చంద్రబాబు సర్కార్‌ గుట్టు రట్టు.. | Kommineni Analysis On Chandrababu Government Failures, YSRCP Criticizes NDA Government Over 2-Year Rule, Read Story Inside | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కార్‌ గుట్టు రట్టు..

Jun 16 2026 4:17 PM | Updated on Jun 16 2026 4:41 PM

Kommineni Analysis On Chandrababu Government Failures

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా తిరుపతిలో జరిగిన విజయోత్సవ సభలో ప్రసంగించిన నేతలలో ఏదో తెలియని భయం వెన్నాడుతున్నట్లు అనిపిస్తే, వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన నిరసనలలో ఉత్సాహం, తెగింపు కనిపిస్తాయి. కూటమి నేతలు తమ ప్రసంగాలలో సాధించిన విజయాల గురించికన్నా మాజీ సీఎం జగన్‌ను దూషించడానికి, ద్వేషించడానికే ప్రాధాన్యం ఇచ్చారు.

గత ప్రభుత్వం విధ్వంసం చేసిందంటూ ఒక పడికట్టు పదాన్ని పదే, పదే చెప్పి జనాన్ని నమ్మించడానికి యత్నం చేశారే తప్ప, ఏ రకమైన  విధ్వంసమో వివరించడంలో ముఖ్యమంత్రి  చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారు. అదేమంటే ప్రజావేదికను గత ప్రభుత్వం కూల్చడాన్ని ఆయన ఉదహరించారు. ఇది పాడిందే పాడరా అన్న చందంగా ఉంది తప్ప ఒక పాలకుడు చెప్పదగిన మాటగా కనిపించదు.

నదీ గర్భంలో ప్రభుత్వమే అక్రమ నిర్మాణం చేపడితే అది సరైన విధానం కాదని ప్రజావేదిక పేరుతో ఉన్న ఒక షెడ్‌ను గత ప్రభుత్వం కూల్చింది. ఆ మాటకు వస్తే కృష్ణానది తీరాన అక్రమం నిర్మించిన భవనాలలో చంద్రబాబు, కీలక మంత్రి  లోకేష్‌లతో పాటు పలువురు పలుకుబడి కలిగినవారు నివసించడం ఏ రకంగా చట్టబద్దమో ఇన్నేళ్లలో వివరించలేకపోయారు.

అమరావతి గ్రామాలలో పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ చంద్రబాబు ఎదురు జగన్‌పై ఆరోపణలు చేయడం అర్ధరహితంగా కనిపిస్తుంది. ఒకవైపు చంద్రబాబు  ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు అంటూ రాజమండ్రి, యలమంచిలి మొదలైన చోట్ల పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చి వేసింది. కాని ఉండవల్లిలో కరకట్ట అక్రమ కట్టడంలో ఆయన ఎలా నివసిస్తున్నారో అర్థం కాదు. చంద్రబాబు మాట్లాడిన విషయాలలో ఎన్ని అసత్యాలు ఉన్నాయో చూడండి. విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేస్తున్నట్లు చంద్రబాబు స్పీచ్‌కి ఎల్లో మీడియా హెడింగ్ పెట్టింది.

అందులో నిజం ఉంటే సంతోషించవచ్చు. కాని ఏది విధ్వంసం, ఏది వికాసం అన్నదానిపై ముందుగా చంద్రబాబు క్లారిటీ తెచ్చుకోవాలి. ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు తేవడం, నాలుగు ఓడరేవులు నిర్మించడం, ఉద్దానంలో కిడ్నీ ఆస్పత్రిని నిర్మించడం, గ్రామ, గ్రామాన  సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం వంటివి నిర్మించడం విధ్వంసం ఎలా అవుతుంది? మెడికల్ కాలేజీలను, పోర్టులను, ఆర్టీసీ బస్టాండ్లను, ఏవి వీలైతే వాటన్నిటిని ప్రైవేటువారికి అప్పగించడాన్ని కదా విధ్వంసం అనాల్సింది. ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయయడాన్ని మాట నిలబెట్టుకున్నట్లని అంటారు. అది 95 శాతం వైఎస్‌ జగన్ చేసి చూపించారు.

మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కలిసి ఇచ్చిన హామీలను ఏ మేరకు నిలబెట్టుకున్నారు? ఒక్కటి, అరా తప్ప, ఏదైనా స్కీమ్ ను నిక్కచ్చిగా అమలు చేశామని చెప్పే పరిస్థితి లేదు. అన్ని చేసేశామని బుకాయించడంలోనే వీరి బలహీనత కనిపిస్తుంది. జగన్ యువత భవిష్యత్తును దెబ్బతీశారట. ఆయన టైమ్‌లో లక్షన్నర ఉద్యోగాలు ఏకకాలంలో ఇస్తే అది భవిష్యతుత్తు ఇచ్చినట్లు కాదన్నది చంద్రబాబు అభిప్రాయమా? కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మెగా డీఎస్సీ అంటూ హడావుడి చేశారు కాని, అందులో జరిగిన అక్రమాలపై  జగన్ వీటిపై సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక ఎదురుదాడి చేస్తున్నారు.

తనకు  నోటీసులు ఇవ్వకుండా 53 రోజులు జైలులో ఉంచారని ఆయన అన్నారు. స్కిల్ స్కామ్‌పై కోర్టులో విచారణ జరగకుండా ఇప్పుడు ఎందుకు మిస్టేక్ ఆఫ్ ప్యాక్ట్ పేరుతో కేసును ఎలా ఉపసంహరించుకుంది కూడా చెబితే బాగుండేది కదా! అమరావతిని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పిన చంద్రబాబు దాదాపు ఏభై వేల కోట్ల అప్పు  తీసుకువచ్చి ఒకేచోట ఖర్చుచయడాన్ని, కేంద్ర ప్రభుత్వం చదరపు అడుగుకు ఆరువేల లోపు ఖర్చు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం 17 వేల నుంచి ఇరవై వేల వరకు వ్యయం చేయడం వల్ల నిధులు  దుర్వినియోగం అవుతున్నాయా?లేదా? అన్నది  చేస్తున్నది వివరించాలి కదా!

ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామన్న హామీపై నిధులు లేవని చేతులు ఎత్తివేయడం సరైనదేనా? సంపద సృస్టించడం తెలుసునని ఎన్నికల ముందు కొట్టిన గప్పాలన్నీ అబద్దాలనేనని ఒప్పుకుంటారా? ఈ స్కీమ్‌ను అమలు చేయలేదన్న నిజాన్ని ఎంతో కొంత ఒప్పుకున్నందుకు సంతోషించాలి. మామూలుగా అయితే  సూపర్ సిక్స్ అన్నీ చేసేశాం అంటూ చెబుతుండడం అసత్యమేనని అంగీకరించారన్నమాట. టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని అని అన్నారు. మరి వైఎస్‌ జగన్ ప్రభుత్వం చేపట్టిన రీసర్వేని ఎందుకు కొనసాగిస్తున్నారు?

ఇరాన్ యుద్దంతో మామిడి, అరటి తదితర పండ్ల ధరలు పడిపోయాయని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని అన్నారు. గతంలో కరోనా వచ్చినప్పుడు జగన్ ఈ రైతులను ఎలా ఆదుకుంది తెలియదా? అయినా తాను ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్లు అంటూ స్పీచ్‌లు ఇచ్చింది చంద్రబాబే కదా! మరి ఇప్పుడు యుద్దం వస్తే రైతులను ఎలా ఆదుకోవాలో తెలియకపోతే ఆయన సీనియారిటీ ఏమైనట్లు? పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గిస్తామని చెప్పిన కబుర్లు అన్నీ అబద్దాలేనని ఒప్పుకుంటున్నారా? గత ప్రభుత్వంలో పది లక్షల కోట్ల అప్పు జరిగిందని చెప్పడం అబద్దమా? నిజమా? అన్నది చంద్రబాబుకు తెలియదా?

వైఎస్‌ జగన్ టైమ్‌లో కరోనా ఉన్నప్పటికీ మూడున్నర లక్షల కోట్ల అప్పు చేస్తే, ఈ రెండేళ్లలోనే మూడున్నర లక్షల కోట్ల అప్పు ఎలా చేశారో చంద్రబాబు చెప్పాలి కదా!ఎంతసేపు బురద వేయడమేనా? వైఎస్సార్‌సీపీని గొడ్డలి పార్టీ అంటూ చంద్రబాబు, లోకేష్‌లు వ్యాఖ్యానించడంపై సజ్జల, కొడాలి నాని ఇచ్చిన కౌంటర్‌కు వీరు సమాధానం ఇవ్వలేకపోయారు. తమది పరశురాముడి గొడ్డలి అని, అవినీతి కూటమి ప్రభుత్వాన్ని గొడ్డలి  కూకటి వేళ్లతో పెకలిస్తుందని వారు ధైర్యంగా చెప్పారు.

టీడీపీ వెన్నుపోటు పార్టీ అన్న విమర్శను చంద్రబాబు, లోకేష్ లు తిప్పికొట్టలేకపోయారు. తమది వెన్నుపోటు పార్టీ అని చెప్పలేరు. అలాగని వెన్నుపోటు పొడవలేదని వాదించలేని నిస్సహాయ స్థితి కనిపిస్తుంది. ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ తన వంతు అబద్దాలతో పాటు కులం, మతం వద్దని, భారతీయత ముఖ్యమంటూ నీతులు చెప్పే యత్నం చేశారు. కాని ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఎంతగా కుల, మత, విద్వేషాలు రేకెత్తించింది ప్రజలకు తెలియదా! లోకేష్ తన స్పీచ్‌లో జగన్‌పై అమర్యాదకర వ్యాఖ్యలు చేసి సెల్ఫ్ గోల్ వేసుకున్నారన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు.

ఎందుకంటే గతంలో నార్నె శ్రీనివాసరావు, కోలా కృష్ణమోహన్‌లు ఆయనపై చేసిన ఆరోపణల వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వైఎస్‌ జగన్‌పై అనవసర వ్యాఖ్యలు చేసి.. ఈ సమస్య తెచ్చుకోవడం లోకేష్‌కు ప్రయోజనమా? అవి ప్రచారంలోకి రావడం లోకేష్ కు ప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నది ఆయనే  ఆలోచించుకోవాలి. విమర్శలలో హుందాతనం ఉండాలి. సంస్కారయుతంగా ఉండాలి. కాని చంద్రబాబు మాదిరి ఏదిపడితే అది మాట్లాడితే సరిపోతుందని అనుకుంటే లోకేష్ పొరబడుతున్నట్లే. కాలం మారిందన్న సంగతి గుర్తించకపోతే ఆయనకే నష్టం.

రెడ్‌బుక్ గురించి ప్రస్తావించి ఏపీలో ఎంత అరాచక పాలన సాగుతోందో లోకేష్ గుర్తు చేసినట్లయింది. కాగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో ధైర్యంగా ప్రభుత్వం అణచివేత చర్యలను ఎదుర్కుంటూ నిరసనలు తెలిపారు. వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ నినదించడానికి ఎక్కడా వెనుకాడలేదు. కూటమి సభలో జనం చాలావరకు మొక్కుబడిగా ఉన్నట్లు  కనిపిస్తే, వైఎస్సార్‌సీపీ క్యాడర్ హోరెత్తించినట్లు అనిపిస్తుంది. కూటమి ఇచ్చిన  ఎన్నికల వాగ్దానాలను ప్రస్తావించి వాటిని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోందని వైఎస్‌ జగన్ ధ్వజమెత్తారు. రెండేళ్లుగా పచ్చి అబద్ధాల ప్రచారం, మోసం, కక్ష సాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్ పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు.

వైఎస్‌ జగన్‌కు, చంద్రబాబుకు ఉన్న ఒక తేడా స్పష్టంగా కనిపించింది. వైఎస్‌ జగన్ తన మానిఫెస్టోని సచివాలయంలో తన ఎదుట పెట్టుకున్నారు. అధికారులకు ఇచ్చి అమలు చేయాలని ఆదేశించారు. చంద్రబాబేమో ఆ మానిఫెస్టోని, ఎన్నికలలో  ఇచ్చిన బాండ్ల గురించి ఎన్నడూ ప్రస్తావించినట్లు కనబడదు. తిరుపతి సభకు హెలికాఫ్టర్ లో వస్తూ చదువుకున్నారట! ఎన్ని అబద్ధపు వాగ్దానాలు ప్రకటించి, ప్రజలను  మభ్య  చేసింది గుర్తు చేసుకుని నవ్వుకుని ఉండాలి. గత ఎన్నికలలో ప్రజలు విజ్ఞత ప్రదర్శించారని ఆయన అన్నారు కానీ.. ఏభై లక్షల మాయ ఓట్లు పోలైన సంగతిని పదే, పదే చెబుతున్న ప్రముఖ మేధావి, చంద్రబాబు వద్ద సలహాదారుగా గతంలో పనిచేసిన పరకాల ప్రభాకర్ ఆరోపిస్తున్న అంశంపై మాత్రం  నోరు మెదపలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలోనే  కూటమిలో విజయోత్సవ సంరంభం పెద్దగా కనిపించలేదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్‌సీపీ ప్రజలలో దూసుకువెళ్లడానికి వెన్నుపోటుకు రెండేళ్ల నిరసనను వాడుకుందని చెప్పాలి. ప్రజలలో ఏర్పడుతున్న అసంతృప్తిని ఎలా తగ్గించాలో తెలియక కూటమి తికమక పడుతుంటే, జనం తమవైపు చూస్తున్నారన్న ఉత్సాహం వైఎస్సార్‌సీపీలో తొణికిసలాడుతోంది.

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement