
మహేశ్వరం: బీఆర్‌ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు ఒకే తాను ముక్కలని, వాటికి ఓటేస్తే మోసం చేస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఇక్కడ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో జరిగిన గిరిజన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ రాక ముందు మజ్లిస్ పార్టీని కాంగ్రెస్ పెంచి పోషించిందన్నారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ధరణి పోర్టల్ పేరుతో పేదల భూములను గద్దల్లాగా లాక్కుంటున్నారని ఆరోపించారు.
ధరణిని అడ్డుపెట్టుకుని బీఆర్‌ఎస్ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న కాలుష్యం వెదజల్లే ఫార్మా కంపెనీలను మహేశ్వరం నియోజకవర్గంలో కందుకూరు మండలానికి మళ్లించారని తెలిపారు. కందుకూరు, యాచారం మండలాల్లోని పేదల భూములను ఫార్మా కంపెనీల ఏర్పాటుకు బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు.
ఇంత జరుగుతున్నా మంత్రి సబితారెడ్డి ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. మహేశ్వరం నియోజకవర్గం మన్సాన్‌పల్లి, మంఖాల్, సర్దార్‌నగర్ గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పాతబస్తీకి చెందిన మజ్లిస్ గూండాలకు పంపిణీ చేశారని ఆరోపించారు. సబితమ్మ గెలిస్తే మహేశ్వరాన్ని మజ్లిస్‌కు రాసిస్తుందని ఎద్దేవా చేశారు. ఎప్పుడూ అందుబాటులో ఉండే అందెల శ్రీరాములు యాదవ్‌ను ఈ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను కోరారు.