సాక్షి, నంద్యాల జిల్లా: రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లాలోనే అతిపెద్ద సహకార సంస్థ అయిన విజయ డెయిరీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆళ్లగడ్డలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డెయిరీ ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలను, ప్రభుత్వ ఒత్తిళ్లను ఎండగట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే సాకుతో తనను హౌస్ అరెస్ట్ చేయడం, నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన మండిపడ్డారు.
గతేడాది కూడా ఇదే విధంగా నామినేషన్లకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారని, అఖిలప్రియ అనుచరులు గొడవ చేస్తే పోలీసులు ఎన్నికలు వాయిదా వేయమని లెటర్ ఇస్తున్నారని ఆరోపించారు. జగత్ విఖ్యాత్ రెడ్డి ఒక 'డిఫాల్టర్' అని, ఆయనకు చైర్మన్ అయ్యే కనీస అర్హత లేదని బ్రిజేంద్ర రెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేట్ డెయిరీ నడుపుతున్న వ్యక్తి, సహకార డెయిరీకి చైర్మన్ ఎలా అవుతాడని ఆయన ప్రశ్నించారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేకనే: విజయ డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్ రెడ్డి
భూమా అఖిల ప్రియ ఎమ్మెల్యే అయిన నాటి నుంచి తన తమ్ముడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిని విజయ డెయిరీకి చైర్మన్ చేయాలని కుట్ర చేస్తోందని విజయ డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేటు పాల వ్యాపారం నిర్వహిస్తున్న తన తమ్ముడిని విజయ డెయిరీకి చైర్మన్ చేయడం మ్యూచువల్ కో ఆపరేటివ్ సొసైటీ నిబంధనలకు పూర్తి విరుద్ధమని చెప్పారు. సొసైటీలో డిఫాల్టర్ గా ఉన్న జగత్ విఖ్యాత్ రెడ్డికి కనీసం కోర్టు మెట్లు తొక్కే అర్హత కూడా లేదని విమర్శించారు.
అతడి ప్రలోభాలకు గురైన ముగ్గురు డైరెక్టర్లపై అనర్హత వేటు పడిందని చెప్పారు. చేతిలో అధికారం ఉందనే అహంకారంతో పోలీసులతో బెదిరించి, సీఎంవో నుంచి ఫోన్లు చేయించి పదే పదే ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆళ్లగడ్డలో జగత్ డెయిరీ ప్రారంభించిన నాటి నుంచి నంద్యాల విజయ డెయిరీ సేల్స్ పడిపోయాయని చెప్పారు. గతంలో రూ. 180 కోట్లు ఉన్న డైరీ టర్నోవర్‌ను తాము రూ. 360 కోట్లకు పెంచామని, రూ. 50 కోట్ల లాభం సాధించామని తెలిపారు.
రైతులకు గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రూ. 25 కోట్ల బోనస్ అందించినందుకు తనపై విచారణలు చేయిస్తున్నారా? అని నిలదీశారు. తన 58 ఏళ్ల జీవితంలో ఎన్నడూ లేని విధంగా, ఒకే రోజు తనపై మూడు తప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేయడం కక్షపూరిత రాజకీయాలకు పరాకాష్ట అని జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 40 వేల మంది రైతులు, 700 మంది ఉద్యోగుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న విజయ డెయిరీని కాపాడుకోవాలని అధికారులను, ప్రభుత్వాన్ని ఆయన కోరారు. తప్పుడు ఆరోపణలు చేసేవారు దమ్ముంటే వాటిని నిరూపించాలని సవాలు విసిరారు. న్యాయం జరిగే వరకు తాము పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.


