కేసీఆర్‌కు ఆ భయం పట్టుకుందా?.. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది..!

Cm Kcr Fulfilled The Goal Of Telangana - Sakshi

తెలంగాణలోని రాజకీయ పక్షాలు మరికొద్ది నెలల్లో జరిగే శాసనసభ ఎన్నికలకు సిద్ధం అవడానికి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఒక అవకాశంగా వినియోగించుకున్నాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ ప్రగతికి తాము ఎంత కృషి చేసింది వివరిస్తూ, త్వరలో ఆయా వర్గాలకు ఇవ్వదలచిన కొత్త వరాలను ప్రకటించింది. తెలంగాణ మోడల్ దేశానికి మార్గదర్శి అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం విశేషం. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ వారు తెలంగాణ సాధన కాంగ్రెస్ వల్లే అయిందన్న విషయాన్ని గుర్తు చేయడానికి, తెలంగాణ బిల్లు పాస్ చేయడంలో సహకరించిన ఆనాటి స్పీకర్ మీరా కుమార్‌ను రాష్ట్రానికి తీసుకువచ్చి ప్రచారం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు.

ఇదే అవకాశమా?
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పోటీగా ఉత్సవాలు జరపడమేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకుంది.. ఇందులో గవర్నర్ తమిళసై కూడా భాగస్వామి అవడం విశేషం. వైఎస్సార్‌టీపి అధినేత్రి షర్మిల తదితర రాజకీయ పక్షాల వారు కూడా తెలంగాణ ఉత్సవాలను తమదైన శైలిలో నిర్వహించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ కొత్త సచివాలయ ప్రాంగణంలో అట్టహాసంగా ఉత్సవం నిర్వహించి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. అదంతా శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసినట్లే అనిపిస్తుంది.

అయితే అదే సమయంలో..
గత తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు కొత్త హామీలు కూడా ఇచ్చారు. రాష్ట్రంలో కోతలు లేని విద్యుత్, మిషన్ భగీరధ, దళిత బంధు, హైదరాబాద్‌లో చేపట్టిన అభివృద్ది, రైతు బంధు, కొత్త నీటి ప్రాజెక్టులు మొదలైనవాటికి ప్రాధాన్యత ఇచ్చారు. కొత్త సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, యాదాద్రి అభివృద్ది తదితర అంశాలను ఆయన ప్రస్తావించారు ఆయన స్పీచ్‌లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన లక్ష్యం నెరవేరినట్లే అన్న భావం స్పురించింది. అయితే అదే సమయంలో కొత్తగా బీసీల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించడం గమనించదగ్గ అంశమే.

ఆత్మ విశ్వాసం కనిపించినప్పటికి..
దళిత బంధు కింద దళితులకు పది లక్షల ఇస్తుండడంపై మిగిలిన వర్గాలలో ఏర్పడిన కొంత అసంతృప్తిని చల్లార్చడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకోవచ్చు. గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటించారు. మరో వైపు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని కూడా ఆయన తెలిపారు. స్థూలంగా చూస్తే కేసీఆర్‌లో మళ్లీ గెలుస్తామన్న ఆత్మ విశ్వాసం కనిపించినప్పటికి, ఎక్కడో ఏదో తేడా వస్తుందో అన్న సంశయం కూడా ఉందనిపిస్తుంది. అందుకే కొత్త హామీలను ఇవ్వడం ద్వారా ఆయా వర్గాలలో వ్యతిరేకతను పొగొట్టడానికి తెలంగాణ ఉత్సవాలను ఆయన ఉపయోగించుకున్నారని భావించవచ్చు.

ఇరవై ఒక్క రోజులు నిర్వహించడం ద్వారా ప్రభుత్వ ప్రచారాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. వీరికి పోటీగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గోల్కండలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు జరిపింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాని , బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ లు తెలంగాణ ఏర్పాటువల్ల కేవలం కెసిఆర్ కుటుంబమే బాగుపడిందన్న సందేశం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇచ్చారు. సంజయ్ మాత్రం యధా ప్రకారం ఎమ్.ఐ.ఎమ్ ఆఫీస్ దారుసలాంను స్వాధీనం చేసుకుని పేద ముస్లింలకు ఇస్తామని అనడం అతిగానే ఉన్నట్లు అనిపిస్తుంది.

కాగా, గవర్నర్ తమిళసై కూడా రాజ్ భవన్ లో ఉత్సవం జరిపి కొందరి అభివృద్ది అందరి అభివృద్ది కాదని ఎద్దేవా చేయడం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వం జరిపే కార్యక్రమాలకు ఆమెను ఆహ్వానించడం లేదు. అది అసంతృప్తిగానే ఉన్నా, తమిళసై స్వయంగా సందర్భానుసారం కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకత నిలబెట్టుకునే యత్నం చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ను ముఖ్య అతిధిగా పిలిచి తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పాత్రను ప్రజలకు మరోసారి వివరించే యత్నం చేసింది.
చదవండి: రాహుల్‌ ‘తుడిచివేత’ వ్యాఖ్యల వెనుక మర్మమేంటో..?

లక్ష్యం నెరవేరిందా?
తెలంగాణ ఇచ్చిన లక్ష్యం నెరవేరలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అది సాధ్యం అవుతుందని ఆమె అన్నారు. మీరాకుమార్ తెలంగాణ బిల్లును పాస్ చేయించడంలో తీసుకున్న చొరవను ఆయా నేతలు వివరించారు.బిల్లు పాస్ అయినప్పుడు కెసిఆర్ లోక్ సభలో లేరని కాంగ్రెస్ ఎమ్.పి ఉత్తంకుమార్ రెడ్డి గుర్తు చేశారు.  సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ తెలంగాణ ఇస్తే సోనియాగాంధీ కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటానని కేసిఆర్ చెప్పారని పేర్కొన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వల్ల బాగా నష్టం జరిగిందని ఆయన వెల్లడించడం విశేషం.

ఎన్నికల ప్రచారానికి  రిహార్సల్
తెలంగాణకు ఒక్క పైసా నిధులు ఇవ్వబోమని కిరణ్ అనడం వల్ల డామేజీ అయిందని హనుమంతరావు చెప్పారు. నిజానికి కిరణ్ కుమార్ రెడ్డి ఆ మాట అనలేదు. కాకపోతే హరీష్ రావుతో వాదోపవాదాలలో సిద్దిపేటకు నిధులు ఇవ్వబోనన్న మాటను మొత్తం తెలంగాణకు వర్తింప చేసి తెలంగాణవాదులు ప్రచారం చేశారు. అయినా అదంతా చరిత్ర. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా ఎందుకు అధికారంలోకి రాలేకపోయిందన్నదానిపై ఆత్మ విమర్శ చేసుకుంటే ఉపయోగం తప్ప, ఇప్పుడు అయిపోయినదాని గురించి నిందించుకుంటే ఏమి ప్రయోజనం? ఏది ఏమైనా శాసనసభ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు రిహార్సల్ అనుకోవచ్చు.


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top