ఉప ఎన్నికను ఆషామాషిగా తీసుకోవద్దు
మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం
ఈ ఎన్నికతో మనందరి భవిష్యత్తు ముడిపడి ఉంది
బూత్ స్థాయి మేనేజ్‌మెంట్ పకడ్బందీగా జరగాలి
ప్రతిపక్షాల ఆరోపణలకు వెంటనే కౌంటర్లు ఇవ్వండి
సోషల్ మీడియానూ మంత్రులు పర్యవేక్షించాలి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఆషామాషీగా తీసుకోవద్దని మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ ఎన్నిక ఫలితంతో తనతోపాటు మంత్రులందరి భవిష్యత్తు ముడిపడి ఉందని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఉప ఎన్నిక ఫలితం సానుకూలంగా వస్తుందనే ధీమాతో ఉండొద్దని, మంత్రులు ఈ ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం తన క్యాంపు కార్యాలయం సమీపంలో ఆయన కేబినెట్ సహచరులకు లంచ్ ఏర్పాటు చేశారు. అంతకుముందు దాదాపు గంటన్నరకు పైగా అక్కడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార సరళిని ఆయన సమీక్షించారు.
ఈ సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ఉప ఎన్నికలో గెలవాల్సిన ఆవశ్యకతను మంత్రులకు వివరించారు. జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతున్న తీరును అధిష్టానం కూలంకషంగా పరిశీలిస్తోందని, డివిజన్లవారీగా బాధ్యతలు తీసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్ల పనితీరు గురించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోందని చెప్పారు. డివిజన్లు, బస్తీలతో సహా బూత్ స్థాయిలో ప్రచార మేనేజ్‌మెంట్ పకడ్బందీగా జరగాలని, ఈ వారం రోజులపాటు ప్రతి మంత్రి ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుని పనిచేయాలని సూచించారు.
‘ఈ ఎన్నికల్లో ఓడినా, గెలిచినా సీఎంగా నా ఒక్కడిపైనే ప్రభావం ఉండదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ఓ ఇమేజ్ కల్పిస్తుంది. ఈ ఎన్నికలో సానుకూల ఫలితం రాకపోతే నాతోపాటు వ్యవస్థకు నష్టం చేస్తుంది. డూ ఆర్ డై తరహాలో ఈ ఎన్నికను తీసుకోవాలి. తూతూమంత్రపు వ్యవహారాలకు స్వస్తి చెప్పి మీ సొంత ఎన్నికలా తీసుకుని పనిచేయండి. మంచి మెజార్టీతో ఈ ఎన్నికలో గెలవాలి’అని దిశానిర్దేశం చేశారు.
కౌంటర్లు ఇవ్వకపోతే ఎలా?
ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టండంలో, సోషల్ మీడియా ప్రచారంలో ఆశించిన మేర మంత్రులు పనిచేయడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. బీఆర్‌ఎస్ పదేళ్లలో చేసిన విధ్వంసాన్ని అధిగమిస్తూ రాష్ట్ర ప్రజలకు అవసరమైన అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని, హైదరాబాద్ నగరంలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఈ విషయాలను జూబ్లీహిల్స్ ఓటర్లకు వివరంగా చెప్పాలని మంత్రులకు సూచించారు.
బీఆర్‌ఎస్, బీజేపీ విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆదేశించారు. సోషల్‌మీడియాలో బీఆర్‌ఎస్ చేస్తున్న దు్రష్పచారాన్ని తిప్పికొట్టేందుకు స్వయంగా మంత్రులే సోషల్ మీడియాను పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వారియర్లను అప్రమత్తం చేయాలని కోరారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలను వెంటనే తిప్పికొట్టేలా ప్రణాళిక రూపొందించుకోవాలని, సెంటిమెంట్‌ను ఉపయోగించుకోవాలని చూస్తున్న బీఆర్‌ఎస్ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథం, పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామితోపాటు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


