ఐ4సీ, ఇతర దర్యాప్తు సంస్థల పేరిట నకిలీ ఈ–మెయిల్స్
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: ‘చిన్నారుల అశ్లీల వీడియోలు చూశారు.. మీపైన ఫిర్యాదు వచ్చింది. మీ ఫోన్ నంబర్, ఐపీ అడ్రస్‌లు మా వద్ద ఉన్నాయి. మేము చెప్పినట్టుగా డబ్బులు పంపకపోతే మీపై కేసులు నమోదు చేస్తాం’అని బెదిరింపు ఈ–మెయిల్స్‌తో కూడిన లేఖలను సైబర్ నేరగాళ్లు పంపుతున్నారు. కేంద్ర హోంశాఖకు చెందిన ఐ4సీ (ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్) పేరిట దేశవ్యాప్తంగా వేలాది మందికి ఈ తరహా ఈ–మెయిల్స్ వస్తున్నాయని తెలిసింది.
ఈ తరహా మెయిల్స్‌లో అధికారుల పేర్లు, వారి హోదాలు చట్టంలోని సెక్షన్లను కూడా జత చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అమాయకులను మరింత బురిడి కొట్టించేలా పలు దర్యాప్తు సంస్థల లోగోలను పైభాగంలో వాడి నిజమైన నోటీసుల మాదిరిగా వాటిని రూపొందిస్తున్నారని తెలిపారు.
అయితే ఐ4సీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, కస్టమ్స్‌తో పాటు ఇతర దర్యాప్తు సంస్థల పేరిట వచ్చే ఈ తరహా ఈ–మెయిల్స్ నమ్మి మోసపోవద్దని అధికారులు హెచ్చరించారు. ఏ ప్రభుత్వ ఏజెన్సీ ఇలాంటి ఈ–మెయిల్స్ పంపదని పేర్కొన్నారు. ఇలాంటి అనుమానాస్పద ఈ–మెయిల్స్‌తోపాటు వాటిలోని లింక్‌లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సూచించారు. ఇలాంటి అనుమానాస్పద ఈ–మెయిల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని సైబర్ క్రైం పోలీసులకు తెలియజేయాలన్నారు.


