టీడీపీతో బీజేపీ పొత్తు ఊహాజనితమే

BJP Leader Bandi Sanjay Comments On BJP Alliance TDP - Sakshi

ఆ వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు 

అమిత్‌ షా, నడ్డాలతో చంద్రబాబు భేటీ అయితే తప్పేంటి? 

జిల్లాల నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో బండి సంజయ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందంటూ వస్తున్నవి ఊహాగానాలేనని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ఆదివారం వివిధ జిల్లాల నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో సంజయ్‌ మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను టీడీపీ అధినేత చంద్రబాబు కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు. గతంలో మమతా బెనర్జీ, స్టాలిన్, నితీశ్‌ కుమార్‌ వంటి ప్రతిపక్ష నేతలను కూడా ప్రధాని మోదీ, అమిత్‌ షా కలిసిన విషయాన్ని గుర్తుచేశారు.

దేశాభివృద్ధే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. కేసీఆర్‌ మాదిరిగా ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను కలవకుండా ప్రగతి భవన్‌కే పరిమితమై తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే నైజం బీజేపీది కాదు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్‌ పెరుగుతోందని, పార్టీని దెబ్బతీసేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ సహా మరికొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.  

కేంద్ర ప్రభుత్వ ఫలాలను ప్రజల వద్దకు తీసుకెళ్లండి
మోదీ సర్కార్‌ తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో నెలాఖరు వరకు నిర్వహించే ‘మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌’ను విజయవంతం చేయాలని పార్టీ నేతలకు సూచించారు. గడప గడపకూ బీజేపీ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఫలాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అందుకోసం కార్యక్రమాలను ఉధృతం చేయాలన్నారు.

రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలన్నీ కలిసే పోటీ చేయబోతున్నాయని సంజయ్‌ చెప్పారు. అయితే తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ పాలనపట్ల విసిగిపోయారని, బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారని పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top