ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ప్రజల్ని తప్పుదోవ పట్టించారు | People were misled about the Land Titling Act | Sakshi
Sakshi News home page

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ప్రజల్ని తప్పుదోవ పట్టించారు

Jan 24 2026 4:52 AM | Updated on Jan 24 2026 4:52 AM

People were misled about the Land Titling Act

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం రూరల్‌: ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ డ్రాఫ్ట్‌ను బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని చెబుతున్న టీడీపీ నేతలు గతంలో వైఎస్సార్‌సీపీని దూషించారని, ఇప్పుడు అదే చట్టంలో భాగమైన రీసర్వేను ఎలా అమలు చేస్తున్నారని, అంటే టీడీపీ వారంతా దొంగలేనా అంటూ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ విషయంలో టీడీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. 

ఈ చట్టంపై 40 ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయని, అనేక రిపోర్టులూ తెప్పించారని గుర్తు చేశారు. చివరిగా బీజేపీ ప్రభుత్వం నీతి ఆయోగ్‌కి రిఫర్‌ చేసిందని, ఇవన్నీ అధ్యయనం తరువాత నీతి ఆయోగ్‌ ఒక డ్రాఫ్ట్‌ తయారు చేసిందన్నారు. అదే టైట్లింగ్‌ యాక్ట్‌ డ్రాఫ్ట్‌ అని వివరించారు. భూ వ్యవహారాలు రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో ఉంటాయని, అందుకే దేశంలోని అన్ని అసెంబ్లీలకు ఈ మేరకు చట్టం చేయాలని పంపించారని వివరించారు. ఈ చట్టం డ్రాఫ్ట్‌ను మోదీ ఆధ్వర్యంలోని కేంద్రమే చేసిందని స్పష్టం చేశారు. 

చట్టం ఆమోదం పొందినప్పుడు టీడీపీ సభ్యులు కూడా అసెంబ్లీలోనే ఉన్నారని, నాడు ఈ చట్టాన్ని చూడలేదా అని ప్రశ్నించారు. భూములు కొట్టేయడానికి ఈ చట్టం తెచ్చారని ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్నారని, అంటే మోదీపై కూడా ఆరోపణలు చేసినట్టేనని అన్నారు. పాస్‌బుక్‌ మీద బొమ్మ ఉంటే భూమి లాగేసుకుంటారు అని ఒక క్యాబినెట్‌ మంత్రి చెబు­తున్నారని, బొమ్మ ఉంటే భూమిని లాగేసుకున్నట్టేనా అని ప్రశ్నించారు. 

ఈ రాష్ట్రంలోని విజ్ఞులు, న్యాయ­వాదులు ప్రజలను చైతన్యవంతులను చేయా­లని సూచించారు.  కేంద్రంతో కలిసి ఉన్న టీడీపీ నేతలు అదే కేంద్రం తెచ్చిన చట్టాన్ని ఎలా విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. భూములు కొట్టేయడానికి రాజ్యాంగం అంగీకరిస్తుందా? అని ప్రశ్నించారు. 

వందేళ్ల తర్వాత పకడ్బందీగా  రీసర్వే
గడిచిన వందేళ్లుగా సర్వే జరగలేదని, వైఎస్‌ జగన్‌ హయాంలో తాజాగా జరిగిందని చెప్పడానికే బొమ్మలు వేశామని వివరించారు. ఎంతో కీలకమైన సర్వేను నిర్వహించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని,  పటిష్టంగా, పకడ్బందీగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సర్వేచేయించామని చెప్పారు. టైటిలింగ్‌ యాక్ట్‌కు సంబంధించి తాజాగా వైఎస్‌ జగన్‌ కూడా ఓ కార్యక్రమంలో చక్కగా వివరించారని గుర్తు చేశారు. 

గత ప్రభుత్వంలో తాము తెచ్చిన విప్లవాత్మక మార్పులు మ్యుటేషన్, ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌ ఉంటేనే రిజిస్ట్రేషన్‌కు అనుమతి,  స్మార్ట్‌ విధానంలో డిజిటల్‌ రిజిస్ట్రేషన్‌తో పాటు గ్రామస్థాయిలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వంటివాటిని ఇప్పటికీ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం అవన్నీ తమ ఘనతలేనని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement