తెలంగాణ స‌మాజం స‌హించ‌దు.. రేవంత్‌ వ్యాఖ్యలకు రాజగోపాల్‌ రెడ్డి కౌంటర్‌ | Komatireddy Raj Gopal Reddy Counter To CM Revanth Reddy Over His Comments On Journalists, Check Tweet Inside | Sakshi
Sakshi News home page

తెలంగాణ స‌మాజం స‌హించ‌దు.. రేవంత్‌ వ్యాఖ్యలకు రాజగోపాల్‌ రెడ్డి కౌంటర్‌

Aug 4 2025 8:13 AM | Updated on Aug 4 2025 9:45 AM

Komatireddy Raj Gopal Reddy Counter To CM Revanth

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్‌ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మళ్లీ కౌంటరిచ్చారు. ఇటీవల రేవంత్‌.. సోషల్‌ మీడియా జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్‌ రెడ్డి స్పందించారు. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘ప్ర‌జ‌ల కోసం సామాజిక బాధ్య‌త‌తో ప‌నిచేస్తున్న సోష‌ల్ మీడియాను పాల‌కులు గౌర‌వించాలే త‌ప్ప‌ అవ‌మానించ‌డం స‌బ‌బు కాదు. తెలంగాణ స‌మాజ‌ ఆకాంక్ష‌ల మేర‌కు సోష‌ల్ మీడియా మొద‌ట్నుంచి త‌న శ‌క్తి కొద్దీ ప‌నిచేస్తూనే ఉంది. నిబ‌ద్ద‌త‌తో ప‌నిచేసే సోష‌ల్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌కు నా మ‌ద్ద‌తు ఎప్పుడూ ఉంటుంది. సోష‌ల్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌ను దూరం పెట్టాలంటూ ప్ర‌ధాన మీడియా వారిని ఎగ‌దోయ‌డం ముమ్మాటికీ విభ‌జించి పాలించ‌డ‌మే. ఇలాంటి  కుటిల ప‌న్నాగాల‌ను తెలంగాణ స‌మాజం స‌హించ‌దు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై కొత్త చర్చ నడుస్తోంది.

రేవంత్‌ వ్యాఖ్యలు.. 
ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘జర్నలిజం డెఫినేషన్ మారిందని అన్నారు. సోషల్ మీడియా పేరుతో జర్నలిజంలోకి వస్తున్నా వారి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులను వేరే చేయాలని.. వాళ్లను వేరుగా కూర్చోబెట్టాలని పాత్రికేయులకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ రోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడు జర్నలిస్ట్ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. పెన్ను పేపర్ ఇస్తే ఏబీసీడీలు కూడా రాయలేని వారు కూడా నేను జర్నలిస్ట్‌ని అంటారన్నారు. ఏం జర్నలిస్ట్ అని అడిగితే సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటున్నారు. వాడు ఎప్పుడైన జర్నలిజం స్కూల్‌లో చదివిండా? లేకపోతే ఓనమాలు మొత్తం అయినా వస్తాయా అంటే రెండూ రావు.

రోడ్లమీద ఆవారాగా తిరిగేటోడు.. ఎక్కువ తిట్లొచ్చినోడు, ఏందంటే అదే మాట్లాడేటోడే జర్నలిజం అనే ముసుగు తొడుక్కొని అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చాయి. ఇలా జర్నలిజం ముసుగులో కొందరు ప్రెస్‌మీట్‌లు పెట్టినప్పుడు ముందలి వరుసలో ధిక్కారంగా కూర్చుంటారు. మనమేదో లోకువ అయినట్టు, వాళ్లేదే పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్లు మన కళ్లలోకి చూస్తుంటారు. ఇంకా నన్ను చూసి నమస్కారం పెడతలేవు. నన్ను చేసి ఇంకా తల వంచుకుంటలేవు అని చూస్తుంటాడు. స్టేజీ దిగిపోయి చెంపలు పగులగొట్టాలని నాకు అనిపిస్తది. కానీ, పరిస్థితులు, హోదా అడ్డం వస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు.

రేవంత్‌కు కౌంటర్‌..
ఇక.. అంతకుముందు కూడా సీఎం రేవంత్‌కు రాజగోపాల్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. రాబోయే పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానన్న రేవంత్‌ వ్యాఖ్యలపై రాజగోపాల్‌ రెడ్డి స్పందిస్తూ..‘రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement