ఆర్డీటీ కోసం ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం | - | Sakshi
Sakshi News home page

ఆర్డీటీ కోసం ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం

Mar 11 2026 7:44 AM | Updated on Mar 11 2026 7:44 AM

కళ్యాణదుర్గం/కుందుర్పి: కరువు పీడిత అనంతపురం జిల్లా అభివృద్ధికి, పేదల జీవన ప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్న ఆర్డీటీని కాపాడుకోవడంలో భాగంగా అవసరమైతే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌ చేయాలంటూ కుందుర్పిలో మంగళవారం కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ తలారి రంగయ్య ఆధ్వర్యంలో లక్ష పోస్టు కార్డుల ఉద్యమం కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షుడితో పాటు మాజీ మంత్రి డాక్టర్‌ సాకే శైలజానాథ్‌, డాక్టర్‌ తలారి రంగయ్య, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, సీఈసీ సభ్యుడు మాదినేని ఉమామహేశ్వరనాయుడు, నియోజకవర్గ పరిశీలకులు మహేందర్‌ రెడ్డి హాజరయ్యారు.

ఆర్డీటీలా ఆదుకునే దమ్ముందా?

అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ... ఆర్డీటీలా రాజకీయాలకు అతీతంగా, నిస్వార్థంగా పేదలను ఆదుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ఎస్సీ, బీసీ కాలనీల్లో తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతుంటే మరో వైపు ఆదాయం కోసం మద్యాన్ని వరదలా ప్రవహింపజేస్తున్నారని మండిపడ్డారు. ఓ వైపు పంటలు ఎండిపోతున్నా హంద్రీ–నీవా ద్వారా నీటి ప్రవాహాన్ని 11 వేల క్యూసెక్కులకు పెంచి అన్ని చెరువులకూ నీళ్లిస్తామనే స్పష్టత కూడా ఇవ్వలేని అసమర్థ స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన పాలకులు గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. చాలా ప్రభుత్వాలు పట్టించుకోని రోజుల్లో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఆర్డీటీ సైకిళ్లు, ఎద్దులబండ్లు, గుర్రపు బండ్ల ద్వారా నీటిని అందించిందన్నారు. స్నానానికి కూడా మినరల్‌ వాటర్‌ వాడే టీడీపీ ప్రభుత్వ పెద్దలకు పేదల కష్టాలు పట్టడం లేదన్నారు. సహజ సిద్ధంగా లభ్యమయ్యే నీటిని సైతం పాలకుల చేతకానితనం వల్ల రూ.5తో కొనుగోలు చేసి తాగాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టకపోయి ఉంటే పేదల పరిస్థితి దయనీయంగా ఉండేదన్నారు. జిల్లా ప్రజలకు మేలు చేస్తున్న ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌ చేసే అంశంపై ఏప్రిల్‌ 2 వరకు వేచి చూస్తామని, అప్పటికీ చేయకపోతే పరిపాలనను పూర్తిగా స్తంభింపజేస్తామని హెచ్చరించారు. మతం ముద్ర వేసి పేదలకు ఆర్డీటీని దూరం చేసే కుట్రను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎంత కష్టమొచ్చినా ఆర్డీటీకి అండగా వైఎస్సార్‌సీపీ ఉంటుందన్నారు.

ప్రభుత్వాలు దిగివచ్చేలా పోరాటం

మాజీ మంత్రి డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ మాట్లాడుతూ.. తాను కూడేరులోని ఆర్డీటీ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేశానని గుర్తు చేశారు. ఆ సమయంలో ఆర్డీటీ సేవల్లోని నిబద్ధతను ఏ ప్రభుత్వాల్లోనూ తాను చూడలేదన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలోని ఎస్సీ కాలనీల్లో ఓ స్కూల్‌ నెలకొల్పడమే కాకుండా ప్రత్యేకంగా టీచర్‌ను నియమించి విద్యాభివృద్ధికి ఆర్డీటీ చేసిన అందించిన సేవల కారణంగా కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డాయన్నారు. వేలాది మంది చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌ అంశంలో ప్రభుత్వాలు దిగి వచ్చే వరకూ అనంత వెంకట్రామిరెడ్డి, తలారి రంగయ్య నాయకత్వం కింద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అలుపెరగని పోరాటాలు సాగిస్తామని అన్నారు. ఆర్డీటీకి మద్దతుగా మాట్లాడే ధైర్యం టీడీపీ నేతలకు లేదన్నారు. వారే కనుక ప్రశ్నించి ఉంటే ఆర్టీటీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో త్వరలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీని కలిసి జిల్లాలో ఆర్డీటీ ఆవశ్యకతను వివరించి, ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌ చేయించి తీరుతామని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో మాంఛో ఫెర్రర్‌ గళం విప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లా అభివృద్ధి, పేదల కోసం ఆయన గొంతు విప్పాలని, అవసరమైతే ఆర్డీటీని కాపాడుకునేందుకు 3 వేల గ్రామాల ప్రజానీకం ఆయన వెనుకే నిలుస్తుందని పేర్కొన్నారు.

సామాజిక బాధ్యతతో పోరాడాలి

వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ఆర్డీటీ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి పోరాడాలని పిలుపునిచ్చారు. లక్షలాది మంది జీవన స్థితిగతుల మార్చిన ఫాదర్‌ ఫెర్రర్‌కు కళ్యాణదుర్గం ప్రాంతంలో గుడి కట్టారంటే ఆర్డీటీ అందించిన సేవలు ఏపాటివో అర్థం చేసుకోవచ్చునన్నారు. మతం పేరు చెప్పి ఆర్డీటీని ప్రజలకు దూరం చేయాలనుకోవడం మూర్ఖత్వమవుతుందన్నారు. ఇప్పటికై నా పాలకుల వైఖరి మారి ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌ చేయకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.

● జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ.. 56 ఏళ్లుగా జిల్లాలో పేదల అభ్యున్నతికి ఆర్డీటీ చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రభుత్వానికి సమాంతరంగా అన్ని రంగాల్లోనూ విస్తృత సేవలు అందిస్తోందన్నారు. క్రీడా రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో అనంతపురం జిల్లా పేరు వినిపిస్తోందంటే దానికి ఆర్డీటీనే కారణమన్నారు. ఆర్డీటీ పరిరక్షణను బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు.

● ఎమ్మెల్సీ మంగమ్మ మాట్లాడుతూ.. కరువు పీడిత అనంతపురం జిల్లాలో రైతుల పక్షాన నిలిచి వ్యవసాయాన్ని సుసంపన్నం చేసింది ఆర్డీటీనే అని అన్నారు. డ్రిప్‌ పరికరాలు సమకూర్చడంతో పాటు విస్తృతంగా నీటి కుంటలు, చెక్‌డ్యాంలు నిర్మించి భూగర్భజలాల అభివృద్ధికి ఆర్డీటీ తీసుకున్న చొరవను కొనియాడారు. ఇలాంటి సంస్థను దూరం చేయడం కూటమి నేతలకు సరి కాదన్నారు. ఆర్డీటీ పరిరక్షణకు అందరూ కదలి రావాలన్నారు.

కార్యక్రమంలో పార్టీ వివిధ విభాగాల రాష్ట్ర కార్యదర్శులు కె.నాగరాజు, ములకనూరు తిమ్మరాయుడు, దొడగట్ట నారాయణ, టైలర్‌ వన్నూరుస్వామి, జానీ, రామాంజనేయులు, ఈ.రాము, గుర్రం లింగప్ప, జెడ్పీటీసీ గుద్దెళ్ల నాగరాజు, ఎంపీపీలు కమలా నాగరాజు, చంద్రశేఖర్‌రెడ్డి, సోమనాథ్‌రెడ్డి, మారుతమ్మ, భీమేష్‌, నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల కన్వీనర్లు కురబ హనుమంతరాయుడు, సుధీర్‌, గోళ్ల సూరి, ఎంఎస్‌ రాయుడు, చంద్రశేఖర్‌ రెడ్డి, గొల్ల హనుమంతరాయుడు, వెంకటప్ప, ఎంపీటీసీలు, సర్పంచులు, పెద్ద సంఖ్యలో ఆర్డీటీ లబ్ధిదారులు పాల్గొన్నారు.

కార్యక్రమానికి హాజరైన పార్టీ శ్రేణులు, ఆర్డీటీ లబ్ధ్దిదారులు

సమావేశంలో మాట్లాడుతున్న వెఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి (చిత్రంలో) తలారి రంగయ్య, డాక్టర్‌ శైలజానాథ్‌, వై.విశ్వేశ్వరరెడ్డి, మాదినేని ఉమా, జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ

సమయం లేదు..

మాజీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. గత వెఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏనాడూ ఆర్డీటీకి కష్టం రాలేదన్నారు. 66 బోర్లు వేయిస్తే అన్నింటిలో సమృద్ధిగా నీరు పడ్డాయని గుర్తు చేశారు. ఆర్డీటీ పరిరక్షణ అంశంలో ఇక ఉపేక్షించాల్సిన సమయం లేదని, గాంధీ మహాత్ముడు చెప్పినట్లుగా డూ ఆర్‌ డై సిద్ధాంతాన్ని అనుసరిస్తూ మరణమా.. శరణమా అంటూ ప్రభుత్వాలను నిలదీయాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. పార్టీ తరపున ఈ ప్రాంతం, ఈ ప్రజల కోసం ఆర్డీటీ పరిరక్షణను భుజాలకు ఎత్తుకున్నామన్నారు. మన గొంచిగాడు... మన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు జీడిపల్లి నుంచి బీటీపీకి నీళ్లు ఇవ్వలేదు కానీ ఎక్కడో ఉన్న కుప్పానికి మాత్రం నీళ్లు తీసుకెళ్లారని ఎద్దేవా చేశారు. ఉప్పు సత్యాగ్రహంతో బ్రిటీష్‌ పాలకుల మెడలు వచ్చిన గాంధీజీ పోరాట స్ఫూర్తితో 50 పైసల పోస్టు కార్డు రాసి కేంద్ర ప్రభుత్వంలో కదలిక తెద్దామని పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియ ఉప్పెనలా సాగాలన్నారు. దీనిపై త్వరలో డిజిటలైజేషన్‌ చేసి, ఉద్యమాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. బైకు ర్యాలీలు, పాదయాత్రలు చూసి ఆర్డీటీ వచ్చేసిందంటూ హేళనగా మాట్లాడిన ప్రభుత్వ పెద్దలకు కనువిప్పు కలిగేలా పోరాటాన్ని ఉధృతం చేద్దామన్నారు.

ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌పై టీడీపీ నేతలకు ప్రశ్నించే ధైర్యం లేదు

త్వరలో రాష్ట్రపతి, పీఎంనూ కలుస్తాం

ఏప్రిల్‌ 2న డెడ్‌లైన్‌

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, మాజీ మంత్రి శైలజానాథ్‌,

సమన్వయకర్త తలారి రంగయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement