ప్రాణాలు పోతున్నా పట్టని యంత్రాంగం
నాంపల్లి ఘటనతోనైనా పాఠాలు నేరుస్తారా?
వచ్చేది వేసవి కాలం.. అప్రమత్తత మరిచిన వైనం
అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి
తాజా దుర్ఘటనతో ఉలిక్కిపడ్డ నగర వాసులు
ఫర్నిచర్ షాపులో ఐదుగురు చిక్కుకోవడంతో విషాదం
సాక్షి, సిటీబ్యూరో/నాంపల్లి/అబిడ్స్: గ్రేటర్ యంత్రాంగం నిప్పుతో చెలగాటమాడుతోంది. అమాయకుల ప్రాణాలను అగి్నకి ఆహుతి చేస్తోంది. నిబంధనలను మంటల్లో కాల్చేసి భవన నిర్మాణాలకు ఇష్టారీతిన అనుమతులిచ్చేస్తోంది. ఫలితంగా అభమూ శుభమూ తెలియని అభాగ్యులు కాలిబూడిదవుతున్నారు. నగరంలో అగ్ని ప్రమాదాలు షరామామూలుగా పరిణమించాయి. దుర్ఘటనలు సంభవించినప్పుడే నిబంధనలు, జాగ్రత్తలు, సెట్‌బ్యాక్‌లు అధికారులకు గుర్తుకొస్తాయి. అనంతరం అంతా మామూలే. ఫరి్నచర్ దుకాణాలు, గోడౌన్లు, స్క్రాప్ నిల్వల భవనాలు మంటల్లో మాడిమసి అవుతున్నాయి. ప్రాణాలు బుగ్గి అవుతున్నాయి. నివాస భవనాల్లో గోడౌన్లలోనూ ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా శనివారం నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో అగి్నకీలలు ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు అలుముకున్నాయి. వీటిలో ఐదుగురు చిక్కుకుపోవడం తీవ్ర విషాదాన్ని మిగిలి్చంది.
వాణిజ్య భవనాల్లో..
వాణిజ్య భవనాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో గత నాలుగేళ్లలో ఎంతో మంది మరణించారు. ప్రమాదాలు జరిగిప్పుడు చర్యలు తీసుకుంటామని, నిబంధనల అమలు తనిఖీలకు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తామంటూ ఉన్నతాధికారుల హెచ్చరికలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఫర్నిచర్ షాపులు, హోటళ్లు, హాస్పిటళ్లు, వివిధ షోరూమ్‌లు, పబ్‌లు ఇలా.. అన్నింటికీ ఇదే పరిస్థితి. వేటికీ నిబంధనల కనుగుణంగా సెట్‌బ్యాక్‌లుండవు, ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లుండవు. కాగా వచ్చేది వేసవి కాలం. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. అధికారులు ప్రమాదాల నివారణకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఎంతో ఉంది.
835 ప్రమాదాలు..
జీహెచ్‌ఎంసీ పరిధిలో గత ఏడాది దాదాపు 835 అగి్నప్రమాదాలు జరిగాయి. పలువురు క్షతగాత్రులయ్యారు. కొందరు మరణించారు. ఎంతో ఆస్తినష్టం జరిగింది. 2025 మే నెలలో జరిగిన గుల్జార్‌హౌస్ అగ్ని ప్రమాదంలో 8 మంది పిల్లలు సహా 17 మంది మృతి చెందారు. నవంబర్‌లో శాలిబండ ఎల్రక్టానిక్స్ షోరూమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మరణించారు. డిసెంబర్‌లో కాచిగూడ సుందర్‌నగర్‌లో జరిగిన అగి్నప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గత ఏడాది అగ్ని ప్రమాదాల కారణంగా దాదాపు రూ.32 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా.
గుండెల్ని పిండేసే దుర్ఘటనలెన్నో..
నిరుడు గుల్జార్‌హౌస్ సమీపంలోని ముత్యాల దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాతను నగర ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదు.గత ఏడాది టాటానగర్ ప్లాస్టిక్‌గోడౌన్‌లో, కూకట్‌పల్లి గ్యాస్ దుకాణం తదితర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆయా అగ్ని ప్రమాదాల్లో దాదాపు 50 మంది మరణించారు.
మూడేళ్ల క్రితం బజార్‌ఘాట్‌లో నివాస భవనంలోని కెమికల్ గోడౌన్‌లో సంభవించిన అగి్నప్రమాదంలో 9 మంది అసువులు బాశారు.
నాలుగేళ్ల క్రితం బోయిగూడ స్క్రాప్ గోడౌన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మరణించారు.
గత సంవత్సరం అఫ్జల్‌గంజ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి మరణాలు చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


