నాగర్‌కర్నూల్ సభలో సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం
హామీలు అమలు చేయాలని అడిగితే సీఎం బూతులు తిడుతున్నారని ధ్వజం
బీఆర్‌ఎస్ హయాంలో 90% పూర్తయిన ‘పాలమూరు’లో తట్టెడు మట్టి ఎత్తలేదని విమర్శ
ముఖ్యమంత్రి తన పాత బాస్ చెప్పినట్లు ఆడుతున్నారని మండిపాటు
నాగర్‌కర్నూల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై పగ, కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష పెంచుకున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఆరోపించారు. అందుకే వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ మద్దతుతో ఇటీవల గెలిచిన సర్పంచ్‌ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని హామీలు అమలు చేయాలని అడుగుతుంటే బూతులు తిడుతున్నాడని విమర్శించారు.
బీఆర్‌ఎస్ హయాంలో 90% పూర్తయిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా తట్టెడు మట్టి ఎత్తలేదని.. పాలమూరు ఎత్తిపోతలు పూర్తయితే కేసీఆర్‌కు పేరు వస్తుందనే దాన్ని పూర్తి చేయట్లేదని కేటీఆర్ ఆరోపించారు. ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పాత బాస్ చెప్పినట్లు ఆడుతున్నారని, అందుకే ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని దుయ్యబట్టారు.
ఆంధ్రలో నేను చదువుకుంటే తప్పా..?
మాట్లాడితే తాను ఆంధ్రలో చదివానని సీఎం విమర్శిస్తున్నారని.. కానీ రేవంత్ ఆంధ్ర నుంచి అల్లుడిని తెచ్చుకుంటే తప్పు లేదంటగానీ తాను ఆంధ్రలో చదువుకుంటే తప్పా అని కేటీఆర్ నిలదీశారు. 40 ఏళ్ల క్రితం తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ చదువుకుంటేనే జీవితం బాగుంటుందని తండ్రి చెప్పడంతో విదేశాల్లో చదువుకున్నానని చెప్పారు. అమెరికాలో ప్రతి ఒక్కరూ ఎవరి పనులు వారే చేసుకుంటారని కేటీఆర్ వివరించారు.
తాను అమెరికాలో బాత్రూంలు కడిగానంటూ సీఎం విమర్శిస్తున్నాడని.. కానీ ఆయన సోదరుడు కూడా అమెరికాలోనే ఉంటారని.. మరి ఆ లెక్కన ఆయన కూడా అక్కడ బాత్రూంలు కడుగుతున్నట్టేనా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిని ఏం అడిగినా అరుస్తున్నారని, కొన్ని రోజులైతే కరుస్తారేమోనని.. అందుకే ఆయన్ను ఇంట్లో కట్టేయాలని ముఖ్యమంత్రి భార్య గీతమ్మకు కోరుతున్నానన్నారు. హైదరాబాద్ చుట్టూ 9,300 ఎకరాల భూములపై రేవంత్ కన్నేసి రూ. 5 లక్షల కోట్లు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వాటన్నింటినీ వెలికితీస్తున్నందుకే రేవంత్‌రెడ్డి తమపై చిరాకు పడుతున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యారు..
చీకటి, దొంగ ఒక్కటైనట్లు బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని కేటీఆర్ ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా బీజేపీ ఏం మాట్లాడట్లేదని విమర్శించారు. ఆ రెండు పారీ్టలు అలయ్–బలయ్ చేసుకొని బీఆర్‌ఎస్‌నే తిడుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో యూరియా కోసం రైతులు అధికారుల కాళ్లు మొక్కాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్‌కు అధికారం దక్కనివ్వనని రేవంత్‌రెడ్డి శపథం చేస్తున్నారని.. అయితే ఆయన కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, మహిళలకు రూ. 2,500, రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా ఇస్తామని శపథం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జైపాల్ యాదవ్, హర్షవర్దన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, పార్టీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
28ఎన్‌జికెఎల్51: మాట్లాడుతున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్


