న్యూఢిల్లీలో ఇండి కూటమి నేతలు.. భేటీపై ఉత్కంఠ | INDIA bloc meeting to convene with 23 parties | Sakshi
Sakshi News home page

న్యూఢిల్లీలో ఇండి కూటమి నేతలు.. భేటీపై ఉత్కంఠ

Jun 7 2026 8:49 PM | Updated on Jun 7 2026 9:05 PM

INDIA bloc meeting to convene with 23 parties

న్యూఢిల్లీ: ఇండి కూటమి సమావేశంలో పాల్గొనడానికి కీలక నేతలు ఆదివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ నివాసంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. జూన్ 8న జరగనున్న ఇండియా బ్లాక్ సమావేశానికి మమతా బెనర్జీ హాజరుకానున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి తర్వాత జరుగుతున్న తొలి ఇండియా బ్లాక్ సమావేశం ఇదే.

కొన్ని రోజులు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో మరోసారి డీలిమిటేషన్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల్లో బిల్లు పాస్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ బిల్లుకు పలువురు టీఎంసీ ఎంపీలు కూడా సహకరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే, డీఎంకే కూడా మద్దతు తెలుపుతుందన్న ఊహాగానాలు వచ్చాయి. దీంతో ఇండి కూటమి సమావేశం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

కాంగ్రెస్‌ సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్‌ మీడియాతో స్పందిస్తూ.. ప్రతిపక్ష కూటమి ఐక్యంగానే ఉందని, కొన్ని పార్టీలు పలు కారణాల వల్ల సమావేశానికి హాజరు కాకపోయినా ఐక్యత దెబ్బతినలేదని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క‍్లబ్‌లో జరగనున్న సమావేశానికి 23 రాజకీయ పార్టీలు హాజరవుతాయని ప్రకటించారు. సమావేశానికి రాకపోయినా, ఆ పార్టీలు కేంద్ర ప్రభుత్వ విధానాలు, చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశాయని రమేశ్‌ చెప్పారు.

"మోదీ ప్రభుత్వం కోట్లాది భారతీయుల ఓటు హక్కును హరించే చర్యలు చేపడుతోంది. రాజ్యాంగంపై ప్రతిరోజూ దాడి చేస్తోంది. దర్యాప్తు సంస్థల ద్వారా ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటోంది. కోట్లాది ప్రజల జీవనోపాధికి తీవ్ర నష్టం కలిగిస్తోంది. నిరంతర ద్రవ్యోల్బణంతో కుటుంబాల బడ్జెట్లను దెబ్బతీస్తోంది. లక్షలాది యువత ఆశలు, ఆకాంక్షలను వమ్ము చేస్తోంది. పెట్టుబడి వాతావరణాన్ని బలహీనపరుస్తోంది. విదేశాంగ విధానం ద్వారా జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. భారత్ మాదిరిగానే ఇండియా జనబంధన్ తన వైవిధ్యంతో ఐక్యంగా నిలుస్తోంది" అని ఆయన 'ఎక్స్'లో పేర్కొన్నారు.

ఇండియా బ్లాక్ సమావేశానికి ప్రాధాన్యం పెరిగింది. భారతీయ జనతా పార్టీ పెరుగుతున్న రాజకీయ ఆధిపత్యాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఒకవైపు ఉంటే, కూటమిలోని అంతర్గత విభేదాలు మరోవైపు ఉన్నాయి.

తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో భాగంగా కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి 5 స్థానాలు గెలుచుకుంది. టీవీకేకు మద్దతు ఇవ్వాలన్న కాంగ్రెస్ నిర్ణయంతో ఇరు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సమావేశానికి హాజరుకాబోమని తెలియజేస్తూ రాసిన లేఖలో.. దేశ సంక్షేమాన్ని ప్రభావితం చేసే అంశాలపై ఇతర పార్టీలు లేవనెత్తే విషయాలకు తాము ఎప్పటిలాగే మద్దతుగా ఇస్తామని డీఎంకే పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement