అవినీతి కట్టడిలో ఏసీబీ విఫలం
రాజ్యమేలుతున్న బెట్టింగ్, మట్కా, గుట్కా బ్యాచ్‌లు
ఎమ్మెల్యేగా ఏమీచేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా
ఇలాంటి పరిస్థితిలో నేను ఎందుకు ఉండాలని ఆలోచిస్తున్నా
టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి, కడప: ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిస్థితి మారుతుందని ఆశించాం. అలాంటిదేమి లేకపోగా, అవినీతి విచ్చలవిడిగా రాజ్యమేలుతున్నా ఏసీబీ కట్టడి చేయడంలేదు. ఎమ్మెల్యేగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా. ముందు డబ్బులిస్తేనే పని చేస్తామన్నట్లుగా అధికారులు తయారయ్యారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే లంచాల్లో వాటాలు పంచుకోవడం మినహా కట్టడి చేయడంలేదు’ అని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వ్యాఖ్యానించారు.
ఆయన బుధవారం ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు తీరుతెన్నులపై మండిపడ్డారు. అధికారుల వద్దకు ప్రభుత్వ పనికోసం వెళ్లిన ప్రతీఒక్కరూ డబ్బు చెల్లించుకోవాల్సి వస్తోందన్నారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ డిపార్టుమెంటు ఇలా అన్నింటా ఈ పరిస్థితి ఉందన్నారు. వరదరాజులరెడ్డి ఇంకా ఏమన్నారంటే..
చిరుద్యోగులకు అందని జీతాలు
ఇటీవల కాలంలో గోపవరం, కొత్తపల్లె పంచాయతీలో వీధుల్లో ఊడ్చేందుకు కొంతమంది సిబ్బందిని నియమించారు. వారికి నాలుగు నెలల నుంచి జీతం ఇవ్వలేదు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారు నెలనెలా జీతాలు తీసుకుంటుండగా వీరికెందుకు ఇవ్వడంలేదు? పారిశుధ్య కార్మికులు చేసే పని మనం చేయలేం. అయినా వారికి నెలనెలా జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా పట్టించుకోవడంలేదు. పైగా.. జీతాలిచ్చే విషయంలో మనకేమైనా వస్తుందా? అనే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేవారు లేరు.
విచ్చలవిడిగా బెట్టింగ్, మట్కా, గుట్కా
ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్, గంజాయి, గుట్కా, మట్కా వ్యవహారాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఇది వేలాది మంది ప్రజలకు సంబంధించిన సమస్య. అధికారులు ఇలా తప్పు చేసిన వారిని పట్టుకుని వారి నుంచి డబ్బు వసూలుచేసుకుంటున్నారు. ఈ మధ్య అగ్రిగోల్డ్ భూమికి సంబంధించి దొంగ డాక్యుమెంట్లు వెలుగులోకి వచ్చాయి. దొంగ రిజిస్ట్రేషన్లు జరుగుతుంటే అధికారులేం చేస్తున్నారు? సబ్‌రిజి్రస్టార్లు కూడా దొంగ రిజి్రస్టేషన్లపై పోలీసులకు ఫిర్యాదు చేయడంలేదు. పోలీసుల దృష్టికి వెళ్లినా చర్యల్లేవు.
లంచాల కోసమే అన్నట్లుగా..
లంచగొండితనానికి అడ్డుకట్ట వేయలేని పరిస్థితిలో ఉన్నాం. అధికారులకు లక్షలాది రూపాయలు జీతాలు వస్తున్నా వారిలో మార్పులేదు. ప్రజల్లో తిరుగుబాటు రావాలి. ఈ విషయంలో ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే లేరు. కిందిస్థాయి అధికారిపై ఫిర్యాదు చేస్తే అతను పైస్థాయి అధికారి వద్దకు వెళ్లి మేనేజ్ చేసుకునే పరిస్థితి ఉంది. స్వయంగా నేను ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుకు ఎలాంటి జవాబులేదు. ఇంత అధ్వాన్న పరిస్థితుల్లో అధికారులు నడుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు వ్యవసాయాధికారులు సలహాలిచ్చే దిక్కులేదు.
నిస్సహాయ స్థితిలో ఉన్నా..
ఎవరికీ న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నా. దీంతో నేను ఎందుకు ఉండాలనే ఆలోచిస్తున్నా. ఏ ఒక్క ఉద్యోగి నిజాయితీగా వ్యవహరించడంలేదు. పెన్నానగర్, ఈశ్వర్‌రెడ్డినగర్ ప్రాంతాల్లో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వారందరూ గుట్కాకు సంబంధించిన వివాదాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు నాకు సమాచారం ఉంది.
రాచమల్లు వ్యాఖ్యలు అక్షర సత్యం..
గత కొంతకాలంగా ఇక్కడ విచ్చలవిడి అవినీతి చోటుచేసుకొంటోందని.. క్రికెట్ బెట్టింగ్, మట్కా, గుట్కా బ్యాచ్‌లు చెలరేగిపోతున్నాయని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చేసిన ఆరోపణలు అక్షరసత్యం.


