టీడీపీ ప్రభుత్వంలో రైతులకు ఏం ఒరగబెట్టారు? | Farmer Fires On TDP Leader Somireddy Chandramohan Reddy | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రభుత్వంలో రైతులకు ఏం ఒరగబెట్టారు?

Jan 11 2022 5:11 AM | Updated on Jan 11 2022 5:11 AM

Farmer Fires On TDP Leader Somireddy Chandramohan Reddy - Sakshi

సోమిరెడ్డిని నిలదీస్తున్న రైతు నాగయ్యనాయుడు

పొదలకూరు: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేయబోయిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సోమవారం ఓ రైతు నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. వివరాల్లోకెళ్తే.. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నేదురుమల్లిలోని రైతుభరోసా కేంద్రం వద్దకు వెళ్లారు. వైఎస్సార్‌సీపీకి చెందినవారికి మాత్రమే ఎరువులు అందిస్తున్నారంటూ గందరగోళం సృష్టించాలని చూశారు.

ఇంతలో అదే గ్రామానికి చెందిన పతకమూరి నాగయ్యనాయుడు అనే రైతు సోమిరెడ్డి వద్దకు వచ్చి ‘మీ ప్రభుత్వంలో రైతులకు ఏమి ఒరగబెట్టారని ఇప్పుడు ఎరువుల పంపిణీపై ఆందోళన చేయడానికి వచ్చారు? టీడీపీ ప్రభుత్వ హయాంలో వృద్ధాప్య పింఛన్‌ తీసుకోవడానికి అర్హత ఉన్నా ఇవ్వకుండా క్షోభకు గురి చేశారు. గ్రామంలో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి చివర వరకు నాకు పింఛన్‌ రాకుండా అడ్డుకున్నారు.

జగన్‌ ప్రభుత్వం రైతుల ఇళ్ల వద్దే ఎరువులను అందిస్తుంటే అడ్డుకోవడానికి వచ్చారా? పార్టీలకతీతంగా రైతులకు ఆర్బీకేల ద్వారా ఎరువులు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలకు చెడ్డపేరు తేవాలనే మీరు ఇక్కడకు వచ్చారు’ అంటూ సోమిరెడ్డిపై ధ్వజమెత్తారు. దీంతో అక్కడే ఉంటే ఇంకా అభాసుపాలవుతామని గ్రహించిన సోమిరెడ్డి అక్కడ నుంచి వెళ్లిపోయారు.  

Advertisement
 
Advertisement
Advertisement