స‌న్నిహితురాలి నుంచి తిరుగుబాటు వ‌ర‌కు..! | How Saayoni Ghosh Turned to Rebel Against Mamata Banerjee | Sakshi
Sakshi News home page

మ‌మ‌తా బెన‌ర్జీకి స‌యోనీ ఘోష్ దెబ్బ‌!

Jun 10 2026 9:48 PM | Updated on Jun 10 2026 9:48 PM

How Saayoni Ghosh Turned to Rebel Against Mamata Banerjee

బెంగాల్ రాజ‌కీయాలు ఫాలో అయ్యే వారికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ స‌యోనీ ఘోష్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాక్క‌ర్లేదు. త‌మ పార్టీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీని ఎవ‌రైనా ఒక్క మాట అంటే సివంగిలా విరుచుకుప‌డే స‌యాని తాజాగా సంచ‌ల‌నానికి కేంద్ర బిందువ‌య్యారు. తిరుగుబాటు ఎంపీల‌తో చేతులు క‌లిపి మ‌మ‌తను ఒంటరి చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఎన్న‌టికీ మ‌మ‌త వెంటే ఉంటాన‌ని కొద్ది రోజుల క్రిత‌మే బాస చేసిన స‌యాని ఇంత‌లోనే మ‌న‌సు మార్చుకున్నారు. క‌ష్ట‌కాలంలో అధినేత్రిని ఒంట‌రి చేసి త‌న దారి త‌ను చూసుకున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ స‌ర్కారుకు స‌లాం కొట్టారు!

మొన్న ముగిసిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌యోనీ ఘోష్ (Saayoni Ghosh) ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. తృణమూల్ కాంగ్రెస్ త‌ర‌పున రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టించి ఎన్నికల ప్ర‌చారం నిర్వ‌హించారు. న‌టి, గాయ‌ని అయిన ఆమె త‌న వాగ్దాటి, మేన‌రిజంతో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకున్నారు. దీంతో ఆమె స‌భ‌ల‌కు జ‌నం పోటెత్తారు. మ‌మ‌తా బెన‌ర్జీ కూడా ఆమెను ఎంతో ప్రోత్స‌హించారు. పార్టీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టి నెత్తిన పెట్టుకున్నారు. జాద‌వ్‌పూర్ నుంచి లోక్‌స‌భ‌కు పంపి అక్కున చేర్చుకున్నారు. స‌యాని కూడా పార్టీకి ఎంతో విధేయంగా ఉంటూ మ‌మ‌త న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌పై ప‌దునైన మాట‌ల‌తో విరుచుకుప‌డుతూ పార్టీలో కీలకంగా మారారు. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో స‌మ‌యం దొరికిన‌ప్పుల్లా త‌న వాగ్ధాటితో ఎన్డీఏ స‌ర్కారును ఏకీపారేసి దేశ ప్ర‌జ‌ల‌ దృష్టిని ఆక‌ర్షించారు.

ప‌రిస్థితి తారుమారు
మ‌మతా బెన‌ర్జీని ప్ర‌ధాన‌మంత్రిగా చూడాల‌నుకుంటున్న‌ట్టుగా ఒకాకొక సంద‌ర్భంలో ప్ర‌క‌టించారు. మ‌మత పీఎం అయితే ఆమె బెంగాల్ సీఎం అవుతారు అన్నంత‌గా ప్ర‌చారం సాగింది. ఇదంతా బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోని ముచ్చ‌ట‌. ఇప్పుడు ప‌రిస్థితి తారుమారయింది. మ‌మ‌తా బెన‌ర్జీ కోట బ‌ద్ద‌ల‌యింది.. బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. అధికారం పోవ‌డం కాదు ఏకంగా పార్టీయే మ‌మ‌తా బెన‌ర్జీ చేతుల్లోంచి జారిపోయే ప‌రిస్థితులు త‌లెత్తాయి. ముందుగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగుర‌వేస్తే, తాజాగా ఎంపీలు.. మ‌మ‌త‌కు చేయిచ్చారు. ఎన్డీఏకు మ‌ద్ద‌తుగా లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ఇచ్చిన లేఖ‌లో సంత‌కాలు చేసిన 20 మంది తృణమూల్ రెబ‌ల్ ఎంపీల్లో సయోనీ ఘోష్ ఉన్నార‌న్న సంగ‌తి తాజాగా వెలుగులోకి రావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయింది.

అప్పుడ‌లా.. ఇప్పుడిలా..
తాను ఎన్న‌టికీ బీజేపీ పంచ‌న చేర‌నంటూ రాఘ‌వ్ చ‌ద్దా పార్టీ మారిన సంద‌ర్భంలో వ్యాఖ్యానించిన‌ సయోనీ ఘోష్.. ఇప్పుడిలా ప్లేటు ఫిరాయించ‌డం సంచ‌ల‌నంగా మారింది. బీజేపీ ద‌గ్గ‌ర వేల కోట్ల డ‌బ్బు, ఈడీ, సీబీఐ, అధికారం ఉంటే.. త‌మ‌కు అండ‌గా హ‌వాయి చెప్పులు, తెల్ల‌చీర ధ‌రించిన మ‌మ‌తా బెన‌ర్జీ ఉన్నార‌ని.. ఆ స‌మ‌యంలో స‌యోనీ చేసిన వ్యాఖ్య‌ల‌ను జ‌నం గుర్తు చేసుకుంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అప్పుడు అలా మాట్లాడిన ఆమె.. ఇంత‌లోనే ఎలా ఎన్డీఏకు ఎలా జై కొడుతుంద‌ని చ‌ర్చించుకుంటున్నారు. మ‌మ‌తా బెన‌ర్జీకి అత్యంత స‌న్నిహితురాలిగా మెలిగిన సయోనీ ఘోష్.. తిరుగుబాటు ఎంపీలతో చేతులు క‌లుపుతార‌ని అస్స‌లు ఊహించ‌లేద‌ని జ‌నం అంటున్నారు. ఎన్నిక‌ల్లో తేడా కొడితే ముందుగా జంప్ అయ్యేది ఈలాంటి వారే అంటూ సోష‌ల్ మీడియాలో ఆమెపై కొంత‌మంది చేసిన వ్యాఖ్య‌ల‌ను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.

కొస‌మెరుపు: బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు సయోనీ ఘోష్. "మేము ఓడిపోలేదు. ఓట్ల దోపిడీ వల్ల మమతా బెనర్జీ ఓడిపోయారు. 2029లో దేశ ప్రజలు, 2031లో బెంగాల్ ప్రజలు తగిన సమాధానం ఇస్తారు'' అంటూ వ్యాఖ్యానించారు. అలాగే మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా భావించే ఎంపీ మాలా రాయ్ కూడా రెబల్ శిబిరంలో చేరిపోయారు. 

Advertisement
 
Advertisement
Advertisement