
అటు సీఎం రేవంత్ బావమరిదికి కేంద్రంలో రూ.1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టు
ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీకి రూ.1,660 కోట్ల కాంట్రాక్టు
సీఎం రేవంత్, సీఎం రమేశ్ కుంభకోణాలపై ఉమ్మడిగా చర్చించేందుకు సిద్ధం
‘ఎక్స్’ వేదికగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ /సాక్షి, అనకాపల్లి: ‘దేశంలో ఎక్కడా లేని రీతిలో దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీ యం తెలంగాణలో జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిదికి రూ.1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టు ఇచి్చంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ.1,660 కోట్ల రోడ్డు కాంట్రాక్టు కట్టబెట్టింది. ఇంతకంటే దిగజారుడు రాజకీయం..దౌర్భాగ్యపు దందా మరొకటి ఉండదు. ఎక్కడా లేని ఫ్యూచర్‌సిటీ రోడ్డు కోసం రూ.1,660 కోట్ల కాంట్రాక్టు విడ్డూరం’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
ఇద్దరూ కలిసి చేసిన దొంగతనం బయటపడటంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు పనికిమాలిన కథలు చెబుతున్నారని ‘ఎక్స్’వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు దోచుకునే లుచ్చా పనికి సహకరించినందుకు ఒక రోడ్డును సృష్టించారు. నిబంధనలను అతిక్రమించి కాంట్రాక్టును అనుకున్న వారికి కట్టబెట్టడం సీఎం రేవంత్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. రూ.10 వేల కోట్ల దోపిడీకి సహకరించినందుకు సీఎం రమేశ్‌కు దక్కిన రిటర్న్ గిఫ్ట్ రూ.1660 కోట్లు.
ఈ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అనే పసలేని చెత్త అంశాన్ని తెరమీదకు తెస్తున్నారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టి ఇక్కడి ప్రజల కోసం పోరాడే పార్టీ ఇప్పటికీ, ఎప్పటికీ ఏ పారీ్టలోనూ విలీనమయ్యే ప్రసక్తే లేదని ప్రజలకు తెలుసు. ఇరకాటంలో పడిన ప్రతీసారి కాంగ్రెస్, బీజేపీ విలీనం అంటూ తెలంగాణ ప్రజలను గందరగోళానికి గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రమేశ్, సీఎం రేవంత్ ఇద్దరూ కలిసి వస్తే రూ.10 వేల కోట్ల హెచ్‌సీయూ భూముల కుంభకోణం, రూ.1660 కోట్ల రోడ్డు కుంభకోణంపై చర్చించేందుకు సిద్ధం’అని కేటీఆర్ ప్రకటించారు.
అదంతా అవాస్తవం: సీఎం రమేశ్
అంతకుముందు బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అనకాపల్లిలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో తాను కుమ్మకై కాంట్రాక్ట్ పొందాననేది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. అయితే, కేటీఆర్ ప్రశ్నించిన అంశాలకు సమాధానం ఇవ్వడానికి బదులుగా.. బీఆర్‌ఎస్, కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలకే సీఎం రమేశ్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కేటీఆర్‌కు తన సోదరితో ఉన్న ఇంటిపోరుతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి కేటీఆర్ మాట్లాడింది గుర్తుందా అని ప్రశ్నించారు. కావాలంటే తన ఇంటికి వచ్చిన సీసీ ఫుటేజీని మీడియాకు పంపిస్తానన్నారు. తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అవినీతి బయటపడకుండా, తన సోదరి కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బీజేపీలోకి బీఆర్‌ఎస్‌ను కలపడానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ చెప్పిన మాటలు గుర్తులేవా అని నిలదీశారు.