కేశినేని చిన్నిపై నాని సంచలన ఆరోపణలు | Kesineni Nani Serious Comments On MP Chinni | Sakshi
Sakshi News home page

కేశినేని చిన్నిపై నాని సంచలన ఆరోపణలు

Jun 6 2026 11:26 AM | Updated on Jun 6 2026 11:51 AM

Kesineni Nani Serious Comments On MP Chinni

సాక్షి, విజయవాడ: మైలవరంలో జరుగుతున్న మాఫియాపై కేశినేని నాని మరోసారి సంచలన పోస్టు పెట్టారు. వరుసగా నాలుగో ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో విజయవాడ పార్లమెంట్‌ స్థానంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని మండిపడ్డారు. అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తారా? అని ప్రశ్నించారు.

మాజీ ఎంపీ కేశినేని నాని సోషల్‌ మీడియా వేదికగా అక్రమ దందాలపై ప్రశ్నించిన సొంతపార్టీ(టీడీపీ) నేతలపై వేధింపులు ఏ విధంగా కొనసాగుతున్నాయో పోస్టులో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నాని.. ఎంపీ కేశినేని చిన్ని అక్రమ దందాలను ప్రశ్నిస్తే సొంత పార్టీ నేతలపైనే ఏకంగా హత్యా ప్రయత్నం కేసులు పెట్టి జైలుకు పంపుతారా? ఇదా మీ ఫ్యాక్షన్ రాజకీయం?. ఫ్లై యాష్, గ్రావేల్ మాఫియా అక్రమాలను సాక్ష్యాలతో సోషల్ మీడియాలో బయటపెట్టడమే ఉయ్యూరు పెదబాబు, రమేష్ రెడ్డి తప్పా?. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వెనుక ఎంపీ చిన్ని ఉన్నాడు.  చిన్ని, ఆయన సహచరుడు మూల్పూరి కిషోర్ మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు.

అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తారా?. మొదట షోకాస్ నోటీసులు ఇప్పించారు. రాత్రికి రాత్రే పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు.మంగళగిరి పార్టీ ఆఫీసుకు వెళ్లి వస్తుంటే ఇబ్రహీంపట్నం సర్కిల్ దగ్గర పోలీసులతో అక్రమంగా అరెస్ట్ చేయించారు. ఆటో ఎక్కనంటే నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లినంత పని చేస్తూ నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించినందుకు, వారిపై ఏకంగా సెక్షన్ 307 హత్యా ప్రయత్నం లాంటి తప్పుడు కేసులు బనాయించి, నందిగామ సబ్ జైలుకు రిమాండ్‌కు తరలించారు. 

వాళ్లేమన్నా రౌడీ షీటర్లా లేక హంతకులా? ఒక ప్రజాప్రతినిధి అండతో పోలీసులు ఇంతలా బరితెగిస్తారా?. నాయకుల ఆర్థిక ప్రయోజనాల కోసం, సొంత దందాలను కాపాడుకోవడం కోసం ప్రశ్నించిన వారి గొంతు నొక్కడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడితే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ప్రజలు పిచ్చోళ్లు కాదు. మైలవరంలో సాగుతున్న ఈ గ్రావెల్, ఫ్లై యాష్ అక్రమాలపై, అలాగే ఈ అక్రమ కేసులపై తక్షణమే విచారణ జరిపించాలి అని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement