అనంతపురం అర్బన్: కలెక్టర్ ఆనంద్ మంగళవారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొననున్నారు. ఆయన తిరిగి ఈ నెల 13న విధులకు హాజరవుతారని కలెక్టర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
యూట్యూబర్‌పై కేసు నమోదు
అనంతపురం సెంట్రల్: వ్యవసాయశాఖ ఏడీ అల్తాఫ్ అలీఖాన్‌ను బెదిరించి, పరువుకు భంగం కలిగించిన కేసులో యూట్యూబర్ హనుమంత రెడ్డిపై అనంతపురం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సీఐ శ్రీకాంత్‌యాదవ్ మంగళవారం వెల్లడించారు. గత ఫిబ్రవరిలో అల్తాఫ్‌ఖాన్‌ను యూట్యూబర్ హనుమంతరెడ్డి కలిసి తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నీ కథ చూస్తానని బెదిరించాడని తెలిపారు. ఏడీ ఫొటో వాడుకుని యూట్యూబ్ చానల్‌లో రీల్ వైరల్ చేశాడని వివరించారు. దీంతో తన పరువు, ప్రతిష్టతలను దెబ్బతీశాడంటూ ఫిబ్రవరి 23న పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టును ఆశ్రయించారన్నారు. దీంతో యూట్యూబర్‌పై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా యూట్యూబర్ హనుమంతరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గల్లంతైన వ్యక్తి మృతి
ఉరవకొండ రూరల్: మండల పరిధిలోని హంద్రీ–నీవా కాలువలో గల్లంతైన వడ్డే శ్రీనివాసులు మృతదేహమై తేలాడు. ఇంద్రావతి గ్రామానికి చెందిన శ్రీనివాసులు సోమవారం సాయంత్రం తన పొలం నుంచి ఇంటికెళుతూ మార్గమధ్యంలో స్నానం చేసేందుకు హంద్రీ–నీవా కాలువలో దిగాడు. ఆ సమయంలో నీటి ప్రవాహ వేగానికి కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు, సమీప బంధువులు పరిసరాల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం మోపిడి గ్రామ సమీపంలో శ్రీనివాసులు మృతదేహాన్ని పోలీసులు గుర్తించి, వెలికి తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
కొడిగెనహళ్లి ఏపీఆర్‌ఎస్‌లో ప్రవేశానికి దరఖాస్తులు
పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి గురుకుల ప్రతిభావంతుల ఆశ్రమ పాఠశాల, జూనియర్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని విద్యాసంస్థల జిల్లా కన్వీనర్, పాఠశాల ప్రిన్సిపాల్ నరేంద్ర తెలిపారు. ఈ నెల 31 లోపు ఏపీఆర్‌ఎస్.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం 4వ తరగతి చదివే విద్యార్థులు 5వ తరగతిలో ప్రవేశం కోసం, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు జూనియర్ కళాశాలలో ప్రవేశానికి అర్హులన్నారు. ఏప్రిల్ 24న నిర్వహించే ఏపీఆర్‌ఎస్ క్యాట్, ఏపీఆర్‌జేసీ సెట్‌లో వచ్చే మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు ఏపీఆర్‌ఎస్ ప్రిన్సిపాల్ (87126 25065), ఏపీఆర్‌జేసీ ప్రిన్సిపాల్ (87126 25078)ను సంప్రందించాలని కోరారు.
వాహన షోరూంలలో అక్రమాలపై డీటీసీ తనిఖీలు
అనంతపురం సెంట్రల్: ఆర్టీఏ అధికారుల పేర్లు చెప్పి అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించబోమని వాహన షోరూం నిర్వాహకులను ఉపరవాణా కమిషనర్ (డీటీసీ) ఎం. వీర్రాజు హెచ్చరించారు. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన వారి వద్ద నుంచి ఆర్టీఏ అధికారుల పేరు చెప్పి అదనపు సొమ్ము వసూలు చేస్తున్నట్లుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మంగళవారం డీటీసీతో పాటు ఆర్టీఓ సురేష్‌నాయుడు, ఆరుగురు ఎంవీఐలు నాలుగు బృందాలుగా విడిపోయి నగరంలోని ఎనిమిది వాహన షోరూంలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రతి షోరూంలో ఎక్స్ షో రూం ధర, వాహన పన్ను, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు, రోడ్ సేఫ్టీ సెస్ తదితర వివరాలతో కూడిన ధరల పట్టిక లేకపోవడంతో డీటీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కున్ హుందాయ్, రిత్విక మోటార్స్, జయలక్ష్మి మారుతీ షోరూంలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అదనపు ధర వసూలు చేసినట్లు వాహనదారులు తగిన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే షోరూం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంవీఐలు శ్రీనివాసులు, సునీత, సునీల్, రాజగోపాల్, రఘునాథ్, లహరి తదితరులు పాల్గొన్నారు.


