తెలంగాణలో బీజేపీని  తుడిచివేస్తామన్న రాహుల్‌.. దాని వెనక మర్మమేంటో?

Congress Will Decimate BJP In Telangana: Rahul Gandhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ (ఐవోసీ) సమావేశం వేదికగా అమెరికాలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ బీజేపీని తుడిచి పారేస్తామని, ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీని గుర్తుపట్టడం కూడా కష్టమనే రీతిలో ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న బలమేంటన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని, కచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న కమలనాథులను తుడిచి పారేస్తామంటూ రాహుల్‌గాంధీ మాట్లాడడం వెనుక మర్మ మేంటనే దానిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

తెలంగాణలో కాంగ్రెస్‌కు రాజకీయంగా కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుందనే అంచనాల నేపథ్యంలో పార్టీ కేడర్‌లో మరింత ఉత్సాహం నింపేందుకే రాహుల్‌గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారా? లేక దీనివెనుక బలమైన కారణాలేమైనా ఉన్నాయా అన్నది కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లోనూ చర్చకు దారి తీస్తోంది. కాంగ్రెస్‌లోకి త్వరలోనే భారీగా వలసలు ఉంటాయనే ప్రచారం, తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ప్రత్యేక ఫోకస్‌ పెడుతున్నదనే దిశలో జరుగుతున్న పరిణామాలు, ఎప్పటికప్పుడు పార్టీ పక్షాన చేస్తున్న సర్వేలు లాంటి అంశాల ప్రాతిపదికగానే రాహుల్‌ కీలక వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునే స్థాయికి వచి్చన బీజేపీని ఓడించగలరేమో కానీ, తుడిచి పారేసే స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుంటుందా అన్నదానిపై రాజకీయ వర్గాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

ఆ రెండు పార్టీల నుంచి 20 మంది! 
కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి వెళ్లి అసంతృప్తిగా ఉన్న నేతలు, బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చిన నేతలు, బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న నేతలు కలిపి మొత్తం 20 మంది వరకు కాంగ్రెస్‌ హైకమాండ్‌తో టచ్‌లోకి వెళ్లారని తెలుస్తోంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తెర వెనుక ఉండి ఈ చర్చల పరంపరను నడిపిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ పార్టీని అధికారంలోకి తెస్తానని శివకుమార్‌ కాంగ్రెస్‌ హైకమాండ్‌కు మాట ఇచ్చారనే చర్చ కూడా జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే ఆ 20 మంది సమయం చూసుకుని తమ పార్టీలోకి వస్తారని, పార్టీలోకి వలసల కారణంగా జిల్లాల వారీగా బీజేపీ చాలా నష్టపోతుందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఆ పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్థకమవుతుందని అంటున్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని రాహుల్‌ బీజేపీని తుడిచి పారేస్తామనే స్థాయిలో వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  
చదవండి: టీడీపీతో బీజేపీ పొత్తు ఊహాజనితమే 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top