సాక్షి ప్రతినిధి, కడప: రిజర్వేషన్లు అధికారికంగా ఖరారే కాలేదు.. నోటిఫికేషన్ ఇంకా రానేలేదు.. అప్పుడే ‘టీడీపీ’ ఇంట కుంపటి రాజేసుకుంది.. కడప ముంగిట పొలిటికల్ హీట్ పెరిగింది. కడప నగరపాలక సంస్థ మేయర్ స్థానాన్ని ‘ఓసీ మహిళ’ కు కేటాయించడం దాదాపు ఖరారయినట్లేనని వస్తున్న వార్తలతో ‘పచ్చ’పార్టీలోని ఇరు వర్గాల్లో ప్రకంపనలు షురూ అయ్యాయి. మాజీ కార్పొరేటర్ జి.ఉమాదేవి అభ్యర్థిత్వంపై అధిష్టానం మొగ్గు చూపుతుందనే ప్రచారమే అందుకు కారణంగా మారింది. ఈనిర్ణయాన్ని ఎమ్మెల్యే మాధవిరెడ్డి శిబిరం ససేమిరా అంటోంది. అందుకు ప్రత్యామ్నాయంగా రెడ్డెప్పగారి కుటుంబానికి చెందిన ఓ మహిళ డాక్టర్ పేరును తెరపైకి తెస్తున్నారు. పార్టీలో ఎవరికీ ఎలాంటి వివాదస్పదం కానటువంటి డాక్టర్ పేరు తేవడం ద్వారా ఉమాదేవి అభ్యర్థిత్వానికి చెక్ పెట్టే ఎత్తుగడలు వేస్తున్నారు.
ఎన్నికలు సజావుగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తే కడప మేయర్ స్థానం దక్కించుకోవడం వైఎస్సార్‌సీపీకి అతి సునాయసమని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఆయా రాజకీయ పార్టీలు స్వతహాగా చేసిన సర్వేల్లో కూడా ఇదే తేలిందని సమాచారం. కాగా అధికారికంగా వెల్లడి కాకున్నా కడప నగరపాలక మేయర్ సీటును ఓసీ మహిళకు రిజర్వు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎస్సీ మహిళకు రిజర్వుడు చేయాల్సిందిగా ఓ వర్గం విశేషంగా కృషి చేసి విఫలమైనట్లు తెలిసింది.
ఈ పరిస్థితుల్లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఏకైక కార్పొరేటర్‌గా ప్రాతినిథ్యం వహించిన గొంగల్‌రెడ్డి ఉమాదేవి అభ్యర్థిత్వంపై ఆ పార్టీ అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. కాగా, ఉమాదేవి అభ్యర్థిత్వంపై ఎమ్మెల్యే మాధవీరెడ్డి వర్గీయులు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. ఓసీ మహిళ రిజర్వుడు చేస్తే... వివాదాస్పదం కాని అభ్యర్థిని బరిలోకి దించాలంటూ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఎమ్మెల్యే మాధవి రెడ్డి వర్గీయులు టీడీపీ మేయర్ అభ్యరి్థగా రెడ్డెప్పగారి కుటుంబానికి చెందిన ఓ మహిళా డాక్టర్ పేరును తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ఇదే విషయమై టీడీపీ అధిష్టాన దూతల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఆ డాక్టర్ ఏనాడైనా టీడీపీ కండువాతో ప్రచారం చేశారా?
రాయలసీమ పార్టీ కార్యక్రమాల ఇన్‌ఛార్జిగా ఉన్న ఓ నాయకుడు ఎమ్మెల్యే మాధవిరెడ్డి వర్గం చేసిన ‘మహిళా డాక్టర్’ ప్రతిపాదనలపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ‘ఇది వరకూ ఆ మహిళ డాక్టర్ ఏనాడైనా పార్టీ కోసం పనిచేశారా? కండువా వేసుకొని ప్రచారం చేశారా? మేయర్ స్థానానికి పోటీ చేసే మహిళానాయకులు పార్టీలో లేరా? ఇలాంటి ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. టీడీపీకి పనిచేసిన వ్యక్తులనే అభ్యర్థులను చేయాలనే సంకేతాలను ఆ పార్టీ అధిష్టానం చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకొని ఎలాగైనా మేయర్‌గిరి కేటాయిస్తారనే ఆశాభావం ఉమాదేవి కుటుంబం వ్యక్తం చేస్తుండడం విశేషం.
ప్రజా క్షేత్రంలో బలంగా వైఎస్సార్‌సీపీ
టీడీపీ కలిసికట్టుగా పనిచేసినా ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ చేతిలో ఓటమి ఖాయమని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అపార మద్దతు లభిస్తోంది. ఆ పార్టీలో చేరికలు కూడా అందుకు సంకేతాలుగా నిలుస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వివాదం అవసరమా? అంటూ టీడీపీకి చెందిన కొంతమంది సీనియర్లు వాపోతున్నట్లు సమాచారం.
వ్యూహాల్లో ఇరుపక్షాలు...
మాజీ కార్పొరేటర్ ఉమాదేవికి తొలి నుంచి ఉన్న టీడీపీ నేతల మద్దతు లభిస్తోందని సమాచారం. జిల్లా కేంద్రమైన కడప కార్పొరేషన్‌లో భాగస్వామ్యంగా ఉన్న కమలాపురం ఏరియా నుంచి ఎమ్మెల్యే పుత్తా కుటుంబం కూడా మద్దతుగా నిలుస్తోన్నట్లు తెలుస్తోంది. కాగా అతిపెద్ద భాగస్వామిగా నిలుస్తోన్న కడప నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మాధవి రెడ్డి వర్గీయులకు ప్రాధాన్యత ఇవ్వకపోతే, పార్టీ ఎలా గెలుస్తుందంటూ ఎమ్మెల్యే వర్గీయులు నిలదీస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితులల్లో ఎవరికి వారు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు.


