నా కన్నీళ్లను నీ ముంగిట్లో ముగ్గేసి వెళుతున్నా.. | Sakshi
Sakshi News home page

నా కన్నీళ్లను నీ ముంగిట్లో ముగ్గేసి వెళుతున్నా..

Published Thu, Dec 21 2023 3:23 PM

Janasena Pawan Kalyan Comments In Yuva Galam Ending Sabha - Sakshi

నాన్న గారు.. మీరంటే నాకెంతో ఇష్టం.. అమ్మ అంటే కూడా అంతే ప్రేమ. కానీ, ఏం చేస్తాం నాన్నా.. పరిస్థితులు అలా తగలడ్డాయి. నాకు తెలియకుండానే నేను ఆ అబ్బాయితో లవ్వులో పడ్డాను.. ఆయన లేకుండా నేను బతకలేను. ఆయన్ను వదిలి మీ దగ్గర ఉండలేను.. అలాగని మిమ్మల్ని వదిలి పోలేను. కానీ, గవ్వలు వేసి చూస్తే అబ్బాయితో వెళ్లిపొమ్మని వచ్చింది.. అందుకే నేను అబ్బాయితో వెళ్ళిపోతున్నాను.. మీరు అమ్మ ఎప్పుడూ నాకు తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను.. మీ ఆశీస్సులు ఎప్పుడూ నాకు ఉంటాయని తెలుసు.. వెళ్తున్నాను నాన్నా.. ఇలాంటి లేఖలు చాలాసార్లు విన్నాం.. చూశాం.

తల్లిదండ్రులకు ఇష్టంలేని పెళ్లి చేసుకుని ప్రియుడితో వెళ్లిపోయే ప్రతీ అమ్మాయీ ఇలాగే లెటర్ రాసిపెట్టి తుర్రుమంటుంది. ఇప్పుడు పవన్ సైతం తన మార్గదర్శకులు.. రాజకీయ మెంటార్స్ అనదగిన బీజేపీకి ఒక మెసేజ్ పంపించారు. విజయనగరం జిల్లాలో జరిగిన యువగళం ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ తనకు తెలుగుదేశంతో కలిసి ఉండాలన్న తపన.. తహతహ లోలోన ఏవో రహస్య అవగాహనలు.. ఒప్పందాలు కలగలిసి పవన్‌ను టీడీపీ నుంచి దూరంగా జరగనివ్వడం లేదు. అలాగని మొన్ననే తెలంగాణాలో పొత్తుపెట్టుకున్న బీజేపీని అలవోకగా వదిలి వెళ్ళడానికి ఇష్టం లేదు. 

పోనీ బీజేపీని తీసుకుని టీడీపీతో కలిసి వెళ్ళడానికి తనకు ఎంతో తాపత్రయం ఉన్నా ఢిల్లీ పెద్దలు దీనికి ససేమిరా అంటున్నారు. ఎందుకంటే బీజేపీని చంద్రబాబు ఎంతగా అవమానించింది.. ఎంతగా వాడుకుని వదిలేసింది.. మోదీని, అమిత్ షాను ఎన్ని బూతులు తిట్టింది.. ఎన్ని దీక్షలు ఆర్గనైజ్ చేసి ప్రజలు, నాయకులతో తిట్టించిందీ అంతా ఢిల్లీ పెద్దలకు గుర్తుంది. అందుకే పవన్‌ను సైతం చంద్రబాబు అవకాశవాదం గురించి హెచ్చరిస్తూనే ఉన్నారు కానీ.. పవన్ ఎందుకని చంద్రబాబు చేతిలో చిక్కుకున్నారో అర్థం కానీ పరిస్థితి. బీజేపీతో కలిసి ఆంధ్రాలో ఎన్నికలకు వెళ్తే బావుంటుందని అటు జనసైనికులు.. బీజేపీ పెద్దలు.. కాపు నేతలు సైతం భావిస్తున్నా పవన్ మాత్రం చంద్రబాబును వీడేది లేదని ఫిక్స్ అయ్యారు.

ఇక నిన్న జరిగిన లోకేష్ యాత్ర ముగింపు సభలో తన బాధ.. ఆవేదన.. కోపం.. కసి కలగలిపిన విచిత్రమైన భావన బయటకు వెళ్లగక్కేశారు. బీజేపీని కాదని తెలుగుదేశంతో వెళ్లడాన్ని సమర్థించుకుంటూనే నన్ను ఆశీర్వదించండి.. నన్ను అర్థం చేసుకోండి నేను టీడీపీతో వెళ్ళిపోతున్నాను.. అంటూ ఒక ఆవేదనతో కూడిన విన్నపం చేశారు. చూస్తుంటే పవన్ టీడీపీ వలలో, ఉచ్చులో చిక్కుకున్నట్లు అవలీలగా తెలుస్తోంది.

కాబట్టి బీజేపీ ఏమనుకున్నా.. వద్దన్నా.. ఉరేసుకున్న తాను మాత్రం వెళ్తున్నట్లు పవన్ స్పష్టం చేసేశారు.. వెళుతున్నా వెళుతున్నా.. దూరంగా వెళుతున్నా.. వెళ్లాలని లేకున్నా దూరంగా వెళుతున్నా.. నా కన్నీళ్లను నీ ముంగిట్లో ముగ్గేసి వెళుతున్నా.. అంటూ టీడీపీతో జత కట్టేందుకు సిద్ధం అయ్యారు. అందులో భాగంగా వేలాది మంది ప్రజల సమక్షంలో ఆ విషయాన్నీ బీజేపీ అధిష్టానానికి స్పష్టం చేసేశారు.
సిమ్మాదిరప్పన్న

Advertisement
 
Advertisement