అడుగంటుతున్న ఆశలు | - | Sakshi
Sakshi News home page

అడుగంటుతున్న ఆశలు

Nov 26 2026 12:12 AM | Updated on Nov 26 2026 12:12 AM

కడప అగ్రికల్చర్‌ : దేవుడిపై భారం వేసి పంటలు సాగు చేసిన రైతులు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. నవంబర్‌ నెల చివరకు చేరుకున్నా వరుణుడు పూర్తిస్థాయిలో కరుణించకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే పలు మండలాల్లో సాగు చేసిన ఆరుతడి పంటలు ఎండుముఖం పట్టాయి. మరో పది రోజుల్లో భారీ వర్షం కురవకపోతే పంటలన్నీ పూర్తిగా ఎండిపోయి, పెట్టుబడులు నేలపాలయ్యే ప్రమాదం పొంచి ఉంది.

తేలికపాటి జల్లులతో తాత్కాలిక ఊరటే!

ద్రోణి ప్రభావంతో బుధవారం జిల్లాలోని 16 మండలాల్లో వర్షం కురిసినప్పటికీ, అది రైతులకు ఆశించిన స్థాయిలో ఊరటనివ్వలేదు. వల్లూరు (29.2 మి.మీ.), కమలాపురం (24.2 మి.మీ.), పెండ్లిమర్రి (18.4 మి.మీ.), మైదుకూరు (16.6 మి.మీ.) మండలాల్లో కురిసిన వర్షంతో వాడుముఖం పట్టిన పైర్లకు కొంత ప్రాణవాయువు అందింది. అయితే, మిగిలిన 12 మండలాల్లో 10 మి.మీ. కంటే తక్కువగా కేవలం తేలికపాటి జల్లులు మాత్రమే పడ్డాయి. అధిక ఎండలు, పొడి గాలులకు ఈ తడి భూమిలో నిలవదని, కొత్తగా విత్తనాలు వేయడానికి ఈ పదును ఏమాత్రం సరిపోదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరుణుడి జాడ కరువు.. వేసవిని తలపిస్తున్న ఎండలు

ఇటీవల ఏర్పడిన అర్నబ్‌, మురసు తుపాన్ల ప్రభావం కోస్తా జిల్లాలకే పరిమితమైంది. చలికాలంలోనూ పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలకు పైగా నమోదవుతూ వేసవిని తలపిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో 132.1 మి.మీ. సాధారణ వర్షపాతానికి గాను 56.8 మి.మీ. (57% లోటు), నవంబర్‌లో 61.6 మి.మీ. గాను కేవలం 9.8 మి.మీ. (84% లోటు) వర్షం మాత్రమే కురిసింది.

ఇళ్లలోనే విత్తనాలు, ఎరువులు..

కోట్లలో పెట్టుబడులు

ప్రభుత్వ సబ్సిడీ శనగ విత్తనాలు సకాలంలో అందకపోవడంతో, రైతులు బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి ఇళ్లలో సిద్ధం చేసుకున్నారు. సరైన పదును వర్షం లేక అవన్నీ ఇళ్లలోనే మగ్గుతున్నాయి. అక్టోబర్‌ అదను నుంచి శనగ, మినుము, జొన్న, మొక్కజొన్న, పత్తి తదితర పంటల సాగు కోసం రైతులు ఎకరాకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు పెట్టుబడి పెట్టారు. ముఖ్యంగా కౌలు రైతులైతే అప్పులు తెచ్చి మరీ సాగు చేసి, వర్షం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

అప్పుల ఊబిలో అన్నదాతలు

సాగు చేసిన ఆరుతడి పంటలను వెంటాడుతున్న వర్షాభావం

మరో పది రోజుల్లో భారీ వాన లేకపోతే పంటలన్నీ ఎండిపోయే ప్రమాదం

జిల్లాలో 1,44,186 హెక్టార్లకు గాను 59,432 హెక్టార్లలోనే సాగు

వర్షాధారంగా 46,666 హెక్టార్లలో వివిధ పంటలు వేసిన రైతులు

ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పెట్టుబడులు నష్టపోయే ముప్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement