
సాక్షి, హైదరాబాద్: అక్రమ మద్యం కేసులో మరో నాటకానికి సిట్ తెరతీసింది. సోదాల పేరుతో హడావుడి సృష్టించేందుకు సిట్ ప్రయత్నించింది. హైదరాబాద్‌లోని బాలాజీ గోవిందప్ప నివాసంలో మరోసారి సోదాల పేరుతో సిట్ అధికారులు హల్‌చల్ చేశారు. గతంలోనే బాలాజీ గోవిందప్ప ఇంటిలో సిట్ అధికారులు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు.
మే 13న బాలాజీ గోవిందప్పను సిట్ అరెస్ట్ చేసింది. 74 రోజులుగా ఆయన రిమాండ్‌లో ఉన్నారు. బాలాజీ గోవిందప్పకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా కోర్టు ముందు సిట్ పెట్టలేకపోయింది. ఏసీబీలో కోర్టులో బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్‌పై ఈనెల 29న కోర్టు విచారణ చేపట్టనుంది.
బాలజీ గోవిందప్ప బెయిల్‌ను అడ్డుకునేందుకు సోదాల పేరుతో సిట్ అధికారులు మరో కొత్త నాటకానికి తెరలేపారు. కొత్తగా ఆధారాలు దొరికాయంటూ చెప్పేందుకే ఈ నాటకం చేస్తున్నారని గోవిందప్ప న్యాయవాదులు అంటున్నారు. బాలాజీ గోవిందప్ప.. ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీ వికాట్ ఇంటర్నేషనల్‌లో ఫుల్‌టైమ్ డైరెక్టర్‌గా ఉన్నారు. వికాట్ గ్రూప్‌కు సంబంధించిన కార్యాలయంలో కూడా సిట్ అధికారులు సోదాలు చేపట్టారు.
