
అనుకూల పరిస్థితుల కోసం సంక్షేమ అ్రస్తాలు
క్షేత్రస్థాయిలో పకడ్బందీ వ్యూహాలు
నోటిఫికేషన్ కంటే ముందే కాంగ్రెస్‌లో ఉప ఎన్నికల వేడి
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర పాలనకు ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక’ రెఫరెండంగా భావిస్తూ ముందస్తు కార్యాచరణకు దిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక తర్వాత జూబ్లీహిల్స్ కావడంతో ఈ స్థానాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంది. ఎన్నికల షెడ్యూలు విడుదలతో సంబంధం లేకుండా, అభ్యర్థి ఎంపిక అంశానికి పెద్దగా ప్రాధాన్యమివ్వకుండా కేవలం పార్టీ గెలుపే లక్ష్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌లు జూబ్లీహిల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఏకంగా ముగ్గురు రాష్ట్ర మంత్రులను రంగంలోకి దింపి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (jubilee hills bypoll) బాధ్యతలను అప్పగించారు.
జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్‌కు సిట్టింగ్ సీటు కావడంతో ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే.. క్షేత్రస్థాయిలో అధికార కాంగ్రెస్‌కు పూర్తి స్థాయిలో అనుకూల పరిస్థితులు తీసుకొచ్చేందుకు మంత్రులు రంగంలోకి దిగారు. సుడిగాలి పర్యటనతో సంక్షేమ, అభివృద్ధి అ్రస్తాలను ప్రయోగిస్తున్నారు. మరోవైపు పార్టీ శ్రేణుల్లో అంతర్గత కుమ్ములాటలు లేకుండా సమన్వయ సాధన కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఉనికి లేకుండా చేయడంతోపాటు బీజేపీని నిలవరించేందుకు సికిందాబాద్ కంటోన్మెంట్ తరహాలో జూబ్లీహిల్స్ కూడా కాంగ్రెస్ ఖాతాలో పడాలన్నదే అధికార కాంగ్రెస్ (Congress Party) అన్ని అ్రస్తాలకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
ఒక్కో మంత్రికి రెండు డివిజన్ల బాధ్యతలు
అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎదురులేని శక్తిగా అవతరించేందుకు ముందస్తు కసరత్తు చేస్తోంది. నియోజక వర్గాన్ని మూడు విభాగాలుగా విభజించింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్‌లకు బాధ్యతలను అప్పగించింది. ఒక్కో మంత్రికి రెండు డివిజన్ల చొప్పన కేటాయించారు. తుమ్మల నాగేశ్వరరావుకు వెంగళ్‌రావు నగర్, ఎర్రగడ్డ, సోమాజిగూడ డివిజన్లలో కొంత భాగం.. పొన్నం ప్రభాకర్‌కు యూసఫ్‌గూడ, బోరబండ డివిజన్లు, గడ్డం వివేక్ వెంకటస్వామికి షేక్‌పేట రహమత్‌నగర్ డివిజన్లను కేటాయించారు.
మంత్రులకు సహాయంగా ఉండేందుకు ఆరుగురు చొప్పున మొత్తం 18 మంది కార్పొరేషన్ల చైర్మన్లకు బాధ్యతలు అప్పగించింది. వారంతా సంబంధిత మంత్రులతో సమావేశమవుతూ ఎన్నికలు పూర్తయ్యే వరకు డివిజన్లపై దృష్టి సారించి ఇక క్షేత్రస్థాయిలో సంక్షేమ, అభివద్ది పధకాల అమలు పర్యవేక్షణ, ప్రచార బాధ్యతలు నిర్వర్తించనున్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు.
క్షేత్ర స్థాయి పర్యటనలు..
మంత్రులు సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకున్నారు. తమకు కేటాయించిన డివిజన్లల్లో అత్యధిక ఓటు బ్యాంకు (Vote Bank) సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. నియోజవర్గంలోని డివిజన్లలో క్షేత్ర స్థాయి పర్యటనలకు మంత్రులు శ్రీకారం చుట్టారు. బూత్ స్థాయి నేతలతో సమావేశమై ఎన్నికలపై చర్చిస్తున్నారు.
చదవండి: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్
ఇటీవల బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నంతో పాటు పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు సమావేశమయ్యారు. ఉప ఎన్నికలో పార్టీ గెలుపునకు ఉన్న అవకాశాలపై చర్చించారు.. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులపై డివిజన్ల వారీగా వ్యవహరించాల్సిన అంశాలపై స్థానిక నేతలకు మంత్రులు తుమ్మల దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.