రూ.వంద కోట్ల భూమిపై పచ్చ ‘దుప్పటి’ | TDP Leaders Grabs Land Of Muslims At Kadiri | Sakshi
Sakshi News home page

రూ.వంద కోట్ల భూమిపై పచ్చ ‘దుప్పటి’

Jan 25 2026 5:43 AM | Updated on Jan 25 2026 5:44 AM

TDP Leaders Grabs Land Of Muslims At Kadiri

సమాధులను చదును చేసి మట్టి రోడ్లు వేసిన దృశ్యం

కదిరిలో ముస్లింల భూమిపై కన్నేసిన నియోజకవర్గ ముఖ్యప్రజాప్రతినిధి!

కదిరి (అనంతపురం ఎడ్యుకేషన్‌): దేశానికి స్వాతంత్య్రం రాకముందు కదిరి పట్టణంలోని ఆ భూమి ముస్లిం మైనార్టీలది. ప్రభుత్వ రికార్డులూ అవే చెబుతున్నాయి. ఆ భూమిలో ఉన్న ముస్లింల సమాధులే ఇందుకు సాక్ష్యం. అయితే అప్పట్లోనే భూ యజమానులైన ముస్లింలు దేశం వీడి పాకిస్తాన్‌ వెళ్లిపోయారనే ప్రచారం ఉంది. ఆ తర్వాత భూమిపై సంబంధం లేని వారు హక్కుదారులమంటూ రికార్డుల్లోకి ఎక్కించుకున్నారు. వారి పేర్లయితే రికార్డులకు ఎక్కాయికానీ... వారికి ఎలా సంక్రమించిందనే దానిపై ఆధారాలు లేవు. ఒకప్పుడు ఊరి చివరన ఉన్న ఈ భూమి ఇప్పుడు పట్టణం నడి»ొడ్డుగా మారింది. ప్రస్తుతం అక్కడ సెంటు భూమి ధర రూ. 25 లక్షల వరకు పలుకుతోంది. 

అక్షరాలా ఈ భూమి విలువ రూ.వందకోట్ల పైమాటే. ఇంతటి విలువైన భూమిపై తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కదిరి నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి కన్నుపడింది. అప్పటికే పాసుబుక్కులు పొంది వివాదం నడుస్తున్న కుటుంబ సభ్యులను పిలిపించి దుప్పటి పంచాయితీ చేశారు. స్వయంగా ఆయన అనుచరులు రంగంలోకి దిగి లేఅవుట్‌ వేసేందుకు పనులు చక్కబెడుతున్నారు. ఇదే సమయంలో కొందరు ముస్లింలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ భూమి ముస్లింలదేనని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ముస్లింల అవసరాలకు వినియోగించాలంటూ వారు పిల్‌ వేయడం చర్చనీయాంశంగా మారింది.  

అసలు కథ ఇదీ..! 
కదిరి రెవెన్యూ పొలం 640–1 సర్వే నంబరులో 2.79 ఎకరాలు, 640–2 సర్వే నంబరులో 3.20 ఎకరాలు రెండు షెడ్యూళ్లు కలిపి మొత్తం 5.99 ఎకరాల భూమి  (ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల పక్కన) పూర్వం 1923లో ఆర్‌ఎస్‌ఆర్‌ (రీ సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌)లో ఫకృద్దిన్‌ఖాన్‌ పేరుపై ఉంది. 1933–55 ప్రాంతంలో ఆర్‌హెచ్‌ (రిజిస్టర్‌ ఆఫ్‌ హోల్డింగ్స్‌)లో నూరుల్లాఖాన్‌ పేరు ఉంది. ఈయన ఫకృద్దీన్‌ఖాన్‌ వారసుడని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. 1958లో కామోజి ధర్మాబాయమ్మ అనే మహిళ కామోజి బాలాజీ ప్రసాద్‌కు ఈ భూమిని దానవిక్రయం చేసినట్లు ఈసీలో కనిపిస్తోంది. అయితే వీరికి ఫకృద్దీన్‌ఖాన్, నూరుల్లాఖాన్‌ నుంచి భూమి ఎలా సంక్రమించిందనే వివరాలు అధికారికంగా లేవు. అదే ఏడాది కామోజి బాలాజీప్రసాద్‌ రెండో షెడ్యూల్‌ 640–2 సర్వే నంబరులో 0.1.1/4 సెంట్లు రాకెట్ల వెంకటప్పకు, మరో 0.1.1/4 సెంట్లు పోలంకి మునిరామ శంకర్‌రావుకు విక్రయించాడు. 

ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి ఎలా వచ్చాడో... 
1960లో మొదటి షెడ్యూల్‌ 640–1 సర్వే నంబరులో 1.17 ఎకరాలు ఏమాత్రం సంబంధం లేని ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి సోమగట్టు పాపులమ్మ పేరిట రిజిస్టర్‌ చేయించాడు. రెండు షెడ్యూళ్ల ఆస్తి 5.99 ఎకరాలను 1958లో కామోజి ధర్మాబాయమ్మ నుంచి దాన విక్రయం పొందిన కామోజి బాలాజీ ప్రసాద్‌ కాకుండా ఎద్దుల ఈశ్వర్‌రెడ్డికి ఎలా ఈ భూమి వచ్చిందో అంతుచిక్కని ప్రశ్న. 640–2 సర్వే నంబరులో రాకెట్ల వెంకటప్ప, పోలంకి మునిరామ శంకరరావు కొనుగోలు చేసిన 2.5 సెంట్లు భూమిని ఆ ఇద్దరి నుంచి 1969లో బుడిగి సుబ్రమణ్యం కొనుగోలు చేశాడు.  

3.20 ఎకరాలను రిజిస్ట్రేషన్‌ చేయించిన సుబ్రమణ్యం 
2.5 సెంట్లు కొనుగోలు చేసిన బుడిగి సుబ్రమణ్యం 1983లో 640/2 సర్వే నంబరులో ఏకంగా 3.20 ఎకరాల భూమిని కామోజి కుటుంబానికి చెందిన కామోజి లక్ష్మీప్రసాద్‌కు రిజిస్టర్‌ చేయడం కొసమెరుపు. కామోజీ ధర్మబాయమ్మ ఈ భూమిని తన వారసత్వానికి దాన విక్రయం చేస్తే...తిరిగి ఆ భూమిని సుబ్రమణ్యం అనే వ్యక్తిద్వారా కామోజి కుటుంబ సభ్యులు కొనడం గమనార్హం. కొన్నేళ్లుగా కామోజీ కుటుంబ సభ్యుల మధ్య నడస్తున్న ఈ భూ వివాదం నేపథ్యంలో కొందరు పాసు బుక్కులు తెచ్చుకున్నారు. 

ఇదిలాఉండగా కామోజీ కుటుంబ సభ్యులు పూర్వం ఈ ప్రాంతంలో కరణాలుగా పని చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఈ భూమిని తమ కుటుంబ సభ్యుల పేర్లు ఎక్కించుకున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇదే అదునుగా ముఖ్యప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. దుప్పటి పంచాయితీ చేసి భూమిని తన స్వా«దీనం చేసుకున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే తన అనుచరులతో చదును చేయించారు. ఈక్రమంలో ముస్లింల సమాధులనూ ధ్వంసం చేసేశారు. ఎలాంటి కన్వర్షన్‌ లేదు, అధికారిక అనుమతులు లేవు లేఅవుట్‌ మాత్రం సిద్ధం చేసేస్తున్నారు.  

హైకోర్టులో పిల్‌ వేసిన ఇద్దరు ముస్లింలు 
5.99 ఎకరాల భూమి పూర్వం ముస్లింలదేనంటూ షేక్‌ ఇమాంసాబ్, కోలార్‌ బాబాఫకృద్దీన్‌ అనే వ్యక్తులు 2025 డిసెంబరులో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) వేశారు. ప్రభుత్వం ఈ భూమిని స్వా«దీనం చేసుకుని పేద ముస్లింల అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించిన ధర్మాసనం.. ఈ భూమి అసలైన హక్కుదారులు ఎవరు, ప్రస్తుతం ఉన్నవారికి ఎలా సంక్రమించిది అనేది తేల్చి ఫిబ్రవరి 28లోపు నివేదిక ఇవ్వాలంటూ శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్, కదిరి తహసీల్దారును ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement