
సాక్షి, విశాఖ: కూటమి ప్రభుత్వం విశాఖను డ్రగ్స్‌కు క్యాపిటల్‌గా మార్చేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి నేతల అండదండలతో డ్రగ్స్ కల్చర్ విశాఖ మహా నగరంలోకి ప్రవేశించేసింది. ఎన్నికల ముందు కంటైనర్‌లో రూ.వేల కోట్ల డ్రగ్స్ విశాఖకు వచ్చాయంటూ లేనిపోని ఆరోపణలు చేసిన కూటమి నేతలు.. ఇప్పుడు ఏకంగా విశాఖ నగరాన్నే డ్రగ్స్‌కి అడ్డాగా మార్చేశారు ఇటీవల విశాఖలో కలకలం రేపిన కూటమి నేతల డ్రగ్స్ దందాపై అమర్నాథ్ విమర్శలు గుప్పించారు.
‘రాష్ట్రంలో గంజాయి కొకైన్ ప్రభుత్వం నడుస్తుంది. రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ పేట్రేగిపోతుంది. డ్రగ్స్‌కు క్యాపిటల్‌గా విశాఖను తయారు చేశారు. డ్రగ్స్ గంజాయిని కూటమి ప్రభుత్వం పెంచి పోషిస్తుంది. ఇటీవల విశాఖలో 25 గ్రాముల కొకైన్ దొరికింది. వెలగపూడి రామకృష్ణ బాబు సీపీ మీద ఒత్తిడి చేసి అసలు దోషులను తప్పించారు.
ఎంపీ భరత్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి పోలీసులు మీద ఒత్తిడి తెచ్చారు. డ్రగ్స్ కేసులో సీఎంవో కూడా ఇన్వాల్ అయింది. మంత్రి లోకేష్, ఎంపీ భరత్ అసలు నిందితులను తప్పించారు. ఎప్పుడూ రాని టీడీపీ ప్రజా ప్రతినిధులు సీపీ కార్యాలయానికి ఎందుకు వచ్చారు.
టీడీపీ నేతలు సీపీనీ కలిసిన సీసీ ఫుటేజీ బయట పెట్టే ధైర్యం ఉందా. వైఎస్ జగన్ పాలనలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అక్షయ్, థామస్, కృష్ణ చైతన్య వర్మను అరెస్టు చేసి మిగతా ఇద్దరిని ఎందుకు వదిలేశారు. అక్షయ్ కుమార్ అనే వ్యక్తి తూర్పు గోదావరి జిల్లాలో ఒక ఎంపీకి అత్యంత సన్నిహితుడు.
వైజాగ్ బ్రాండ్ ఇమేజ్‌ను కూటమి ప్రభుత్వం దెబ్బ తీస్తోంది.వైఎస్ జగన్ పాలనలో 25 వేల కేజీల డ్రగ్స్ దొరికిందని తప్పుడు ప్రచారం చేశారు. తరువాత సీబీఐ విచారణలో అది ఈస్ట్ అని తేలింది. కొకైన్ డ్రగ్స్ వ్యవహారం ఎల్లోమీడియాకు కనిపించలేదా. వాస్తవాలను ఎందుకు ప్రజలకు చూపించడంలేదు. అసలు రాష్ట్రంలో గంజాయి లేనట్లు ఈనాడు చంద్రబాబు భజన చేస్తుంది. డ్రగ్స్ కేసులో పూర్తిస్థాయి విచారణ జరగాలి.అసలు నిందితులను అరెస్టు చేయాలి’ అని డిమాండ్ చేశారు.