చెక్కు చెదరని అభిమానం​ | Kadapa Election Results, YSRCP Candidate Bags 66,027 Votes Despite Tough Political Battle, Read Story For More Details | Sakshi
Sakshi News home page

చెక్కు చెదరని అభిమానం​

Nov 5 2026 11:45 AM | Updated on Nov 5 2026 12:33 PM

Kadapa Election Results, YSRCP Candidate Bags 66,027 Votes Despite Tough Political Battle

అడుగడుగునా ఆంక్షలున్నా... ‘ఓటర్లు’ వెనకడుగు వేయలేదు.. పోలింగ్‌ కేంద్రాల్లో ఆ పార్టీ ఏజెంట్లే లేకున్నా.. పక్క పార్టీ వైపు చూసింది లేదు..  వీధుల ముంగిట పచ్చ గూండాలు మోహరించినా.. ‘ఫ్యాను’ ముందు ఆ పప్పులేం ఉడకలేదు..  దౌర్జన్యాన్ని ఛేదిస్తూ.. పచ్చ మూకల అష్ట దిగ్బంధనాన్ని దాటుకుంటూ మరీ ఓటేశారు.. ఒక్క రూపాయి డబ్బు పంచకున్నా.. పోల్‌ మేనేజ్‌మెంట్‌ అస్సలే లేకున్నా ‘ఓటేసి’ ‘అభిమానం’ ఇంచుకూడా తగ్గలేదని నిరూపించారు. కడప కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థి దీప్తిరెడ్డికి పోలైన ఓట్లను చూసి రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు.  

సాక్షి ప్రతినిధి, కడప:  కడప వైఎస్సార్‌సీపీకి కంచుకోట అని మరోసారి రుజువైంది. కడప కార్పొరేషన్‌ మేయర్‌ స్థానాన్ని టీడీపీ గెలిచిందనే దానికంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బండి దీప్తిరెడ్డికి 66,027ఓట్లు లభించడమే జిల్లాలో పెద్దగా చర్చనీయాంశమైంది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి కూటమి నేతలు సాగించిన అరాచకం నభూతో నభవిష్యతి అన్న విధంగా తయారైంది. దీనికితోడు అధికార యంత్రాంగం మొత్తం కూటమి ఎదుట సాగిలపడిన తీరు లోకమంతా చూసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల రోజు ఓటర్లు స్వచ్ఛందంగా తరలివచ్చి వైఎస్సార్‌సీపికి మద్దతు పలకడం చర్చకు కారణమైంది. అర్ధరూపాయి డబ్బు పంపిణీ చేయకుండా ఆస్థాయి ఓట్లు సాధించడం ‘గొప్ప విషయమం’ అనే మాట విశ్లేషకుల నోట వినిపిస్తోంది.  

∙కడప కార్పొరేషన్‌ పరిధిలో 66డివిజన్లలో పోటీ చేసేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధం కాగా వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని నామినేషన్ల దశలోనే టీడీపీ నరమేధం సాగించింది. పోలీసు అధికారుల సాక్షిగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై నడివీధుల్లో ప్రత్యక్షదాడికి తెగబడింది. శాంతిభద్రతల పరిరక్షణకు రెండు కళ్లులాంటి కలెక్టర్‌ శ్రీధర్, ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ నివాసాలున్న ప్రాంతాలల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడే ఎన్నికలపై ప్రజల్లో భయం కలిగింది. ఇలా ఉంటే ప్రజలు ఓటు ఎలా వేస్తారంటూ ప్రజాస్వామ్యవాదుల్లోనూ ఆందోళన మొదలైంది. అప్పటికే 52 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి.  ఆపై సుప్రీం తీర్పుతో 11 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కార్పొరేటర్లుగా నామినేషన్‌ వేశారు. అంతటితో ఆగలేదు..నామినేషన్ల పరిశీలన.. ఆపై ఉపసంహరణలో పచ్చ నేతలు బీభత్సం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ నేతలు ధైర్యంగా నిలబడ్డారు.  

ముగ్గురూ ముగ్గురే..... 
కార్పొరేషన్‌ ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్థి బండిదీప్తిరెడ్డి, 33వ డివిజన్‌ కార్పోరేటర్‌  సంద్యారాణి(దేవిరెడ్డి ఆదిత్య), 46వ డివిజన్‌ కార్పోరేటర్‌ జమీల్‌ ముగ్గురు ముగ్గురే అన్నట్లుగా కీర్తి గడించారు. దీప్తిరెడ్డి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి అనర్గళంగా ప్రజలకు వివరించింది. టీడీపీ నేతల దౌర్జన్యానికి ధీటుగా జవాబు చెబుతూ ప్రజల ముంగిటకు వెళ్లింది. ఆమెకు అండగా జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ మంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా, మాజీ మేయర్‌ సురేష్‌ బాబు, కమలాపురం ఇన్‌ఛార్జి నరేన్‌ రామాంజులరెడ్డి ప్రచారపర్వం కొనసాగించారు. 33,46వ డివిజన్ల్లలో వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లు లేకపోయినా, వందలాది ఓట్లు రిగ్గింగ్‌ చేసుకున్నా జమీల్‌ 344ఓట్లు, దేవిరెడ్డి ఆదిత్య సతీమణీ సంధ్యారాణి 139 ఓట్లుతో విజయం సాధించడాన్ని పలువురు కొనియాడుతున్నారు.    

కూటమి చేసింది ఏమీలేక..   
జిల్లా కేంద్రంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చెప్పుకునే అవకాశం లేకే ఇలాంటి దాడులు.. దౌర్జన్యాలు తెరపైకి తీసుకొచ్చాని విశ్లేషకులు వివరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై ప్రత్యక్ష దాడులకు దిగడం.. తిరగబడితే ఏకపక్షంగా హత్యయత్నం కేసులు నమోదు చేయడం ఇందులో భాగమేనని చెబుతున్నారు. బయట కన్పిస్తే అరెస్టు లు చేస్తారనే భయంతో వైఎస్సార్‌సీపీ నేతలు అజ్ఞాతవాసం గడపాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి దంపతులు వైఎస్సార్‌సీపీ నేతల్ని టార్గెట్‌ చేసినప్పటికీ ప్రజలు ఆశీర్వదించడం వారికి జీరి్ణంచుకోలేని అంశంగా పరిగణించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితులల్లో టీడీపీ నేతలకు భవిష్యత్‌పై బెంగపట్టుకుందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.  

ప్రజల ఆదరణ అపూర్వం... 
పోలింగ్‌ తేదీ రానే వచ్చింది. తెల్లవారుజాము నుంచే పచ్చమూక కేంద్రాల చుట్టూ మోహరించింది. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు రాకుండానే ఎక్కడికక్కడ దౌర్జన్యకాండ చేసింది. ఎదిరించిన వారిపై దాడులకు దిగింది. అంతకుముందు పోలీసు యంత్రాంగమూ తమ వంతు సాయంగా ముఖ్యనేతలందరినీ ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్ట్‌ చేసి స్వామి భక్తిని ప్రదర్శించింది.ఇన్ని ఆటంకాల నడుమ పోలింగ్‌ ప్రారంభమైంది...  

‘ఒకటో తేదీ వస్తే చాలు... తన మనవడు వైఎస్‌ జగన్‌ ఇంటికి పింఛన్‌ పంపించిన సాయం గుర్తొచ్చిన ‘అవ్వ’ ఓటరు స్లిప్‌తో అడుగేసింది... ‘తన బిడ్డల చదువులకు అన్నగా వైఎస్‌జగన్‌ అందించిన ‘అమ్మ ఒడిని’ తలచుకుని ఓ చెల్లి పోలింగ్‌ బూత్‌ వైపు నడిచింది.. ‘చేయూత’నిచ్చిన తమ్ముడు జగన్‌ మేలును గుర్తుంచుకుని ఓ అక్క ధైర్యంగా ఓటేయడానికి వచ్చింది.. జగనన్న ‘ఫ్యాన్‌’గా ఓ యువకుడు.. ‘ఆరోగ్య శ్రీ’ ఆసరా సాయం పొందిన ఓ మధ్య వయస్కుడు.. ఇలా ఒక్కొక్కరుగా ఆంక్షల సంకెళ్లను తెంచుకుంటూ అడుగేశారు. ‘ఒక్క రూపాయి డబ్బు ఇవ్వకుంటేనేమి సారూ.. ఆయన చేసిన సాయం మా గుండెల్లో నిలిచే ఉంది ’ అంటూ ఓటేశారు.. అంతే.. ఒక్కొక్కరుగా ఓటర్లు వస్తుండడంతో దిమ్మ తిరిగిన కూటమి నేతలు మధ్యాహ్నానికే ‘బరి’ తెగించారు. అప్పటివరకు విపక్ష ఏజెంట్లే లేరు..ఇక తమకు అడ్డెవరులే అనుకుంటే ఈ ఓటర్లు కొంప ముంచేలా ఉన్నారనుకుని.. ఓటర్లనూ అడ్డుకున్నారు. ఆపై విచ్చలవిడిగా రిగ్గింగ్‌.. సైక్లింగ్‌ చేసుకున్నారు.  మధ్యాహ్నం ఓటేద్దామని వెళ్లిన వారి చేతిలోంచి ‘స్లిప్పు’ తీసుకుని ‘మీ ఓటు వేసేశాం ..మీరు వెళ్లిపోండి’ అంటూ దౌర్జన్యం చేశారు. అంతకుముందు స్వచ్ఛందంగా ప్రజలు వేసిన ఓట్లన్నీ వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి బండిదీప్తిరెడ్డికే లభించాయి. పోలింగ్‌కేంద్రాల్లో  వైఎస్సార్‌సీపీ  ఏజెంట్లు లేకున్నా.. పోలీసుల సమక్షంలో పచ్చమూకలు దాడులు చేస్తున్నా 66,027 ఓట్లు రావడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు.  ప్రశాంత ఎన్నికలు తెరపైకి వచ్చింటే ‘ఫ్యాను గాలికి’ టీడీపీ కొట్టుకుపోయేవారని స్పష్టం చేస్తున్నారు.  

ఇదీ చదవండి: AP MPTC ZPTC Elections: టీడీపీ ఏజెంట్లుగా పోలీసులు.. షాకిచ్చిన ఓటర్లు


  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement