ప్రశ్నార్థకంగా మేడిగడ్డ ప్రాజెక్టు  | Sakshi
Sakshi News home page

ప్రశ్నార్థకంగా మేడిగడ్డ ప్రాజెక్టు 

Published Sun, Nov 5 2023 2:23 AM

Kishan Reddy visit Medigadda project - Sakshi

మహదేవపూర్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ఎక్కడా లేని ప్రచారం చేసిందనీ, కానీ ఆ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం చూస్తుంటే దాని భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

శనివారం ఉదయం బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, ఎంపీ డా.కె.లక్ష్మణ్‌ తదితరులతో ప్రత్యేక హెలికాప్టర్‌లో  మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి కుంగిన 20వ పిల్లర్‌ను సందర్శించారు. కిషన్‌రెడ్డి బృందానికి ఈఈ తిరుపతిరావు ప్రాజెక్టు పరిస్థితులను వివరించారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కుంగిపోయిన విషయం తెలిసిన వెంటనే తాను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. ఆయన వెంటనే స్పందించి నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందాన్ని పరిశీలనకు పంపించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని 20 అంశాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని బృందం సభ్యులు కోరగా, ప్రభుత్వం 11 అంశాల వివరాలిచ్చి మిగతావి ఇవ్వలేదన్నారు. 

డ్యాం నిర్మాణంలోనే లోపాలు 
నిపుణుల కమిటీ.. డ్యాం నిర్మాణంలో లోపాలను ఎత్తిచూపిందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. పియర్స్‌ కింద సింగిల్‌ స్టోన్‌ పెట్టడం వల్ల ఆ స్టోన్‌ దెబ్బతినడంతో పియర్స్‌ కుంగిపోయాయని నిపుణులు పేర్కొన్నట్టు తెలిపారు. సాయిల్, ఇసుక నాణ్యత, మెటీరియల్, ఇంజనీరింగ్‌ నాసిరకంగా ఉన్నాయని ఆరోపించారు. మేడిగడ్డ తరువాత అన్నారం బ్యారేజీ కూడా ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జీవనాధారమైన మేడిగడ్డ ప్రాజెక్టులో ఒక్క టీఎంసీ నీరు కూడా నిలువ ఉంచే పరిస్థితి లేదన్నారు. 

కేసీఆర్‌ వాస్తవాలు చెప్పాలి: కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి వాస్తవాలు తెలుసుకునే హక్కు చెమటోడ్చి పన్నులు కట్టిన ప్రజలకు ఉందని, సీఎం కేసీఆర్‌ వాస్తవాలు చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌కు రైతులపై గౌరవం ఉంటే మేడిగడ్డ ప్రాజెక్టుపై న్యాయవిచారణకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని, కోరిన వెంటనే 15 నిమిషాలలో సీబీఐతో విచారణ జరిపిస్తామని తెలిపారు. గ్రావిటీద్వారా నీరందించే రూ.30 వేల కోట్లతో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కాదని, రూ.40వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టి చివరికి రూ.లక్షకోట్లతో నిర్మించి రాష్ట్రానికి గుదిబండగా మార్చారని కిషన్‌రెడ్డి విమర్శించారు. 

Advertisement
Advertisement