడర్‌ను నమ్మించడానికి లోకేష్ చేసిన ప్రయత్నం తప్ప ఇంకొకటి కాకపోవచ్చు. ఈ విషయాన్ని పక్కనబెడితే తన వయసు డెబ్బైమూడేళ్లు అన్నది ఒక అంకె మాత్రమే. తాను జగన్ కన్నా ఫిట్ అని చంద్రబాబే పలుమార్లు ప్రకటించారు కదా! ఎండలలో కూడా సభలు పెడుతున్నారు కదా! ఇప్పుడు లోకేష్ ఈ బేల మాటలు ఏమిటి?

షా సాయం చేశారని ప్రచారం చేస్తారా
ముఖ్యమంత్రి జగన్‌పై నోరు పారేసుకోవడంలో వీరిద్దరూ పోటీ పడ్డారు. ఇప్పటికీ లోకేష్ ఆ పద్దతి మానడం లేదు. కేసులు పెట్టుకో.. అని సవాళ్లు విసురుతూ వచ్చిన తీరు, తీరా అవినీతి కేసులు మెడకు చుట్టుకునేసరికి, అమ్మో కక్ష అంటూ గోల చేస్తున్నారు. ఒకవేళ చంద్రబాబుకు ఏమైనా రిలీఫ్ వస్తే బీజేపీ వల్లే వచ్చిందని టీడీపీవారు చెబుతారా! సుప్రీంకోర్టులో ఏ బెంచ్‌లో విచారణ జరుగుతోందని అమిత్ షా అడిగారని కూడా లోకేష్ అన్నట్లు వార్తలు వచ్చాయి. అదే నిజమైతే ఒకవేళ తమకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు వస్తే షా సాయం చేశారని ప్రచారం చేస్తారా? అంతా అయోమయంగా ఉంది.

కమ్మ కుల రాజకీయాలు
ఇక మరో కోణం గురించి కూడా మాట్లాడుకోవాలి. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు అరెస్టును అడ్డు పెట్టుకుని కొందరు కమ్మ కుల రాజకీయాలు చేస్తున్నారు. ఇందులో మూడు ప్రదాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ఉన్నాయి.తొలుత బిఆర్ఎస్ కు  అనుకూలంగా ఉన్న ఈ వర్గం ఓటర్లు, కాంగ్రెస్ వైపు  ఎక్కడ మొగ్గు చూపుతారో అన్న సందేహంతో పురందేశ్వరితో కలిసి కిషన్ రెడ్డి డిల్లీలో అమిత్ షా వద్దకు లోకేష్‌తో పాటు వెళ్లి ఉండాలి. ఆ వర్గం ఓటర్లు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చంద్రబాబుకు సన్నిహితుడుగా ఉన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ వైపు మొగ్గు చూపవచ్చన్నది ఒక విశ్లేషణ. దాని వల్ల ఎంత ఉపయోగం ఉంటుందన్నది వేరే విషయం.

టీడీపీ కూడా అలాగే చేస్తుందా
అంతమాత్రాన ఆంద్రా ఓటర్లంతా ఒకే పార్టీకి వేస్తారని ఎలా చెబుతారో తెలియదు. ఇప్పటికే తెలంగాణలో జనసేన ఒంటరిగా పోటీచేస్తున్నట్లు నియోజకవర్గాల జాబితా ప్రకటించింది. మరి టీడీపీ కూడా అలాగే చేస్తుందా? లేక జనసేనతో పెట్టుకుని, బీజేపీని ఆకర్షించాలని ప్రయత్నిస్తుందా? గతంలో కొంత ప్రయత్నం జరిగినా టీ బీజేపీ నేతలు అందుకు అంగీకరించలేదు. ఇప్పుడు మారిన పరిణామాల రీత్యా వారి స్టాండ్ ఎలా ఉంటుందో చూడాలి. చంద్రబాబు అరెస్టుతో బీజేపీకి సంబంధం లేదని తెలంగాణలోని కమ్మ వర్గంలో టీడీపీ అనుకూలంగా ఉన్నవారికి సంకేతం ఇవ్వడానికే ఈ ప్రయత్నమని కొందరు చెబుతున్నారు.

రెడ్ బుక్ ప్రయోగం వికటిస్తుందని తెలుసుకొని ఉండాలి
ఏది ఏమైనా బీజేపీకేంద్ర పెద్దలు ప్రస్తుతానికి  తెలంగాణ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని పావులు కదుపుతారు. ఆ తర్వాతే ఎపి రాజకీయాల గురించి ఆలోచిస్తారు. హోం మంత్రి అమిత్ షా వద్దకు వెళ్లినా, ఆయా వ్యవస్థలను ప్రభావితం చేయాలని ప్రయత్నించినా, ఈ అవినీతి కేసులలో అంత తేలికగా బయటపడడం కష్టం అని లోకేష్‌కు అర్ధం అయి ఉండాలి. తన రెడ్ బుక్ ప్రయోగం వికటిస్తుందని ఆయన తెలుసుకుని ఉండాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement