
సాక్షి, విశాఖపట్నం: ‘జనసేన నేతలకు, కార్యకర్తలకు ఏం పనులు జరగడం లేదు. మీ వెనుక మేమెందుకు నడవాలని పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. వారికి ఏం సమాధానం చెప్పాలి’ అని జనసేన 15వ వార్డు అధ్యక్షురాలు కళ ఆ పార్టీకీలక నేత, ఎమ్మెల్సీ కె.నాగబాబును నిలదీశారు. ఇదే విషయమై 33వ వార్డు జనసేన కార్పొరేటర్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి భర్త భీశెట్టి గోపీకృష్ణ కూడా ఎమ్మెల్సీ నాగబాబును నిలదీయగా.. వీరిద్దరినీ తీవ్రంగా అవమానించడం కలకలం రేపింది.
ఎమ్మెల్సీ కె.నాగబాబు విశాఖ సీతంపేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన వీరమహిళ కళ మాట్లాడారు. తమ వెనుక ఉన్న వారికి ఒక్క పని కూడా చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. పార్టీ నాయకులు వెంటనే ఆమె మాట్లాడుతున్న మైక్‌ను కట్ చేశారు. మైక్ ఇవ్వాలని ఆమె అడిగినప్పటికీ.. మైక్‌ను వేరొకరికి ఇవ్వాలని వేదికపై ఉన్న నాయకులు ఆదేశించారు. దీనిపై ఎమ్మెల్సీ నాగబాబు స్పందిస్తూ.. ‘పార్టీ కార్యకర్తలు అసహనంతో పనిచేయొద్దు. వ్యక్తిగతమైన సమస్యల్ని వదిలేసి కూటమితో కలిసి పనిచేయాల్సిందే’ అని తెగేసి చెప్పడంతో సమావేశానికి హాజరైన నాయకులు షాక్‌కు గురయ్యారు.
జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భర్తకూ అవమానం
ఇదే సమావేశంలో జనసేన నాయకులు, కార్యకర్తల గోడును విన్నవించుకునే ప్రయత్నం చేసిన 33వ వార్డు జనసేన కార్పొరేటర్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి భర్త గోపీకృష్ణకు సైతం తీవ్ర అవమానం ఎదురైంది. కూటమి ప్రభుత్వం తమ మాటకు విలువ ఇవ్వడం లేదని గోపీకృష్ణ చెప్పే ప్రయత్నం చేయగా.. నాగబాబు సీరియస్ అయ్యారు. మైక్ కట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ మండిపడ్డారు. పవన్‌ను నమ్మి తన భార్యను కార్పొరేటర్‌గా గెలిపించుకుంటే.. ఇలా అవమానిస్తారా? అని గోపీకృష్ణ సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలిసింది.
