సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27 నుంచి సాధ్యమైనంత వరకు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ఫైళ్లను పరిశీలిస్తానని, కాగితపు ఫైళ్లను పరిశీలించబోనని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు అన్ని ప్రభుత్వ శాఖలకు తేల్చి చెప్పారు. ఆన్‌లైన్ ఫైళ్ల నిర్వహణకు సంబంధించి ఏమైనా ఇబ్బందులుంటే రాష్ట్ర ఐటీ శాఖను సంప్రదించాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఫైళ్లను డిజిటల్ విధానంలో నిర్వహించడానికి ‘ఈ ఆఫీస్’పేరుతో నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను చాలా కాలం నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, కార్యాలయాల్లో వినియోగిస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మైనింగ్, అటవీ, ఆర్థిక శాఖలతో పాటు స్పీడ్, జీహెచ్‌ఎంసీ వంటి ప్రభుత్వ విభాగాలు ఇప్పటికే వంద శాతం లక్ష్యాన్ని సాధించాయి.
జిల్లా, రాష్ట్ర స్థాయిల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల నిర్వహణను వంద శాతం ఆన్‌లైన్ ద్వారా నిర్వహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకుపోతోంది. ఈ క్రమంలో ఇకపై సచివాలయంలోని అన్ని శాఖల కార్యదర్శుల కార్యాలయాల నుంచి తన కార్యాలయానికి ఫైళ్లను ఆన్‌లైన్ ద్వారానే పంపించాలని తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
‘ఈ ఆఫీస్’పాత సాఫ్ట్‌వేర్‌తో ఇబ్బందులను అధిగమించేందుకు ఇటీవల కొత్త వెర్షన్‌ను సైతం వినియోగంలోకి తెచ్చారు. సులువుగా వినియోగించేలా సాఫ్ట్‌వేర్‌లో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచి్చనట్లు రాష్ట్ర ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి కొత్త ఫైళ్లను మాత్రమే తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోగా, క్రమంగా పాత ఫైళ్లన్నంటికి స్కానింగ్ నిర్వహించి ‘ఈ ఆఫీస్’పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని అన్ని శాఖలకు ప్రభుత్వం సూచించింది.


