మచిలీపట్నంటౌన్/చిలకలపూడి: జనసేన నేత పవన్‌కళ్యాణ్ టీడీపీతో పొత్తును మరోసారి సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. ఇందుకు ఏకంగా జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ పేర్లను వాడుకోవటం చర్చనీయాంశమైంది. మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాలను జనసేన ఆధ్వర్యంలో సోమవారం ఉదయం మచిలీపట్నంలోని సువర్ణ కళ్యాణ మండపంలో నిర్వహించారు. సాయంత్రం జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. పవన్‌తోపాటు పార్టీ నేత నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ పుణెలో జరిగిన సమావేశంలో మహాత్మాగాంధీ, అంబేడ్కర్ మధ్య అనేక అభిప్రాయభేదాలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు. అయినప్పటికీ దేశ ప్రయోజనాల కోసం మేధావి అయిన అంబేడ్కర్‌ను రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌గా నియమించాలని గాంధీజీ ప్రతిపాదించారన్నారు. దీంతో అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాతగా అవకాశం పొందారన్నారు. దేశ ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కలిసేందుకు గాంధీజీ నిర్ణయం తీసుకోగా, ప్రజా సంక్షేమం కోసం టీడీపీతో తాను పొత్తు పెట్టుకున్నానంటూ సమర్ధించుకున్నారు.
సీఎం జగన్ గ్రామాలకు ఉన్న విశిష్ట అధికారాలను తీసేస్తున్నారని, గ్రామ స్వరాజ్యాన్ని సాధించడం లేదని, హింసా మార్గంలో పయనిస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ఏర్పాటు చేసిన ఆంధ్ర జాతీయ కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. దేశంలో ఎంతో మంది రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడి ఆ సొమ్మును స్విస్ బ్యాంకుల్లో దాస్తున్నారని... ఆ సొమ్ము తిరిగి వస్తుందో రాదో చెప్పలేనన్నారు.
1920 నుంచి జగన్‌ను చూశా..
పార్టీని స్థాపించిన వెంటనే అధికారంలోకి రాదని పవన్ వ్యాఖ్యానించారు. అది ఎన్టీఆర్‌కే సాధ్యమైందన్నారు. నాలుగు ఎన్నికల్లో కష్టపడితే బీఎస్పీ అధికారంలోకి వచ్చిందన్నారు. కీలకమైన పదవులన్నీ ఒక కులంతో నింపేస్తే వ్యవస్థలు ఎలా బతుకుతాయని ప్రశ్నించారు. కాపులు పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. మున్ముందు జనసేన భావజాలం దేశమంతా వ్యాపిస్తుందన్నారు. ‘నా టీనేజ్‌లో 1920 సంవత్సరం నుంచి జగన్‌ను చూశా... నేను ఎవరినో ఆయనకు తెలియకపోయినా అబ్జర్వ్ చేశా..’ అంటూ పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించటంతో సమావేశానికి హాజరైన జనసైనికులు తెల్లబోయి మొహాలు చూసుకోవడం గమనార్హం.


