
తెలంగాణలో ఇప్పటికే 34 శాతం బీసీ రిజర్వేషన్లు
వాటిని 32 శాతానికి తగ్గించేలా సర్కారు ప్రణాళిక
బీసీలను మోసం చేయడమే తెలంగాణ మోడలా..?
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయం బీజేపీనే
మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్‌ను 32 శాతానికి తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు బీసీలను అణగదొక్కే కుట్రలో భాగమని ఆరోపించారు. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీసీ సీట్లలో 31 మంది నాన్–బీసీలు గెలవడం ఏమిటని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘ఒవైసీ బీసీనా? బీసీలకు రిజర్వు చేసి మజ్లిస్ చేతుల్లో పెట్టడం ద్వారా న్యాయం జరుగుతుందా?’అని కిషన్‌రెడ్డి నిలదీశారు.
రాష్ట్రంలో జరిగిన బీసీ లెక్కల సర్వేను తూతూ మంత్రంగా నిర్వహించారని, హైదరాబాద్ నగరంలో 25 శాతం ఇళ్లలోకి వెళ్లకుండా సర్వే ముగించారని ఆరోపించారు. బీసీ జనాభాను తక్కువగా చూపించి రిజర్వేషన్లను తగ్గించాలన్న కుట్రలో భాగంగానే ఇది జరిగిందని ధ్వజమెత్తారు. ఈ కుట్రలను బీసీలు గుర్తించాలని కోరారు.
నాడు బీఆర్‌ఎస్.. నేడు కాంగ్రెస్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మతపరమైన రిజర్వేషన్ల కోసం రాజకీయ నాటకాలు ఆడుతున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 12 శాతం ముస్లిం రిజర్వేషన్ల కోసం కుట్రలు చేసినట్టే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. ‘ఇదేనా మీ తెలంగాణ మోడల్? బీసీలను మోసం చేయడమే మోడలా?’అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వమే బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించిందని తెలిపారు.
రాహుల్‌గాందీని ప్రధానిని చేస్తామన్న సీఎం రేవంత్ ప్రకటనను కిషన్‌రెడ్డి కొట్టిపారేశారు. ‘మీరు అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లోనైనా గెలవండి. మోదీని గద్దె దించుతామన్న మీ గొప్పలు సూర్యుడిపై ఉమ్మేసినట్టే. అది మీ మీదే పడుతుంది’అని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతిపై రాష్ట్ర మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి ఖండించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మేమే ప్రత్యామ్నాయం
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ఇప్పటికే పశ్చాత్తాపం చెందుతున్నారని, రాబోయే ఎన్నికల్లో అవినీతి బీఆర్‌ఎస్, చేతకాని కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలని ప్రజలు ఆశిస్తున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం బీజేపీ నిబద్ధతతో పనిచేస్తుందని తెలిపారు. అధికారం కోసం అలవిగాని హామీలిచ్చి, ఇప్పుడు వాటిని నెరవేర్చకుండా ప్రభుత్వం ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తోందని ఆరోపించారు.