చింతకొమ్మదిన్నె : నల్సా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సురక్షిత బాల్యం – సమాజ బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్. బాబా ఫకృద్దీన్ బుధవారం కె.కృష్ణాపురం, జె.కొత్తపల్లె ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలల భద్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, లైంగిక వేధింపుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, ‘మంచి స్పర్శ – చెడు స్పర్శ’పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమస్యలు ఎదురైతే భయపడకుండా పెద్దలకు చెప్పాలన్నారు. సైబర్ క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ నరసింహ మాట్లాడుతూ, నకిలీ లింకులు, ఓటీపీ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సీడబ్ల్యూసీ సభ్యుడు సుభాష్ ఆపదలో ఉన్న బాలలకు అందే రక్షణ, పునరావాస చర్యలను వివరించారు. అత్యవసర సమయాల్లో న్యాయ సహాయం కోసం 15100, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, సైబర్ నేరాలపై 1930 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, డీఎల్‌ఎస్‌ఏ సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.


