
పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను వీక్షిస్తున్న ఖర్గే, రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి
బీసీ రిజర్వేషన్లపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బిల్లు ఆమోదంలో జాప్యం చేయకూడదు: రాహుల్‌గాంధీ
తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే దేశానికే మార్గదర్శకం
దేశంలో సామాజిక న్యాయానికి ఇదొక మైలురాయిగా నిలుస్తుంది.. కులగణనకు దిక్సూచిగా మారుతుంది
ప్రస్తుతం 50% రిజర్వేషన్ల పరిమితి అడ్డుగోడగా మారింది
ఈ అడ్డుగోడను తొలగించేందుకే బీజేపీపై ఒత్తిడి తెస్తున్నాం
దేశాభివృద్ధికి డబ్బు, భూములు కాదు.. ఇంగ్లిష్ విద్యే మార్గమన్న కాంగ్రెస్ అగ్రనేత
ఓబీసీలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు ఉండదని బీజేపీ ప్రభుత్వం గమనించింది: ఏఐసీసీ చీఫ్ ఖర్గే
కులగణన తెలంగాణ సాధించిన పెద్ద విజయమని కితాబు
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే దేశానికే మార్గదర్శకమని, ఇందుకు సంబంధించి రాష్ట్రం తీసుకొచ్చిన బిల్లును ఆమోదించే బాధ్యత కేంద్రంపైనే ఉందని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బిల్లును ఆమోదించే విషయంలో జాప్యం చేయరాదని అన్నారు.
దేశంలో సామాజిక న్యాయానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే మైలు రాయిగా నిలుస్తుందని కొనియాడారు. గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయంలో తెలంగాణలో చేపట్టిన కుల గణన సర్వేపై ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఆయన పార్టీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు.
ఇదొక సామాజిక, ఆర్థిక, రాజకీయ పనిముట్టు
‘కుల గణన అనేది రేవంత్‌రెడ్డికి అంత సులువు కాదని భావించాం. సీఎంగా ఇది ఆయనకు ఇబ్బందికరమని అనుకున్నాం. ఆయన సామాజిక వర్గం ఆయనను సమర్థించదని భావించాం. కానీ రేవంత్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు నేను ఆశించిన దానికంటే అద్భుతంగా పనిచేశారు. సరైన దృక్పథంతో సర్వేను పూర్తి చేశారు. బీజేపీ దీనిని ఇష్టపడినా, పడకున్నా.. దేశంలో కుల గణన చేపట్టేందుకు ఇది ఒక దిక్సూచిగా మారుతుంది.
ఇది నాలుగు గోడల మధ్య చేయలేదు. తెలంగాణలోని లక్షల మంది ప్రజలు, అన్ని వర్గాలను 56 ప్రశ్నలు అడిగి సర్వే చేశారు. వేరే ఏ ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సర్వే జరగలేదు. 21వ శతాబ్దపు సామాజిక, రాజకీయ, ఆర్థిక డేటా తెలంగాణ ప్రభుత్వం చేతుల్లో ఉంది.
ఈ సర్వే వివరాల ఆధారంగానే కులం, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇదొక సామాజిక, ఆర్థిక పనిముట్టు. బీజేపీకి ఇష్టం లేకపోయినా ఇదొక రాజకీయ పనిముట్టు..’ అని రాహుల్ అభివర్ణించారు.
కుల గణనను కేంద్రం సరిగా చేయదు
‘ప్రస్తుతం 50 శాతం రిజర్వేషన్ల అడ్డుగోడను తొలగించే అవసరం వచ్చింది. కానీ దీనిని కేంద్రం విస్మరిస్తోంది. కుల గణన సర్వే వివరాల ఆధారంగా తెలంగాణలో జరిగే అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. హిందుత్వ పేరుతో స్థానిక రాజకీయాల్లో, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల అడ్డుగోడ సామాజిక అభివృద్ధికి విఘాతంగా మారింది. ఈ అడ్డుగోడను తొలగించే విషయంపై నేను, రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా బీజేపీపై ఒత్తిడి తెస్తున్నాం.
మాకు తెలిసినంత వరకు కుల గణనను కేంద్రం సరైన రీతిలో నిర్వహిస్తుందని అనుకోవడం లేదు. వాళ్లు అలా చేయరు. ఓబీసీలు, దళితులు, ఆదివాసీల వాస్తవ పరిస్థితులు ఏంటో దేశ ప్రజలకు చెప్పాలన్న ఆలోచన కూడా వారికి లేదు. కులగణన వాస్తవాలు వారు ఎప్పుడు బయటకు వెల్లడిస్తారో అప్పుడు బీజేపీ భావజాలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది..’ అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.
ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంగ్లీష్ వద్దా?
‘దేశాభివృద్ధికి డబ్బు, భూములు కాదు.. ఇంగ్లీష్ విద్యే మార్గం. తెలంగాణ కుల గణనలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది. ఈ సర్వేకు ముందు భూములే విలువైనవని నేను కూడా అనుకునేవాడిని. కానీ ఇంగ్లీష్ ప్రాధాన్యమైన అంశం అని కుల గణన నిపుణుల కమిటీ చెప్పినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఇంగ్లీష్ అవసరం..అలాగని హిందీ, ఇతర ప్రాంతీయ భాషలు అక్కర్లేదని నేను చెప్పడం లేదు.
ఏ బీజేపీ నేతను ప్రశ్నించినా ఇంగ్లీష్ వద్దంటారు. వారి పిల్లలు ఏ స్కూల్, కాలేజీలో చదువుతున్నారని ప్రశ్నిస్తే మాత్రం.. ఇంగ్లీష్ మీడియం అనే సమాధానమే వస్తుంది. మరి ఆ అవకాశాన్ని దేశంలోని వెనుకబడిన వర్గాలైన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు బీజేపీ నేతలు ఎందుకు ఇవ్వరు?..’ అని రాహుల్ నిలదీశారు.
రేవంత్‌రెడ్డి తదితరులను అభినందిస్తున్నా..
‘రాష్ట ప్రభుత్వం కులగణన తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించింది. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం అడ్డుగోడను తొలగించాలనుకుంటున్నట్లు అందులో పేర్కొంది. అయితే అందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పకోవడం లేదు. దీనిని పార్లమెంటులో లేవనెత్తడమే మన కర్తవ్యం. రేవంత్‌రెడ్డి చేసిన దాన్ని మనం ప్రోత్సహించాలి. సర్వే నిర్వహించిన రేవంత్‌రెడ్డి, నిపుణుల కమిటీ, కాంగ్రెస్ నేతలను నేను అభినందిస్తున్నా. జరిగిన దానిని ఖర్గే పెద్దగా సమర్థించలేదు. అయినప్పటికీ ఆయనకు కూడా నా ధన్యవాదాలు..’ అని రాహుల్ అన్నారు.
భవిష్యత్తు లేదనే కేంద్రం కులగణన నిర్ణయం: ఖర్గే
ఓబీసీలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు ఉండదని గమనించే దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో కులగణనను భాగం చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘భారత్ జోడో యాత్ర, సంవిధాన్ బచావ్ ర్యాలీల్లో రాహుల్‌గాం«దీకి ఓబీసీలంతా మద్దతు ఇచ్చారు. ‘జై బాపూ.. జై భీమ్.. జై సంవిధాన్’ అనే రాహుల్ నినాదంతో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లాభం జరిగింది.
ఇది గమనించిన ఇతర పార్టీలు తమకు భవిష్యత్తు లేదని భావించి మన బాటలో నడుస్తున్నాయి. కేంద్రం తీసుకున్న జనగణనలో కులగణన నిర్ణయం అందుకు నిదర్శనం. కుల గణన సర్వే తెలంగాణ సాధించిన పెద్ద విజయం. ప్రభుత్వం చేసిన కుల గణన దేశానికి దిశానిర్దేశం చేసింది. కుల గణన చేపట్టడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన చర్య.
రాజకీయంగా శక్తి లభించింది కాబట్టే రేవంత్‌రెడ్డి ఇది చేయగలిగారు. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాల్లోని ప్రతి బ్లాక్‌కు తీసుకెళ్లాలి. పీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నేతలంతా ఈ బాధ్యత తీసుకోవాలి. అందరి ఎక్స్‌రే తీశారు కానీ.. ఈ సర్వేలో అంటరానివారే లేరని సీఎం, మంత్రులకు చెప్పాను. బీసీలు సామాజికంగా వెనుకబడ్డారు. కానీ దళితులు అంటరానివారిగా ఉన్నారు. అలా ఉన్నామని భావిస్తున్నారు.
ఈ అంతరాన్ని చెరిపేయాలి. వీరిని ఒక్కతాటి పైకి తీసుకురావాలి. ఈ సర్వేలో భాగస్వామ్యం వహించిన వారందరికీ అభినందనలు. భారత్ జోడో యాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణలో కుల గణనను ప్రోత్సహించిన రాహుల్ గాందీని అభినందిస్తున్నా. రాహుల్ గాంధీ ఒత్తిడితోనే ప్రధాని మోదీ దేశ వ్యాప్త జన గణనలో కుల గణనను భాగం చేస్తూ దిగిరాక తప్పలేదు..’ అని ఖర్గే పేర్కొన్నారు.